AP Jobs: ఏపీలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లకు సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అతి త్వరలో నోటిఫికేషన్ (AP Jobs) విడుదల కానుంది. 1000కిపైగా పోస్టులు భర్తీ చేయనున్నారు. గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి (AP Jobs) సంబంధించిన నోటిఫికేషన్ జారీకి సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశంపై ముఖ్యమంత్రికి అధికారులు ఈ పోస్టుల భర్తీపై వివరాలు అందించారు. దీంతో సీఎం వెంటనే స్పందించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకున్నామని పేర్కొన్నారు.
నోటిఫికేషన్ జారీకి అవసరమైన కసరత్తు తుదిదశలో ఉందని తెలిపారు. గ్రూప్-1కి సంబంధించి సుమారు 100కిపైగా పోస్టులు, గ్రూప్-2కు సంబంధించి సుమారు 900కిపైగా పోస్టులు, మొత్తంగా 1000కిపైగా పోస్టులు భర్తీ చేయనున్నామని అధికారులు వెల్లడించారు. వీలైనంత త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు. పరీక్షల నిర్వహణ, ఫలితాలు వెల్లడి తదితర అంశాలపైనా దృష్టిసారించాలని సీఎం జగన్ సూచించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
ఏపీలో ఉద్యోగాల భర్తీ కోసం యువత వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల కోసం నిరుద్యోగులు చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు. తాజాగా వస్తోన్న వార్తలు నిరుద్యోగులకు ఊరటనిచ్చేలా ఉన్నాయి. సిలబస్ మార్పులపై ఇంకా స్పష్టమైన ఆదేశాలు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతమైతే ప్రాథమికంగా పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే అధికారులు గ్రూప్ 1,2లో ఏయే పోస్టులను భర్తీ చేయనున్నారు, సిలబస్ ఎలా ఉంటుందన్న దానిపై మరింత స్పష్టత వచ్చే వీలుంది.
ఎన్నికల ఏడాది కావడంతో నిరుద్యోగుల నుంచి ఎదురయ్యే వ్యతిరేకతను తప్పించుకోవడానికి జగన్ ప్రభుత్వం ఉద్యోగాల నోటిషికేషన్లు విరివిగా ఇవ్వాల్సి ఉందని రాజకీయ నేతలు చెబుతున్నారు. ఏటా జనవరిలోనే ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేసి ప్రాధాన్య క్రమంలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రతిపక్ష నేతగా ఉండగా వైఎస్ జగన్ హామీలు ఇచ్చారు. డీఎస్సీ నోటిఫికేషన్ కోసం కూడా చాలా మంది యువత ఎదురు చూస్తున్నారు. కనీసం ఎన్నికల ఏడాదైనా డీఎస్సీ నోటిఫికేషన్ రాకపోతుందా? అని ఆశతో ఉన్నారు. కొన్ని నెలల కిందట టీచర్ ఎలిజబులిటీ టెస్ట్ నిర్వహించిన సంగతి తెలిసిందే.
మరోవైపు జగన్ అధికారంలోకి వచ్చాక ప్రారంభంలోనే గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పాలనలో ఇవి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయనడంలో సందేహం లేదు. ఇది వరకు ఏ సంక్షేమ పథకం కావాలన్నా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ప్రస్తుతం గడప వద్దకే పరిపాలన, సంక్షేమ పథకాలు వెళ్లడంతో చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.34 లక్షల ఉద్యోగాలు ఏర్పాటు చేశారు సీఎం జగన్. మరోవైపు వైద్య రంగంలోనూ విప్లవాత్మక చర్యలు తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ సహా వైద్య రంగంలోనే 49 వేల పోస్టులను భర్తీ చేయాలని టార్గెట్ పెట్టుకొని ఇప్పటికే 75 శాతంపైగా ఉద్యోగాలు భర్తీ చేశారు. దాంతోపాటు వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి గడప వద్దకే సంక్షేమ కార్యక్రమాలు చేరవేసేలా జగన్ చేస్తున్నారు.
Read Also : Grama Ward Sachivalayam: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త!