శనివారం, 12 సెప్టెంబర్ 2026తాజా వార్తలు • ట్రెండింగ్
Andhra Pradesh

YS Jagan PC on DSC: మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ! తవ్వేకొద్దీ అక్రమాలు.. అడుగడుగునా నకిలీ సర్టిఫికెట్లు: YS జగన్‌ 

ప్రచురణ తేదీ: గురువారం, 10 సెప్టెంబర్ 2026

YS Jagan PC on DSC: డీఎస్సీ–2025 పేరుతో నిరుద్యోగులు, నిజాయితీపరులైన అభ్యర్థులను కూటమి ప్రభుత్వం దగా చేసిందని వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మెగా డీఎస్సీ కుంభకోణాన్ని తవ్వేకొద్దీ నివ్వెరపరిచే అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. జరగని క్రీడా పోటీల్లో పాల్గొని, గెలిచినట్లు నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి పరీక్షలు రాయకుండానే టీచర్‌ పోస్టులు కట్టబెట్టారని ఆరోపించారు. స్పోర్ట్స్‌ కోటా, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌, టెట్‌ అర్హత, కేటగిరీల మార్పు పేరుతో జరిగిన అక్రమాలు చూస్తుంటే.. పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు ఒక పద్ధతి ప్రకారం వ్యవహారం నడిచినట్లు స్పష్టమవుతోందన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై స్వతంత్రంగా సీబీఐ విచారణ జరిపించాలని, బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న గురువారం మీడియాతో మాట్లాడారు.

ఒకే వ్యక్తి చేతిలో ప్రశ్నపత్రాలు.. పరీక్షల నిర్వహణ

రాష్ట్ర డీఎస్సీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రశ్నపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను ఒకే వ్యక్తి చేతిలో ఎందుకు పెట్టారని వైయస్‌ జగన్‌ ప్రశ్నించారు. పారదర్శకతకు పాతర వేసి స్కాంకు ద్వారాలు తెరిచారని విమర్శించారు. ఈ అంశంపై తాను ఎన్నిసార్లు ప్రశ్నించినా ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్‌ సూటిగా సమాధానం చెప్పలేదన్నారు. ఎస్‌సీఈఆర్‌టీలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేసిన వ్యక్తికి మొదటి ర్యాంకు ఎలా వచ్చిందని నిలదీశారు. ర్యాంకు వచ్చిన తర్వాత అతనికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని, మెరిట్‌ జాబితాలను ఎందుకు మార్చారని, అతని ఐడీని ఎందుకు బ్లాక్‌ చేశారని ప్రశ్నించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలవకపోవడంతోనే అతను కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. ప్రశ్నలను సైతం అమ్ముకున్నట్లు అభ్యర్థులు చేస్తున్న ఆరోపణలు పేపర్‌ లీకేజీ అనుమానాలను మరింత బలపరుస్తున్నాయని చెప్పారు.

పని కోసం గేట్లు తెరిచి.. పూర్తయ్యాక మూసేశారా?

ఇప్పటికే ఉన్న రెండు శాతం స్పోర్ట్స్‌ కోటాను మూడు శాతానికి పెంచడంతో పాటు, ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్ష లేకుండానే నేరుగా నియమించేలా జీవో నంబర్‌ 4, 47లను తీసుకొచ్చారని వైయస్‌ జగన్‌ తెలిపారు. నియామకాలు పూర్తయిన తర్వాత జీవో నంబర్‌ 23, 25, 56లతో వాటిని ఉపసంహరించారని పేర్కొన్నారు. ‘‘పని జరగడానికి జీవోలతో గేట్లు తెరిచి, పని పూర్తయ్యాక ఎందుకు మూసేశారు? ఆ జీవోలు తీసుకురావడం, తర్వాత ఉపసంహరించడం వెనుక కారణమేంటి?’’ అని నిలదీశారు.

టీచర్‌ పోస్టుల కోసం డబ్బులు తీసుకున్నట్లు ఆడియో, వీడియో కాల్స్‌ బయటకు వచ్చినా విచారణను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు నుంచి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపే వరకు నిందితులను రక్షించేందుకు ప్రయత్నించారని అన్నారు. రిమాండ్‌కు పంపామని అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు.

జరగని జూడో పోటీలతో 39 ఉద్యోగాలు!

