Gudivada Amarnath: చంద్రబాబుకు ఐటీ నోటీసులపై ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పందించారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు అవినీతి చిట్టా బయటకొస్తోందన్నారు. హిందుస్తాన్ టైమ్స్ కథనంలో బాబు అవినీతి బహిర్గతమైందన్నారు. నేను సత్యహరిశ్చంద్రుడిని అని చెప్పే బాబు ఇప్పుడేమంటారు? అని ప్రశ్నించారు. (Gudivada Amarnath)
చంద్రబాబు అవినీతి చక్రవర్తి అని మంత్రి అమర్‌నాథ్ ఆరోపించారు. చంద్రబాబు అవినీతిపై గతంలోనే మేం చెప్పామన్నారు. హిందుస్తాన్ టైమ్స్ కథనంపై ఎందుకు స్పందించడం లేదు? అని ప్రశ్నించారు. ఆ పత్రికపై లోకేష్ కేసు పెడతారా? అని నిలదీశారు. పీఏ ద్వారా చంద్రబాబు ముడుపులు తీసుకున్నట్లు వెల్లడైందన్నారు. డొల్ల కంపెనీలు పెట్టి అవినీతి సొమ్ము ట్రాన్స్‌ఫర్ చేశారన్నారు.
రూ. 118 కోట్ల ముడుపులపై ఎందుకు మాట్లాడం లేదు? అని చంద్రబాబును గుడివాడ అమర్‌నాథ్ ప్రశ్నించారు. చంద్రబాబు ఇష్టానుసారం ప్రజల సొమ్మును దోచేశారన్నారు. తమకు సంబంధం లేదని ఎందుకు చెప్పలేకపోతున్నారన్నారు. ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులపై నోరు మెదపరెందుకు? అని ప్రశ్నలు గుప్పించారు.
రాజధాని పేరుతో అవినీతి దందాకు పాల్పడ్డారని మంత్రి అమర్‌నాథ్ ఆరోపించారు. తన అవసరాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు చంద్రబాబు తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. పొత్తుల కోసం చంద్రబాబు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. భవిష్యత్తు గ్యారెంటీ అంటూ కొత్త పాట అందుకున్నారన్నారు. గతంలో 600 హామీలిచ్చిన బాబు ఎన్ని అమలు చేశారు? అని ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్ అని మోసం చేశారని మంత్రి గుడివాడ అమర్నాథ్ గుర్తు చేశారు.