CM Jagan at Nethanna Nestham: ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై జనసేనాని పవన్ కల్యాణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ తొలిసారి రియాక్ట్ అయ్యారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో పర్యటించిన ముఖ్యమంత్రి.. వైఎస్సార్ నేతన్న నేస్తం కింద నిధులను నేరుగా బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడిన సీఎం జగన్.. దుష్టచతుష్టయమంటూ ఒక్కొక్కరినీ వరుసపెట్టి దుమ్ము దులిపేశారు. (CM Jagan at Nethanna Nestham)
వెంకటగిరి నేల నేతన్నల మగ్గాలు ప్రపంచంతో మాట్లాడే ఈ నేలగా సీఎం అభివర్ణించారు. అలాంటి గడ్డమీద నుంచి వరుసగా 5వ ఏడాది వైఎస్సార్ నేతన్న నేస్తం కార్యక్రమం జరుపుకుంటున్నామన్నారు. ఎన్నికల వేళ తాను చెప్పినట్లుగానే బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్లాస్‌లు కాదు.. బ్యాక్ బోన్ క్లాస్‌లుగా మారుస్తున్నామన్నారు. ఆ మాటకు 4 సంవత్సరాల్లో ప్రతి అడుగు, ప్రతి అక్షరంలో, ప్రతి మాటలో, ప్రతి పనిలోనూ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ కనిపించేలా అడుగులు వేస్తూ వచ్చానన్నారు. ఈ కోవలోనే నవరత్నాలను తీసుకురావడం జరిగిందన్నారు. నేతన్న నేస్తం తీసుకునిరావడం జరిగిందన్నారు. వరుసగా 5వ ఏడాది ఈ రోజుతో కలిపి చూస్తే అక్షరాలా లక్షా 20 వేల రూపాయలు ప్రతి నేతన్న చేతిలోనూ పెట్టినట్లయిందని సీఎం చెప్పారు. (CM Jagan at Nethanna Nestham)
అక్షరాలా 80,686 మంది నా చేనేత అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా బటన్ నొక్కి 194 కోట్లు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. ఈ ఒక్క పథకం ద్వారా మాత్రమే 50 నెలల కాలంలోనే 5వ ఏడాది ఇస్తూ 970 కోట్లు నా నేతన్నలకు తోడుగా నిలబడే కార్యక్రమం జరిగిందని వివరించారు. 2014-2019 మధ్య ఆత్మహత్యలు చేసుకున్న 77 నేతన్న కుటుంబాలకు కనీసం సహాయం చేయాలన్న ఆలోచన రాలేదని, ఆ 77 కుటుంబాలకు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఒక్కో కుటుంబానికి 5 లక్షలు ఇచ్చామని గుర్తుచేశారు.
హామీలిచ్చి మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశారు.
“2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వం ఎన్నో హామీలిచ్చింది. ఎన్నికల మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు. 650 హామీలు పైచిలుకు పెట్టారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ పుస్తకాన్ని ఎవరైనా అడుగుతారేమో, ప్రశ్నిస్తారేమో అని చెప్పి చెత్తుబుట్టలో పడేశారు. ఒక సిగ్గుమాలిన ప్రభుత్వం. చంద్రబాబు ప్రభుత్వంలో చూశాం. కాబట్టే నేతన్నలు ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితి వచ్చింది. లక్షన్నరతో ఉచితంగా ఇళ్లు, మగ్గం షెడ్డు కట్టిస్తామన్నారు. బడ్జెట్‌లో వెయ్యి కోట్లు ఏటా కేటాయిస్తామన్నారు. ఒక్కో కుటుంబానికి లక్ష రుణాలిస్తామన్నారు. చేనేత కార్మికులకు రుణ మాఫీ చేస్తామన్నారు. రకరకాల హామీలన్నీ చేసుకుంటూ వచ్చి చివరికి చేనేతలను మోసం చేశారు.
ఐదు సంవత్సరాలు కలిపి కనీసం 450 కోట్లు కూడా ఖర్చు చేయని అద్వానమైన పరిస్థితుల్లో నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు మనకళ్ల ముందే కనిపించాయి. ఈ పరిస్థితులు మారుస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి అడుగులోనూ ప్రతి మాటలో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నామైనార్టీ అంటూ 2.25 లక్షల కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు.. నా అక్కచెల్లెమ్మల కుటుంబాల్లోకి డబ్బులు పోతున్నాయి. ఎక్కడా లంచాలు, వివక్ష లేవు. నేరుగా డబ్బులు వెళ్లే పరిస్థితి ఈ నాలుగు సంవత్సరాల హయాంలో మీ బిడ్డ హయాంలో జరుగుతోంది.
నేతన్న నేస్తం కింద ఇప్పటిదాకా రూ.3706 కోట్ల సాయం..
ఇదే నేతన్నలకు సంబంధించి నేతన్న నేస్తానికి సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. 2019లో మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నా పుట్టిన రోజునాడు డిసెంబర్ 21న వైఎస్సార్ నేతన్న నేస్తం తీసుకొచ్చాం. ఆరోజు నుంచి వేసిన ప్రతి అడుగు.. ఈరోజుటికి వరుసగా ఐదోసారి నేతన్నలకు తోడుగా నిలబడగలిగాం. నేతన్నలకు అండగా నిలబడుతూ, వారికి ఇచ్చిన సామాజిక పింఛన్లు 1396 కోట్లు వాళ్ల చేతుల్లో పెట్టగలిగాం. నవతర్నాల్లో ఇతర పథకాల ద్వారా మరో 871 కోట్లు పెట్టగలిగాం. ఆప్కో బకాయిలు మరో 468 కోట్లు. ఈ నేతన్న నేస్తం కార్యక్రమం ద్వారా 970 కోట్లు వెరసి 3706 కోట్లు నేతన్నల సంక్షేమం కోసం మీ బిడ్డ ప్రభుత్వం దేవుడి దయతో చేయగలిగింది.
ఎక్కడ గత ప్రభుత్వం చంద్రబాబు హయాంలో 5 ఏళ్లు కలిపి 450 కోట్లు, ఎక్కడ మీ బిడ్డ ప్రభుత్వంలో 50 నెలల్లోనే 3600 కోట్లు? ఆప్కోకు జీవం పోయడమే కాకుండా మార్కెటింగ్ మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఆన్‌లైన్ ప్లాట్‌పాం తీసుకొచ్చాం. మన నేతన్నల వస్త్రాలన్నీ కూడా అమ్మే ఏర్పాట్లు జరిగింది మీ బిడ్డ ప్రభుత్వంలోనే మనసుపెట్టి చేసింది అని తెలియజేస్తున్నా. వెనుకబడిన సామాజిక వర్గాలకు, అట్టడుగున ఉన్నసామాజిక వర్గాలకు అన్ని రకాలుగా చేయి పట్టుకొని నడిపించాం.
మాట్లాడకూడదు.. అయినా తప్పని పరిస్థితి..
కొన్ని జరుగుతున్న పరిస్థితులు చూసినప్పుడు, మాట్లాడకూడదు అని ఉన్నా కూడా మాట్లాడాల్సి వస్తోంది. ఎక్కడైనా మంచి చేస్తున్న వ్యవస్థల్ని, మనుషులను సంస్కారం ఉన్న ఏ ఒక్కరూ అవమానించరు. కానీ మంచి చేస్తున్న మన వాలంటీర్ల గురించి ఇటీవల సంస్కారాలు కోల్పోయి కొందరు మాట్లాడుతున్నందు వల్ల ఈ నాలుగు మాటలు కూడా మాట్లాడాల్సి వస్తోంది. ఈ వాలంటీర్లు ఎవరూ కొత్తవారు కాదు. మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నారు. మీ అందరికీ తెలిసిన వాళ్లే. సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతి గడప దగ్గరకు కాళ్లకు బలపం కట్టుకొని వెళ్లి.. కులం, వర్గం, ప్రాంతం, పార్టీలు చూడకుండా మీ ఇంటికి చేర్చే ఇలాంటి మనవళ్లు, మనవరాళ్ల వ్యవస్థ. అదే గ్రామంలో సేవలు చేసే మన ఊరి పిల్లల మీదే కొందరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు.
స్క్రిప్టు రామోజీది, నిర్మాత చంద్రబాబు, నటన డైలాగులు దత్తపుత్రుడివి..
ఇలాంటి వారి మీద తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. స్క్రిప్టు ఈనాడు రామోజీది అయితే, నిర్మాత చంద్రబాబు, నటన మాటలు, డైలాగులు అన్నీ దత్తపుత్రుడివి. వాలంటీర్లట… స్త్రీలను లోబరుచుకుంటారని ఒకడంటాడు. గ్రామ వాలంటీర్లట.. అమ్మాయిలను హూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు.. బాంబేలకు పంపిస్తున్నాడని ఇంకొకడంటాడు నిస్సిగ్గుగా.. సిగ్గులేని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 మీడియా.. ఇటువంటి వారంతా బురద జల్లుతారు. అబద్ధాలకు రెక్కలు తొడుగుతారు. అన్యాయంగా బురద జల్లుతారు.
చంద్రబాబుకు వాలంటీర్.. ప్యాకేజీ స్టార్..
అక్షరాలా 2.60 లక్షల మంది మన పిల్లలు గ్రామస్థాయిలో సేవలు అందిస్తున్నారు. 60 శాతం నా చెల్లెమ్మలే. మన వాలంటీర్లంతా కూడా చదువుకున్న సంస్కారవంతులే. వీరంతా సేవా భావంతో పని చేస్తున్న అదే గ్రామంలో ఉన్న ఇరుగు పొరుగు పిల్లలే. ఇలాంటి వారిని మన సేవా మిత్రలు, మన సేవా రత్నాలు, సేవా వజ్రాలు అయిన మన వాలంటీర్ల క్యారెక్టర్‌ను తప్పు పట్టినది ఎవరో తెలుసా? ఒకరు పదేళ్లుగా చంద్రబాబుకు వాలంటీర్‌గా పని చేస్తున్న ప్యాకేజీ స్టార్. ఇంకొకరు చంద్రబాబు. ఇంకొకరు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. ఒక గజదొంగల ముఠా. వీళ్లు వాలంటీర్ల క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు.
నాలుగేళ్లు కాపురం చేయడం వదిలేయడం..
వాలంటీర్ల క్యారెక్టర్ ఎలాంటిదో వారి చేత సేవలందుకుంటున్న కోట్ల మందికి తెలుసు. ఈ చంద్రబాబు క్యారెక్టర్ ఎలాంటిదో, దత్తపుత్రుడి క్యారెక్టర్ ఎలాంటిదో, ఆయన సొంత పుత్రుడి క్యారెక్టర్ ఎలాంటిదో, ఆయన బావమరిది క్యారెక్టర్ ఎలాంటిదో ఇవి కూడా ప్రజలకు బాగా తెలుసు. మన వాలంటీర్లు అమ్మాయిలను లోబర్చుకున్నారా? బాబుగారి వాలంటీర్ ఇదే కార్యక్రమంగా పెట్టుకొని అమ్మాయిలను లోబర్చుకొని, పెళ్లి చేసుకొని నాలుగేళ్లు కాపురం చేయడం, మళ్లీ వదిలేయడం, మళ్లీ ఇంకొకర్ని పెళ్లి చేసుకోవడం మళ్లీ వదిలేయడం, మళ్లీ పెళ్లి, మళ్లీ వదిలేయడం.. ఒకరితో వివాహ బంధంలో ఉండగానే ఇంకొకరితో అక్రమ సంబంధం. ఈయన మన వాలంటీర్ల క్యారెక్టర్ గురించి మాట్లాడతాడు. ఇలాంటి క్యారెక్టర్ ఒకరిది.
పట్ట పగలే మందు తాగుతూ డ్యాన్సులు..
పట్టపగలే మందు తాగుతూ 10 మంది అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్ పక్కనే డ్యాన్సులు చేసే వాడు ఇంకొకడు. యూట్యూబ్‌లోకి వెళ్లి చూస్తే ఎంత నిస్సిగ్గుగా డ్యాన్సులు చేస్తూ కనిపిస్తాడు ఇంకొకడు. ఇంకొకరు.. అమ్మాయి కనిపిస్తే చాలు.. ముద్దన్నా పెట్టాలి, కడుపన్నాచేయాలి అని ఇంకొకడు దౌర్భాగ్యుడు అంటాడు. ఇంకొక క్యారెక్టర్ ఉంది. వయసు 75 ఏళ్లు అయినా సిగ్గు లేదు. టీవీల్లోకి వచ్చి ఒక షోలో మాట్లాడతాడు. ఆహా బావ.. నువ్వు సినిమాల్లో చేశావు. నేను నిజజీవితంలో చేశాను అంటూ చేసిన వెధవ పనుల్ని గొప్పగా చెప్పుకొనే ముసలాయన ఇంకొకడు. ఇలాంటి వారు క్యారెక్టర్ లేని వీరంతా మంచి చేస్తున్న మన వాలంటీర్ల గురించి తప్పుడు మాటలు ప్రచారం చేస్తుంటే ఇది కలియుగం కాకమరేమిటి? మంచి చేయకుండా ఆపేందుకు ఎన్ని కుయుక్తులు పన్నుతున్నారు క్యారెక్టర్ లేని ఇలాంటి వాళ్లు.
వీరి మెదడులో అన్నీ పురుగులే కనిపిస్తాయి…
వీళ్ల పర్సనల్ లైఫ్‌లోనూ, పబ్లిక్ లైఫ్‌లోనూ అంతే. అన్నీ కుళ్లు బద్ధులు, కుట్రబుద్ధులు, పురుగులే కనిపిస్తాయి. బీజేపీతో పొత్తు, చంద్రబాబుతో కాపురం. ఇచ్చేది తన పార్టీ బీ ఫామ్ నిజానికి టీడీపీకి బీటీమ్. చంద్రబాబు మీద పోటీ ఓ డ్రామా, బీజేపీతో స్నేహం మరో డ్రామా, తనది ప్రత్యేక పార్టీ అనేది ఇంకో డ్రామా. నిజమేమిటి అంటే స్క్రిప్టు ఈనాడు రామోజీ రావుది, నిర్మాత చంద్రబాబు, నటన, మాటలు డైలాగులు అన్నీ చంద్రబాబువి. ఎందుకు ఈ స్థాయికి దిగజారిపోయారు అంటే వీరికి మంచి చేసిన చరిత్ర ఏదీ లేదు. ఉన్నదంతా వంచన, వెన్నుపోట్లు, ఇదీ వీళ్ల జీవిత చరిత్ర.
ఇదీ మా చరిత్ర..
మరో వంక మీ బిడ్డ ప్రభుత్వంలో 50 నెలల్లోనే ఏకంగా 2.25 లక్షల కోట్లు నేరుగా బటన్ నొక్కి నా అక్కచెల్లెమ్మల అకౌంట్లలోకి ఒక్కరూపాయి లంచం లేకుండా వివక్ష లేకుండా బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా పంపడం మన చరిత్ర. నా అక్కచెల్లెమ్మల పేర్లతో వారికి తోడుగా నిలబడుతూ 30 లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం.. ఇదీ మన చరిత్ర. 22 లక్షల ఇళ్ల నిర్మాణం 30 లక్షల ఇళ్ల పట్టాలు. ఇది మన చరిత్ర. ప్రతి ఏటా 44 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ 84 లక్షల మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఇప్పటికే 26 వేల కోట్లకు పైగా అమ్మ ఒడి పథకం ద్వారా తోడుగా నిలబడటం దేశంలో ఎక్కడా జరగని విధంగా చేయడం మన చరిత్ర.
దాదాపు కోటి మంది పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు ఆసరాగా తోడుగా నిలబడుతూ 19178 కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్డడం. సున్నా వడ్డీ కింద అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడుతూ 3615 కోట్లు పెట్టడం.. ఇప్పటికే ఈ 50 నెలల కాలంలోనే మనం చేసిన ఈ మంచి మరో చరిత్ర. ఇది మీ బిడ్డ చరిత్ర. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అక్కచెల్లెమ్మలకు దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా చేయూత అనే పథకాన్ని తీసుకొచ్చి నా అక్కచెల్లెమ్మల చేతుల్లో 14129 కోట్లు పెట్టడం ఇదీ మన చరిత్ర.
రైతు భరోసాగా ఇప్పటికే దాదాపు 50 లక్షల పైచిలుకు రైతన్నలకు 31వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం.. రైతన్న అకౌంట్లలోకి నేరుగా వెళ్లిపోవడం.. ఇదీ మన చరిత్ర. విద్యాదీవెన, వసతి దీవెన కోసం 15 వేల కోట్లు ఇవ్వడం.. ఇదీ మన చరిత్ర. ప్రతి గ్రామంలో రూపురేఖలుమారుతున్నాయి. వాలంటీర్లు కనిపిస్తారు. సెక్రటేరియట్ వ్యవస్థ, ఆర్బీకేలు, నాలుగు అడుగులు వేస్తే విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, మారుతున్న ఈ గ్రామం ఇదీ మన చరిత్ర. 108, 104 వాహనాలు.. 1600 పైచిలుకు వాహనాలు కుయ్ కుయ్ కుయ్ అంటూ వినిపిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ రూపురేఖలు మారుతున్నాయి. గతంలో 1000 రోగాలకు పరిమితమైతే మీ బిడ్డ ప్రభుత్వంలో 3250 రోగాలకు విస్తరించాం. ఆరోగ్య ఆసరా తీసుకొచ్చాం. కోవిడ్‌పై మనం చేసిన యుద్ధం.. ఇవన్నీ ఇంకో చరిత్ర. ఇదీ మన చరిత్ర.
