Vizag Inorbit mall: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ విశాఖపట్నంలో పర్యటించారు. కైలాసపురం వద్ద ఇనార్బిట్ మాల్‌కు భూమిపూజ చేశారు. రూ. 600 కోట్లతో 15 ఎకరాల స్థలంలో మాల్‌ను నిర్మిస్తున్నారు. GVMC చేపట్టిన రూ. 136 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం వైస్ జగన్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్.. విశాఖలో ఒక ఆణిముత్యంగా నిలిచిపోయే ప్రాజెక్టు ఇది అని తెలిపారు. (Vizag Inorbit mall)
విశాఖ అభివృద్ధికి ఈ మాల్ దోహదపడుతుందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. మాల్ నిర్మాణంతో విశాఖ రూపురేఖలు మారిపోతాయన్నారు. ఇనార్బిట్ మాల్‌తో 8 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. రెండున్నర ఎకరాలను ఐటీ కోసం కేటాయిస్తారన్నారు. ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. అదానీ డేటా పార్కు, ఐటీ స్పేస్‌కు ఇప్పటికే శంకుస్థాపన చేసుకున్నామన్నారు.
భోగాపురం ఎయిర్‌పోర్టుకు సైతం భూమిపూజ చేసినట్లు సీఎం జగన్ గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని జగన్ పేర్కొన్నారు. ఫైవ్ స్టార్ హోటల్ కూడా నిర్మించాలని రహేజా గ్రూప్ ఆసక్తిగా ఉందని జగన్ పేర్కొన్నారు. రహేజా గ్రూప్‌కు అన్ని విధాలుగా సపోర్ట్ ఇస్తామని భరోసా ఇచ్చారు. ఒక్క ఫోన్‌కాల్‌తో అందుబాటులో ఉంటామంటూ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
“హేజా గ్రూపు దేశంలో పలుచోట్ల ఫైవ్ స్టార్ హోటళ్లు కట్టారు. అదే మాదిరిగా మన రాష్ట్రంలో రాజ్‌విలాస్ తరహాలో సూపర్ లగ్జరీ ఫైవ్‌స్టార్ ప్లస్, సెవెన్ స్టార్ హోటల్ కట్టబోతున్నారు. ఇప్పటికే ఒబెరాయ్, మేపెయిర్ హోటల్స్ గ్రూపు వాళ్లు కూడా కడుతున్నారు. ఆ తరహాలో రహేజా గ్రూపు కూడా సెవెన్ స్టార్ లగ్జరీ రిసార్ట్‌ల నిర్మాణంలో మూడో గ్రూపు కానుంది. ఇవన్నీ విశాఖలో గొప్ప ప్రాజెక్టులుగా నిలుస్తాయి.
అదే విధంగా హిందూపూర్‌లో కూడా 350 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్, టెక్ట్స్‌టైల్స్‌కు సంబంధించిన పార్కు రాబోతుంది. దానివల్ల మరో 15వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఆ ప్రాజెక్టుకు కూడా అడుగులు ముందుకు వేశాము… యుద్ధ ప్రాతిపదికన అది కూడా టేకప్ చేస్తామన్నారు. దానికి కూడా ప్రభుత్వం సపోర్టు చేస్తుంది.
ఈ రోజు మీ అందరి ద్వారా రహేజా గ్రూపు అధ్యక్షుడు నీల్‌కు చెప్తున్నాను. మేము మీకు ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటాం. కేవలం ఒక్క ఫోన్‌కాల్ దూరంలోనే మీకు అందుబాటులో ఉంటాం. ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని… పెట్టుబడులు పెట్టండి. మిగిలిన రాష్ట్రాల కంటే మిన్నగా… ఏపీలో పారిశ్రామికవేత్తలకు ఏ విధంగా సహాయ, సహకారాలు అందిస్తామో మీరు కచ్చితంగా చూస్తారు. దేవుని దయవలన వీళ్లు మరింత బాగుపడి.. మన ప్రాంతంలో అభివృద్ధి జరగాలని ఆకాంక్షిస్తున్నాను.” అని సీఎం జగన్ పేర్కొన్నారు.
Read Also : CM YS Jagan Review: భారీ వర్షాలు, వరద ప్రవాహం, సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష