AP DSC News : ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్లుగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు ఉపాధ్యాయ ఉద్యోగార్థులు. అందరికీ అన్నీ ఇస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. డీఎస్సీ విషయంలో మాత్రం ఇంత వరకు ముందడుగు వేయలేదు. గతేడాది టీచర్ ఎలిజబులిటీ టెస్ట్ కంటక్ట్ చేసిన ప్రభుత్వం.. తర్వాత సెప్టెంబర్‌లోనో, అక్టోబర్‌లోనో లేదా 2023 జనవరిలోనో డీఎస్సీ (AP DSC News) నోటిఫికేషన్ వెలువరించి కనీసం 5 వేల పోస్టులు భర్తీ చేస్తుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, 2023 జూలై నెల దాటిపోతున్నా ఈ దిశగా అడుగులు పడలేదు. తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యానారాయణ వచ్చే నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందనే సంకేతాలు ఇచ్చారు.
ఆగస్టులో డీఎస్సీ (AP DSC News) నోటిఫికేషన్ వెలువరించే అవకాశం ఉందని మంత్రి బొత్స వెల్లడించారు. నిన్న రాజాంలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. వచ్చే నెలలో డీఎస్సీ ప్రకటించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిపారు. వేగంగా డీఎస్సీ ప్రక్రియ నిర్వహించి ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఖాళీల వివరాలు సేకరించడంతో పాటు డీఎస్సీ నిర్వహణకు సంబంధింత అధికారులతో ఏర్పాట్లు చేయిస్తున్నట్లు స్పష్టీకరించారు మంత్రి బొత్స.
ఎంతో కష్టపడి చదివి, సంవత్సరాలుగా డీఎస్సీ కోసం శిక్షణ తీసుకొని ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తుందా అని ఎదురు చూస్తున్నారు టీచర్ ఉద్యోగార్థులు. వారందరికీ శుభవార్తను అందచేస్తూ ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ డీఎస్సీ నోటిఫికేషన్ కు సంబంధించి కీలకమైన సమాచారాన్ని తెలియజేయడంతో ఏపీలో నిరుద్యోగులకు కొత్త ఆశలు కల్పించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ను వచ్చే నెలలో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తన్నామనడంతో ఇక ప్రిపరేషన్‌కు సన్నద్ధమవుతున్నారు టీచర్ ఉద్యోగార్థులు.
1998 డీఎస్సీ వారికి పోస్టింగ్‌లు ఇవ్వడం, స్పెషల్ డీఎస్సీ ప్రకటించినా అది కోర్టు కేసులతో నిలిచి పోవడం లాంటి పరిణామాలు జగన్ ప్రభుత్వంలో చోటు చేసుకున్నాయి. మధ్యలో టెట్ నిర్వహించారు. ఇక టెట్ కమ్ టీఆర్టీ లేదా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తారనే ఆశతో వేలాది మంది ఎదురు చూస్తున్నారు.
Read Also : AP DSC 2023 : ఏపీలో ఎన్నికల ముంగిట డీఎస్సీకి సన్నాహాలు.. ఎన్ని పోస్టులు భర్తీ?
విద్యారంగంలో జగన్ తీసుకొచ్చిన సంస్కరణలు ఇవీ…
రాష్ట్రంలో నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలే మార్చేస్తున్న ముఖ్యమంత్రి జగన్.. విద్యా రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. నాలుగేళ్లలోనే అక్కచెల్లెమ్మల ఖాతాల్లో ఒక్క అమ్మ ఒడి పథకం కింద నేరుగా, లంచాలు, వివక్షకు తావు లేకుండా నేరుగా రూ.26,000 కోట్లు అందించారు. ఇది తమ పిల్లల భవిష్యత్ కోసం, తమ పిల్లలను చదివించుకొనేందుకు, తమ పిల్లలను బడికి పంపించినందుకు, 75 శాతం అటెండెన్స్ ఉంటే వారికి ఇచ్చిన ప్రోత్సాహం. దేశంలోనే కేవలం మన రాష్ట్రంలో మాత్రమే ఈ కార్యక్రమం జరుగుతోంది.
గవర్నమెంట్ బడులన్నింటిలో కూడా ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చింది జగన్ ప్రభుత్వం. బడులు ప్రారంభం మొదలు కాగానే మెరుగైన విద్యాకానుక కిట్లను ప్రతి పిల్లాడు, ప్రతి పాప చేతిలో పెడుతోంది జగన్ ప్రభుత్వం. క్లాస్ టీచర్లకే గతిలేని పరిస్థితి గతంలో ఉండేది. ఈరోజు మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు ఉండేలా అడుగులు వేస్తున్నారు సీఎం జగన్. 3వ తరగతి నుంచే పిల్లలకు ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ టోఫెల్ కరిక్యులమ్ తీసుకొచ్చారు. గతంలో తెలుగు మీడియంలో మాత్రమే పాఠాలు చెప్పే స్కూళ్లలో ఈరోజు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా పిల్లలను పాఠాలు ఎలా చెప్పాలి? పిల్లలు ఎలా ఎదగాలి అని ఆలోచనలు చేస్తున్నారు.
45 వేల స్కూళ్లు బాగుపడ్డాయి..
పిల్లలను బైలింగ్యువల్ టెక్స్ట్ బుక్ లు, చక్కగా అర్థమయ్యేందుకు మొట్టమొదటి సారిగా ఇస్తున్నారు. బైజూస్ కంటెంట్ ను కూడా మన పాఠాల్లోకి అనుసంధానం చేయడం కూడా ఈ నాలుగు సంవత్సరాల్లోనే జగన్ ప్రభుత్వంలోనే జరిగింది. 6వ తరగతి నుంచే ప్రతి క్లాస్ రూమును డిజిటలైజ్ చేసి ఐఎఫ్పీలను తెచ్చి డిజిటల్ బోధనను స్కూల్స్ లోకి తీసుకొచ్చారు. రోజుకొక మెనూతో పిల్లలకు తిండి న్యూట్రిషియస్ గా ఉండాలని చిక్కీ, రాగి జావ కూడా తీసుకొచ్చారు. దీనికి గోరు ముద్దగా దానికి నామకరణం చేశారు. పాఠశాలలన్నీ రూపు రేఖలు మార్చి 45,000 గవర్నమెంట్ స్కూళ్లలో నాడు-నేడు అమలు చేస్తోంది జగన్ ప్రభుత్వం.
గవర్నమెంట్ స్కూళ్లలో డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూ 8వ తరగతి పిల్లలకు, టీచర్లకు ఇద్దరికీ ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో కూడా పని చేసేలా వారికి ట్యాబ్స్ అందిస్తోంది. ఆడ పిల్లల కోసం స్వేచ్ఛ పథకాన్ని అమలు చేస్తోంది. ఇలా ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే కేవలం విద్యారంగంలో సంస్కరణల కోసమే జగన్ ప్రభుత్వం అక్షరాలా రూ.66,722 కోట్లు ఖర్చు చేసింది.