Chandrababu Remand: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారనే అభియోగాలపై ఏపీ సీఐడీ చంద్రబాబును అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సుదీర్ఘంగా 40 గంటలకుపైగా వాదప్రతివాదాల అనంతరం చంద్రబాబుకు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో చంద్రబాబును రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. అర్ధరాత్రి తర్వాత రాజమండ్రి జైలుకు చంద్రబాబు చేరుకున్నారు. (Chandrababu Remand)
రాజమండ్రి జైల్లో చంద్రబాబు
జైలులో చంద్రబాబుకు స్నేహా బ్లాక్ కేటాయించారు. చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691 కేటాయించారు. చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాల్సిందిగా కోర్టు ఆదేశించడంతో ఆ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 22 వరకు రిమాండ్ విధించారు. మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కావడంతో ప్రత్యేక వసతి కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబుకు కావాల్సిన మందులు, వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు. చంద్రబాబుకు ఇంటి ఆహారం తీసుకునేందుకు అనుమతించాలని సూచించారు.రాజమండ్రి సిటీ వ్యాప్తంగా 36 పోలీస్ పికెటింగ్ లు ఏర్పాటు చేశారు. సెంట్రల్ జైలు దగ్గర 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
జైలులో చంద్రబాబుకు వైద్య పరీక్షలు పూర్తి
చంద్రబాబుకు జైలు సిబ్బంది అల్ఫాహారం అందజేశారు. చంద్రబాబుకు బ్రేక్ ఫాస్ట్ గా ఫ్రూట్ సలాడ్ అందించారు. అల్ఫాహారంతో పాటు వేడి నీళ్లు, బ్లాక్ కాఫీ అందించారు. చంద్రబాబు నివాసం నుంచి అల్ఫాహారం, మెడిసిన్ తెప్పించారు. అర్ధరాత్రి రెండున్నర సమయంలో స్నేహ బ్లాక్ లోకి చంద్రబాబు ఎంటర్ అయ్యారు. తెల్లవారుజామున 4 గంటలకు చంద్రబాబు నిద్రపోయినట్లు తెలుస్తోంది.
ఉదయం నిద్ర లేచిన తర్వాత యోగా చేసినట్లు సమాచారం. ఇవాళ జైల్లో చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి కలవనున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర 144 సెక్షన్ అమలులో ఉంది. బారికేడ్స్ తో జైలుకు వెళ్లే రోడ్డును పోలీసులు బ్లాక్ చేశారు. డీఎస్పీ నేతృత్వంలో జైలు దగ్గర భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.
నేడు చంద్రబాబు కస్టడీ పిటిషన్ విచారణ
చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. విజయవాడ ఏసీబీ కోర్టులో కస్టడీ పిటిషన్ విచారణ కొనసాగనుంది. చంద్రబాబు కస్టడీకి సీఐడీ పిటిషన్ వేసింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ కస్టడీకి కోరింది. కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు లాయర్ల కు కోర్టు ఆదేశించింది.
ఏపీలో 144 సెక్షన్ విధింపు
రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించింది పోలీసు శాఖ. ర్యాలీలు, సభలకు అనుమతి నిరాకరించింది. అల్లర్లు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. మరోవైపు చంద్రబాబు అరెస్ట్, సీఐడీ వ్యవహరించిన తీరుపై నేడు గవర్నర్ ను టీడీపీ నేతలు కలవనున్నారు. ఆయనకు వినతిపత్రం ఇవ్వనున్నారు.
నేడు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన టీడీపీ
చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ టీడీపీ బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌కు స్వచ్ఛందంగా సహకరించాలని ప్రజలను కోరింది. టీడీపీ తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్‌కు జనసేన పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. టీడీపీ బంద్‌కు సీపీఐ, ఎంఆర్‌పీఎస్ తదితర ఛోటా పార్టీలు సైతం మద్దతు ఇచ్చాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉన్న నేపథ్యంలో బంద్ ప్రభావం చాలా ప్రాంతాల్లో కనిపించడం లేదు. టీడీపీ నేతలను చాలా చోట్ల పోలీసులు గృహనిర్బంధం చేశారు.
లండన్ లో ముగిసిన సీఎం జగన్ పర్యటన
సీఎం జగన్ లండన్ పర్యటన ముగిసింది. తన పర్యటన ముగించుకొని ముఖ్యమంత్రి జగన్ ఇవాళ రాత్రికి తాడేపల్లి చేరుకోనున్నారు. లండన్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు. అనంతరం తాడేపల్లి నివాసానికి ముఖ్యమంత్రి చేరుకుంటారు.
ఇదీ చదవండి: Ambati on chandrababu: చంద్రబాబు అవినీతిపై రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెబుతారు