AP Cabinet Meeting: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన నేడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయంలో సమావేశమైన కేబినెట్.. పలు కీలక నిర్ణయాలపై చర్చించారు. మధ్యాహ్నం వరకు సుమారు మూడున్నర గంటలపాటు ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తొమ్మిది నెలల్లో ఎన్నికలు రానున్నాయని, సిద్ధంగా ఉండాలని మంత్రులకు సూచించినట్లు సమాచారం. (AP Cabinet Meeting)
కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. జూలై నెలలో చేపట్టనున్న పలు సంక్షేమ కార్యక్రమాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఈనెల 18న జగనన్న తోడు పథకానికి కేబినెట్ ఆమోదం లభించిందన్నారు. ఈనెల 20న సీఆర్డీఏ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణ పనుల ప్రారంభానికి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. అలాగే ఈనెల 21న నేతన్న నేస్తం కింద లబ్ధిదారులకు నిధుల జమ చేసేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈనెల 26న సున్నా వడ్డీ కింద డ్వాక్రా మహిళలకు డబ్బు జమ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈనెల 28న విదేశీ విద్యా దీవెన కింద అర్హులైన లబ్ధిదారులకు నిధులు జమ చేయనున్నారు.
ఈనెల 28న విదేశీ విద్యా దీవెన కింద అర్హులైన లబ్ధిదారులకు నిధులను ప్రభుత్వం జమ చేయనుంది. అసైన్‌మెంట్ ల్యాండ్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిరుపేదలకు ఇచ్చిన అసైన్‌మెంట్ ల్యాండ్ విషయంలో ప్రభుత్వం ముందడుగు వేసింది. మొత్తం 63,191.84 ఎకరాల అసైన్‌మెంట్ ల్యాండ్స్, లంకభూముల విషయంలో 66,100 మందికి పూర్తి హక్కులు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 1966 రెవిన్యూ గ్రామాల్లో ఎస్సీలకు శ్మశాన వాటికలు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే దేవాదాయ శాఖ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని కేబినెట్ నిర్ణయించింది.
విద్యా సంస్థల్లో బోధనా సిబ్బంది పూర్తి స్థాయిలో ఉండాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. సాంకేతిక విద్యలో మార్పులకు అనుగుణంగా బోధనలకు ఆమోదం తెలిపినట్లు మంత్రి చెల్లుబోయిన తెలిపారు. మరోవైపు ఏపీలో టోఫెల్ పరీక్షలకు ప్రభుత్వ విద్యార్థులకు శిక్షణ కోసం ప్రముఖ విద్యా సంస్థ ఈటీఎస్ తో చేసుకున్న ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కర్నూలులో కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ కు 247 పోస్టులు మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజనకు ముందు ల్యాండ్ పర్చేజ్ స్కీం కింద దళితులకు ఇచ్చిన 16,213 ఎకరాలకు సంబంధించి వారు కట్టాల్సిన రుణాలు మాఫీ చేయనున్నారు. ఈ భూముల పై పూర్తి హక్కులను దళితులకు కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..
జగనన్న సురక్ష పై కేబినెట్ లో చర్చ జరిగింది. జగనన్న సురక్షతో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని మంత్రులు సీఎంకు తెలిపారు. ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లు అక్కడికక్కడే సచివాలయాల ద్వారా అందిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా గ్రామాల్లోని వారికి అందిస్తున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు సిద్ధం కావాలని మంత్రులకు సీఎం జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. మరో 9 నెలల్లో ఎన్నికలు ఉంటాయని చెప్పినట్లు సమాచారం. జగనన్న సురక్ష క్యాంపైన్ ను మంత్రులు పర్యవేక్షించాలని సూచించారు. గడప గడపకు మన ప్రభుత్వం పై పర్యవేక్షణ ఉండాలన్నారు. మంత్రులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని సీఎం సూచించారు.