Chandrababu and Lokesh: ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల వారాహి విజయ యాత్ర చేపట్టారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జోరుగా యాత్ర కొనసాగింది. వారాహి విజయ యాత్రల సందర్భంగా పవన్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. జనసేనలో కొత్త జోష్ వచ్చిందనడంలో సందేహం లేదు. అయితే, వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉంటాయనే ఊహాగానాలపై ఇంకా క్లారిటీ రావడం లేదు. టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయా? బీజేపీ-జనసేన మాత్రమే బరిలో ఉంటాయా? లేదా టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి జగన్‌పై సమరశంఖం పూరిస్తాయా? అనేది తేలాలంటే ఇంకాస్త సమయం పట్టేట్లుగానే ఉంది. (Chandrababu and Lokesh)
ప్రతిపక్ష నేత చంద్రబాబు (Chandrababu Naidu) మాత్రం ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ నెగ్గాలని శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవలి కాలంలో దాదాపు రెండు మూడు సార్లు పవన్‌తో సమావేశమై పొత్తుల దిశగా చర్చలు జరిపారు సీబీఎన్. అదే సమయంలో బీజేపీ (BJP) అగ్ర నాయకత్వం తనపై ఆగ్రహంగా ఉందని గుర్తించిన ఆయన.. కేంద్రంలోని పెద్దలను ప్రసన్నం చేసుకొనేందుకు కూడా ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో (Amit Shah) చంద్రబాబు భేటీ అయ్యారనే వార్తలు వచ్చినప్పటికీ ఎక్కడా ఫొటో, వీడియోలు విడుదల చేయలేదు తెలుగుదేశం పార్టీ.
సింగిల్‌గా వస్తామంటున్న అధికార పార్టీ..
మరోవైపు అధికార పార్టీ (YSRCP) మాత్రం తాము సింహం సింగిల్‌గా వచ్చినట్లు సీఎం జగన్ (CM YS Jagan) ఒంటరిగానే పోటీ చేసి ఈసారి 175 సీట్లలో గెలుస్తామంటూ టార్గెట్‌ను ప్రకటిస్తోంది. అయితే, చంద్రబాబు, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వబోమని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో పొత్తుల దిశగా అడుగులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. దీంతో అటు తెలుగుదేశం పార్టీ (Telugudesam Party) శ్రేణుల్లోనూ, ఇటు జనసేన, బీజేపీ కార్యకర్తల్లోనూ నిరుత్సాహం అలముకొంటోంది. ఏదో ఒకటి క్లారిటీ ఇస్తే ప్రజల్లోకి వెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం అన్నట్లుగా కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
సీఎం జగన్‌ను ఎదుర్కొనేందుకు తన ఒక్కడి వల్ల కాదని చంద్రబాబు చాలా కాలం కిందటే క్లారిటీకి వచ్చారు. అందుకే పవన్, బీజేపీని సపోర్ట్ కోరుతున్నారు చంద్రబాబు. అందులో భాగంగానే జనసేనానికి రోడ్ మ్యాప్ ఇచ్చి వారాహి యాత్ర చేపట్టేలా చేశారని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పవన్ తన ప్రసంగాల్లో ఈసారి కాస్త స్పీడు పెంచారు. ఏకంగా ముఖ్యమంత్రి జగన్ టార్గెట్‌గా ఏకవచనంతో పిలుస్తానని చెప్పారు. అంతేనా… జగన్‌కు మానసపుత్రికలుగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థపై కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాణ్.
కాంట్రవర్సీ కామెంట్స్‌తో పవన్‌కు పొలిటికల్ మైలేజీ..
సంక్షేమ పథకాల పేరిట వలంటీర్లు పౌరుల వ్యక్తిగత వివరాలు తీసుకొని హ్యూమన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నారంటూ సంచలన ఆరోపణలు గుప్పించారు. దీంతో అధికార పార్టీ భగ్గుమంది. వలంటీర్లు పవన్‌పై మండిపడ్డారు. పవన్ దిష్టిబొమ్మలు, ఫ్లెక్సీలు, ఫొటోలను చెప్పుల దండలు, కాల్చివేతలు చేశారు. దీంతో రాష్ట్రంలో జగన్ చరిష్మా తర్వాత పవన్ కల్యాణే ఫోకస్ అయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు ఇలా అధికార పార్టీ మొత్తం పవన్‌నే టార్గెట్ చేసింది. దీంతో పవన్ సినిమా హీరోలాగా పొలిటికల్ మైలేజీ కూడా తెచ్చుకున్నారు. పత్రికలు, టీవీల్లో పవన్‌కు స్పేస్ పెరిగింది.
ఇదే క్రమంలో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌కు న్యూస్‌లో స్పేస్ కరువైంది. ఓ ప్రకటన విడుదల చేయడం, లేదా చిన్న ట్వీట్ చేయడం ఇదీ చంద్రబాబు ప్రస్తుతం అనుసరిస్తున్న తీరు. మరోవైపు లోకేష్‌ను ప్రజల్లోకి పంపి పాదయాత్ర చేయిస్తున్నారు చంద్రబాబు. అయితే, లోకేష్ సభలకు రాయలసీమలోని అనంతపురం, కడప జిల్లాల్లో జనసమీకరణ బాగా చేశారు. కానీ మిగతా ప్రాంతాల్లో ఆశించిన మేరకు జనసమీకరణ కావడం లేదు. స్వచ్చందంగా వచ్చే వారి సంఖ్య నామమాత్రమే. లోకేష్ ప్రసంగాల్లోనూ జోరు లేకపోవడం, ప్రిపరేషన్ సరిగ్గా లేకపోవడంతో ట్రోలింగ్‌కు గురవుతున్నారనే వాదన ఉంది.
వార్తల్లో అయినా ఉండాలి…
మొత్తంగా అటు తనకు అనుకూలమైన మీడియాలోగానీ, అధికార పార్టీకి చెందిన మీడియాలోగానీ చంద్రబాబు, లోకేష్ వార్తలే కనిపించడం లేదంటున్నారు విశ్లేషకులు. అదే క్రమంలో రెండు వారాల పాటు పవన్ కల్యాణ్ పొలిటికల్ మైలేజీ తెచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే ఇలా స్తబ్ధుగా ఉంటే సరిపోదని, వార్తల్లో అయినా నిలవాలని తెలుగు తమ్ముళ్లు అధినేతకు సూచిస్తున్నారు.
Read Also : Chandrababu Naidu: ప్రతి ఇంటి నుంచి అమెరికా వెళ్లారంటే అది మావల్లే: చంద్రబాబు
