CS on CM Promises: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలు, వాటి అమలు పురోగతిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి నిన్న సమీక్ష నిర్వహించారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలు సత్వర అమలుకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సీఎం జగన్ జిల్లాల పర్యటన సందర్భంగా, వివిధ బహిరంగ సభల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు సహా వివిధ ప్రజా ప్రతినిధుల లేఖలకు సీఎం స్పందించి ఇచ్చిన హామీలు, ఇతర సందర్భాల్లో ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలను సమీక్షించారు. (CS on CM Promises)
మొత్తం 443 సీఎం జగన్ హామీలకుగాను ఇప్పటికే 123 హామీలకు పైగా పరిష్కరించగా ఇంకా 224 వివిధ శాఖాధిపతుల స్థాయిలో కార్యాచరణలో ఉన్నాయని సీఎస్ తెలిపారు. మరో 24 అంశాలకు సంబంధించి స్టేటస్ అప్డేట్ చేయాల్సి ఉందన్నారు. ఆర్థిక అంశాలకు సంబంధించి 72 హమీలు ఆ శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని సీఎస్ వెల్లడించారు. అనంతరం వివిధ శాఖల వద్ద పెండింగ్ లో ఉన్న సీఎం హామీలను శాఖల వారీగా ఆయన సమీక్షించారు.
పెండింగ్ లో ఉన్న సీఎం హామీలన్నిటినీ త్వరితగతిన వేగవంతంగా అమలు చేసేందుకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ జవహర్ రెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, టీఆర్ అండ్ బీ కార్యదర్శి ప్రద్యుమ్న, సిఎంవో కార్యదర్శి ఆర్.ముత్యాలరాజు, సీఎంఓ అదనపు కార్యదర్శి భరత్ గుప్త, గృహ నిర్మాణ సంస్థ ఎండీ లక్ష్మీ షా పాల్గొన్నారు. అలాగే వీడియో లింక్ ద్వారా పీఆర్ అండ్ ఆర్డీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.
Read Also : ECI on Karnataka Govt: కర్ణాటక ప్రభుత్వంపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం
