AP Appulu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందంటూ ప్రతిపక్షాలు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రంలో సంక్షేమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని కొనసాగిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఈ నేపథ్యంలో నిబంధనలకు లోబడి అప్పులు తెస్తూ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. అయితే, తాము అధికారంలో లేకపోయేసరికి రాష్ట్రం శ్రీలంకలా మారుస్తున్నారని ప్రతిపక్షం అంటోంది. అదే క్రమంలో తాము అధికారంలోకి వస్తే ఇంతకంటే గొప్పగా, అధికంగా సంక్షేమాన్ని అందిస్తామని హామీలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో అసలు ఏపీ అప్పులు ఎలా ఉన్నాయో నేడు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. (AP Appulu)
ఏపీ అప్పులపై కేంద్రం ఏమంది..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టేనాటికి అప్పులు ఎన్ని ఉన్నాయి? జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు ఎన్ని? అనే అంశంపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఇవాళ ఏపీ అప్పులపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. 2023 నాటికి ఏపీ రాష్ట్ర అప్పు రూ.4,42,442 కోట్లు అని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. అదే చంద్రబాబు దిగిపోయేనాటికి 2019లో ఏపీ అప్పు రూ.2,64,451 కోట్లుగా ఉండేదని కేంద్రం తెలిపింది. ఈ మేరకు పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
GSDPలో ఏపీ అప్పుల వాటా పై గణాంకాలు విడుదల
GSDPలో ఏపీ అప్పుల వాటా పై కేంద్ర ప్రభుత్వం గణాంకాలు విడుదల చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో GSDPలో ఏపీ అప్పు 32.95 శాతంగా కేంద్రం పేర్కొంది. 2019-20 నాటికి GSDPలో ఏపీ అప్పు వాటా 31.24 శాతం అని స్పష్టం చేసింది. అత్యధికంగా 2020-21లో 34.33 శాతంగా GSDPలో ఏపీ అప్పు అని పేర్కొంది. 2014-15లో 28.33 శాతంగా GSDPలో ఏపీ అప్పు ఉండేదని తెలిపింది. ఈ మేరకు లోక్‌సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రశ్నకు ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
ఎఫ్ఆర్‌బీఎంకు అనుగుణంగానే ఏపీ ఆర్థిక పరిస్థితి..
ఎఫ్ఆర్‌బీఎంకు అనుగుణంగానే ఏపీ ఆర్థిక పరిస్థితి ఉందని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణ రాజు ప్రశ్నకు సభలో ఆర్థిక మంత్రి తేల్చి చెప్పారు. ఏపీ అసెంబ్లీ ఎఫ్ఆర్‌బీఎంను పర్యవేక్షిస్తుందని స్పష్టం చేసింది. ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులకు లోబడే అప్పులు ఉన్నాయని తేటతెల్లం చేసింది. 2019 మార్చి నాటికి ఏపీ అప్పులు రూ.2,64,451 కోట్లు అని, 2023 నాటికి ఏపీ అప్పులు రూ.4,42,442 కోట్లుగా క్లారిటీ ఇచ్చింది. నాలుగేళ్లలో ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1,77,991 కోట్లని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
Read Also : Astrology for Credit: ఆ రోజుల్లో అప్పులు చేస్తే జీవితాంతం తీర్చలేరు.. ఎప్పుడో తెలుసా?