ఒక అమ్మ ఒడి, ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం ద్వారా మహిళా సాధికారత విషయంలో దేశం మొత్తం ఆంధ్రరాష్ట్రం వైపు చూసేట్టులగా చేసిన చరిత్ర ఇదీ మన చరిత్ర. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ 50 శాతం నామినేటెడ్ పదవులు, కాంట్రాక్ట్ పదవులు చట్టం చేసి అమలుచేస్తున్నచరిత్ర. ఇదీ మన చరిత్ర. అసైన్డ్ భూముల మీద హక్కుల ఇచ్చిన చరిత్ర. రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా చేసిన చరిత్ర ఇదీ మన చరిత్ర. 2 లక్షలకు పైగా చుక్కల భూములను సైతం రిజిస్ట్రేషన్లు చేసుకోలేని పరిస్థితులను మార్చి, సమస్యలను తొలగించి రైతన్నల చేతుల్లో పెట్టిన చరిత్ర. ఇదీ మన చరిత్ర.
మేనిఫెస్టో అంటే చంద్రబాబు మాదిరిగా కాదు.. చెత్తబుట్లో పడేయడం కాదు.. మేనిఫెస్టో అంటే ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించాం. 98 శాతం హామీలను నెరవేర్చి గడపగడపకూ తిరిగి మేనిఫెస్టో వాళ్ల చేతుల్లో పెడుతూ మీ బిడ్డను ఆశీర్వదించండి.. అని అడుగుతున్న చరిత్ర. ఇదీ మన చరిత్ర. 26 జిల్లాలు చేసిన చరిత్ర మనది. 2 లక్షల 6 వేల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర. ఇదీ మన చరిత్ర. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన చరిత్ర కూడా మన చరిత్రే. స్వతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 11 ఉంటే ఈ నాలుగేళ్లలో 17 కడుతున్నాడు మీ బిడ్డ. ఇదీ మన చరిత్ర. 4 లొకేషన్లలో 6 పోర్టులు ఉంటే నాలుగు సంవత్సరాల కాలంలో మీ బిడ్డ మరో 4 పోర్టులు కడుతున్నాడు. ఇదీ మన చరిత్ర. 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కనిపిస్తున్నాయి. ఇవన్నీ బాధ్యతతో మమకారం, పేదలపట్ల ప్రేమతో చేస్తున్నాం.
తేడా గమనించండి.. మంచి జరిగి ఉంటేనే తోడుగా నిలబడండి..
ఇంతకు ముందుకు ఇప్పటికి తేడా చూడండి. ఒక మనిషి విషయంలో, క్యారెక్టర్, విశ్వసనీయత, మేనిఫెస్టోకు ఇస్తున్న విలువ.. ఎలాంటి పాలన మనకు కావాలో ఆలోచన చేయమని అడుగుతున్నా. వాళ్ల మాదిరిగా ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఒకే అబద్ధం అదే నిజమని నమ్మించే మీడియా సామ్రాజ్యం లేదు. ఒక దత్తపుత్రుడిని నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకున్నది దేవుడి దయను, మిమ్మల్ని తప్ప ఇంకొకర్ని నమ్ముకోలేదు. రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు చెబుతారు.
వాలంటీర్ల గురించి ఏ రకంగా దుష్ప్రచారం చేస్తున్నారో మీ బిడ్డ గురించి, ప్రభుత్వం, ఎమ్మెల్యేలు, మంత్రుల గురించి ఇంకా దారుణంగా అబద్ధాలు చెబుతారు. ఇవేవీ నమ్మొద్దు. కేవలం ఒకటే ఒకటి కొలమానంగా తీసుకోండి. మీ బిడ్డ ప్రభుత్వం ద్వారా మీకు మంచిజరిగిందా లేదా అనేది కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి. దేవుడి చల్లని దీవెనలు, మన ప్రభుత్వం పట్ల మీ అందరి పట్ల ఇంకా చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.” అంటూ సీఎం జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.