Monsoon: రుతుపవనాల రాకపై ఏపీ సర్కార్ అప్రమత్తం.. ఏపీలో అడుగు ఎప్పుడంటే..

Monsoon: రుతుపవనాల ఆగమనంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది. వరదలు, తుపానులు లాంటి విపత్తులు ఎదురైతే వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. రానున్న నైరుతి రుతుపవన (Monsoon) కాలంలో విపత్తులను ఎదుర్కొనేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. సచివాలయంలో వివిధ శాఖలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల అధికారులతో సమీక్షించిన ఆయన.. నైరుతి రుతుపవనాలు జూన్ 4వ తేదీకి కేరళ రాష్ట్ర తీరాన్ని తాకే అవకాశం ఉందన్నారు. జూన్ 8వ తేదీ నాటికి ఏపీలో ప్రవేశిస్తాయని, 12వ తేదీకి రాష్ట్రమంతటా విస్తరించే ఆస్కారం ఉందన్నారు.

నైరుతి రుతుపవన (Monsoon) కాలంలో సంభవించబోయే ఎటువంటి తుపానులు లేదా వరదలనైనా సమర్థంగా ఎదుర్కునేందుకు వెంటనే తగిన కార్యాచరణ ప్రణాళికలతో అన్ని విధాలా పూర్తి సన్నద్దతతో ఉండాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంత మండలాలు, నదీ పరివాహక ప్రాంతాల్లో మండలాల్లో ప్రత్యేక ముందస్తు ఏర్పాట్లతో అన్ని విధాలా సన్నద్ధంగా ఉండాలని ఆయా శాఖల అధికారులను సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.

రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, మత్స్య, జల వనరులు, ఆర్ అండ్‌ బీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, పౌర సరఫరాలు, ట్రాన్సుకో, వైద్య ఆరోగ్య తదితర శాఖలు వారి వారి శాఖల పరంగా తీసుకోవాల్సిన చర్యలపై తగిన కార్యాచరణతో పూర్తి సన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. తుఫానులు, వరదలు సంభవిస్తే ఆస్తి, ప్రాణ నష్టాలను కనిష్ట స్థాయికి తగ్గించేందుకు వీలుగా అవసరమైన పరికరాలు, ఇతర సామాగ్రిని పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచుకోవాలని జవహర్ రెడ్డి ఆయా శాఖల అధికారులకు స్పష్టం చేశారు.

గత ఏడాది తిరుపతి నగరంలో అండర్ పాస్ వద్ద నీరు నిలిచి ప్రాణ నష్టం జరిగిందని అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రమాదకర అండర్ పాస్ల వద్ద శాశ్వత చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను సిఎస్ ఆదేశించారు.బలహీనంగా ఉన్న ఏటి గట్టలు, కాలువ గట్లు, రిజర్వాయర్ల గట్లు, వివిధ రదారులపై గల కల్వర్టులను తనిఖీ చేసి వాటి పటిష్టతకు తగిన చర్యలు తీసుకోవాలని జలవనరులు, ఆర్ అండ్‌ బీ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వ శాఖలతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, శాఖలైన ఎన్డీఆర్‌ఎఫ్‌, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు, ఇండియన్ కోస్టు గార్డు, రైల్వే, టెలికమ్యునికేషన్స్ వంటి సంస్థలు కూడా ప్రతి సంవత్సరంలాగే తుపాన్లు, వరదలు వంటి విపత్తులను ఎదుర్కునేందుకు రాష్ట్రా ప్రభుత్వ యంత్రాంగానికి పూర్తి సహాయ సహాకారాలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని జవహర్ రెడ్డి సూచించారు. అంతకు ముందు రాష్ట్ర రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ రానున్న నైరుతి రుతుపవనాల సన్నద్ధత ఏర్పాట్లపై వివిధ శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

ముఖ్యంగా సన్నాహక ఏర్పాట్లలో భాగంగా అవసరమైన మెన్ మెటీరియల్ ను ముందుగానే సిద్ధం చేసుకుని అందుబాటులో ఉంచుకోవాలని ఆయా శాఖలకు సూచించారు.అదే విధంగా సిబ్బందికి తగిన శిక్షణ సహాయ చర్యలకు సంబంధించి తగిన టీంలను ఏర్పాటు చేసుకుని అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు.

Read Also : YS Jagan : రైతు భరోసా, ఇన్‌పుట్‌ సబ్సిడీపై జగన్‌ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles