Endowment Outsourcing Jobs: దేవాదాయ శాఖలో ఇంజనీరింగ్ పోస్టుల కొరతను అరికట్టేందుకు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పోస్టులు భర్తీ చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. అవసరం మేరకు సహాయక ఇంజనీర్లను, సూపర్వైజర్లను, టెక్నికల్ అసిస్టెంట్లను, డ్రాప్టుమ్యాన్లను, స్తపతులను, డిప్యూటీ స్తపతులను ఇంజనీరింగ్ స్టాప్ కాలేజీ ద్వారా అవుట్ సోర్సింగ్ పై భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. (Endowment Outsourcing Jobs)
దేవాదాయ ధర్మాదాయ శాఖ పనుల టెండర్లలో పారదర్శకతకు పెద్దపీఠ వేసే విధంగా నిర్ణయాలను తీసుకున్నామని మంత్రి తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులతో సమీక్ష అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. దేవాదాయ శాఖలో పెద్ద ఎత్తున కాంట్రాక్టు వర్కులు జరుగుతున్నాయని, అయితే కాంట్రాక్టు పనుల్లో నాణ్యతకు పెద్ద పీఠవేసే విధంగా కాంట్రాక్టర్లలో పోటీ తత్వాన్ని పెంచేందుకు పలు చర్యలు తీసుకున్నామన్నారు.
అదే సమయంలో వారికి చెల్లించాల్సిన పేమెంట్ల విషయంలో జాప్యాన్ని నివారించేందుకై కమిషనరేట్ కార్యాలయంలో ఒక అక్కౌంట్స్ విభాగాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కాంట్రాక్టు పనులన్నింటికి ఈ అక్కౌంట్స్ విభాగం ద్వారానే చెల్లింపులు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రంలోని పలు దేవాలయాల అభివృద్దికై కోట్లాది రూపాలు వెచ్చిస్తూ పలు అభివృద్ది కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. దాదాపు రూ.225 కోట్ల అంచనా వ్యయంతో విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవాలయం, రూ.150 కోట్లతో శ్రీశైలం శ్రీ బ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారి దేవాలయం తో పాటు కాణిపాకం, శ్రీకాళహస్తి, అన్నవరం దేవాలయాల అభివృద్ది పనులను ఇప్పటికే చేపట్టడం జరిగిందన్నారు. అదే విధంగా సింహాచలం, ద్వారకా తిరుమల దేవాలయాల అభివృద్ది పనులను కూడా త్వరలో చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకై ఇప్పటికే పలు టెండర్లను పిలవడం జరిగిందన్నారు.
ఈ టెండర్ల ఖరారు మరియు అభివృద్ది పనులన్నీ ఎంతో పారధర్శకంగా జరిగే విధంగాను మరియు రూ.5 కోట్లకు పైబడిన దేవాలయాల అభివృద్ది పనుల టెండర్ల పర్యవేక్షణకుగాను దేవాదాయ శాఖ కమిషనర్ అద్యక్షతన రాష్ట్ర స్థాయి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా పలు దేవాలయాల్లో ప్రసాదాలు తయారీకి ఉపయోగించే ప్రధాన పదార్థాల రేట్లలో వ్యత్యాసాన్ని గమనించడం జరిగిందని, ఈ వ్యత్యాసాన్ని నియంత్రించేందుకు ప్రధాన పదార్థాల రేట్లను రాష్ట్ర స్థాయిలో నిర్ణయించేందుకు ఒక రాష్ట్ర స్థాయి టెండర్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేవాలయాల్లో ప్రసాదాల నాణ్యతను పరీక్షించేందుకు ఎన్.ఏ.బి.ఎల్. ఆమోదం పొందిన ల్యాబ్ తో ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు తెలిపారు.
దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో శ్రీవాణి ట్రస్టు ద్వారా దాదాపు రూ.300 కోట్లతో 3000 నూతన దేవాలయాల నిర్మాణ పనులు మరియు దాదాపు రూ.500 కోట్ల అంచనా వ్యవయంతో పలు దేవాలయాల పునరుద్దరణ పనులను నిర్వహించడం జరుగుచున్నదన్నారు. అయితే ఈ పనుల నిర్మాణానికి అవసరమైన ఇంజనీరింగ్ సిబ్బంది లేకపోవడం వల్ల పలు సమస్యలను ఎదుర్కోవడం జరుగుతోందన్నారు.
ప్రతి జిల్లాలోనూ దేవాలయం వారీగా ఉన్న భూముల గుర్తింపు కార్యకంమం మంచి పురోగతిలో ఉందన్నారు. ఇప్పటి వరకూ దాదాపు 4,07,486 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించడం జరిగిందని, ఇందులో దాదాపు 2,80,712 ఎకరాల భూమి వివరాలను వెబ్ సైట్లో నమోదు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా దాదాపు 61 వేల ఎకరాల వాణిజ్య, అటవీ, నదీపరీవాహక ప్రాంతాల భూమిని కూడా గుర్తించడం జరిగిందని, వీటి వివరాలను 43 రిజిష్టరులో నమోదు చేయడం జరిగిందన్నారు. ఇకపై ఈ భూములన్నింటినీ ఒక క్రమ పద్దతిలో నిర్వహించడం జరుగుతుందన్నారు. పట్టణ పరిధిలోని పలు దేవాదాయ భూములు ఆక్రమణకు గురయ్యాయని, దేవాదాయ భూముల పరిరక్షణ చట్టాన్ని సవరించిన నేపథ్యంలో ఆయా భూములను కూడా తిరిగి స్వాదీనం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
హిందూ దర్మం అనేది ఒక మతం కాదని మానవుడి జీవన శైలిని, నడతను తెలియజేసే ఒక మహోన్నత విధానమని మంత్రి తెలిపారు. ఈ మహోన్నత విదానాన్ని ప్రజలందరికీ తెలియజేసేందుకే గత కొద్ది మాసాల నుండి ధర్మ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు. ఇప్పటికే పలు ప్రధాన దేవాలయాల్లో మాసోత్సవాలతోపాటు ఉత్తరాంద్ర, రాయలసీమ ప్రాంతాల్లోని 6(ఎ) దేవాలయాల్లో వారోత్సవాలను నిర్వహించడం జరుగుతోందని, వచ్చే వారంలో గోదావరి జిల్లాల్లో కూడా ధర్మ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు.
ఇదీ చదవండి: AP Cabinet Meeting: అసైన్‌మెంట్ ల్యాండ్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఏపీ కేబినెట్‌లో నిర్ణయాలు..