స్పోర్ట్స్‌ కోటాలో జూడో క్రీడ పేరుతో ఏ పరీక్షా లేకుండానే 39 మందికి టీచర్‌ పోస్టులు ఇచ్చారని వైయస్‌ జగన్‌ వెల్లడించారు. ఖమ్మంలో 2013లో జరిగినట్లు చూపిన సీనియర్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ జూడో చాంపియన్‌షిప్‌లో పాల్గొని గెలిచినట్లు కొందరు అభ్యర్థులు ధ్రువపత్రాలు సమర్పించారని తెలిపారు. అయితే ఆ తేదీల్లో ఖమ్మంలో అసలు పోటీలే జరగలేదని తెలంగాణ జూడో అసోసియేషన్‌, ఖమ్మం జిల్లా జూడో అసోసియేషన్‌ లిఖితపూర్వకంగా వెల్లడించాయని చెప్పారు. అలాంటి ధ్రువపత్రాలను ఆంధ్రప్రదేశ్‌ జూడో అసోసియేషన్‌ ధ్రువీకరించిందన్నారు. ఆ అసోసియేషన్‌కు లోకేష్‌ తోడల్లుడు, విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్‌ అధ్యక్షుడిగా ఉన్నారని గుర్తుచేశారు.

‘‘దొంగ సర్టిఫికెట్లు సృష్టించి, వాటిని రాష్ట్రంలోని పెద్దలే ధ్రువీకరించినట్లు స్పష్టంగా కనిపించడం లేదా?’’ అని ప్రశ్నించారు.

సాఫ్ట్‌బాల్‌లో 38 మందికి కొలువులు

సాఫ్ట్‌బాల్‌ పేరుతోనూ 38 మందికి పరీక్షలు లేకుండానే టీచర్‌ పోస్టులు ఇచ్చారని వైయస్‌ జగన్‌ ఆరోపించారు. ఈ అసోసియేషన్‌కు టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అధ్యక్షుడిగా ఉన్నారని పేర్కొన్నారు. కొన్ని నియామకాల్లో శాప్‌ కీలక పాత్ర పోషించిందన్నారు. క్రీడా సంఘాల కీలక పదవుల్లో అధికార పార్టీ నేతలు ఉండటం, వారి ధ్రువీకరణతో ఉద్యోగాలు రావడం తీవ్ర అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రతి కేస్‌ స్టడీ సీబీఐ విచారణ అవసరాన్ని స్పష్టం చేస్తోందని చెప్పారు.

అన్నాచెల్లెళ్లకు నకిలీ ఖోఖో సర్టిఫికెట్లతో పోస్టులు!

విశాఖపట్నానికి చెందిన యోగేశ్వరరావుకు ఏ పరీక్షా లేకుండానే స్పోర్ట్స్‌ కోటాలో ఎస్జీటీ పోస్టు ఇచ్చారని వైయస్‌ జగన్‌ తెలిపారు. అతని చెల్లెలికీ అదే విధంగా ఉద్యోగం కల్పించారని చెప్పారు. 2009లో నల్గొండలో జరిగిన 23వ సీనియర్‌ సౌత్‌ నేషనల్‌ ఖోఖో చాంపియన్‌షిప్‌లో యోగేశ్వరరావు ప్రథమ స్థానం, ఆయన చెల్లెలు ద్వితీయ స్థానం సాధించినట్లు చూపించారని వివరించారు.

అయితే వారిద్దరూ విజేతల జాబితాలోనే లేరని తెలంగాణ ఖోఖో అసోసియేషన్‌ స్పష్టం చేసిందన్నారు. నిజమైన విజేతల వివరాలను కూడా విడుదల చేసిందని తెలిపారు. పోటీలు ఎక్కడ జరిగాయో తెలుసుకొని, ఆ వివరాలతో నకిలీ సర్టిఫికెట్లు తయారుచేసినట్లు కనిపిస్తోందని ఆరోపించారు.

నకిలీ అని చెప్పినా బసవేశ్వరరావుకు ఉద్యోగం

బసవేశ్వరరావు అనే అభ్యర్థి గుడివాడలో జరిగిన 49వ సీనియర్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ ఖోఖో చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నట్లు సర్టిఫికెట్‌ సమర్పించారని వైయస్‌ జగన్‌ చెప్పారు. ఆ ధ్రువపత్రం నకిలీదని ఖోఖో అసోసియేషన్‌ అధికారికంగా శాప్‌కు సమాచారం ఇచ్చినా అతనికి ఉద్యోగం ఇచ్చారని తెలిపారు.

ప్రగడ కళ్యాణి అనే అభ్యర్థి నాగార్జున యూనివర్సిటీలో జరిగిన 2003 ఆల్‌ ఇండియా ఇంటర్‌ యూనివర్సిటీ కబడ్డీ పోటీల్లో పాల్గొన్నట్లు ధ్రువపత్రం ఇచ్చారని చెప్పారు. అయితే అక్కడ ఆల్‌ ఇండియా పోటీలు కాకుండా సౌత్‌వెస్ట్‌ జోన్‌ పోటీలు మాత్రమే జరిగినట్లు తేలిందన్నారు.

టెట్‌లో 65 మార్కులే.. అయినా ఎస్జీటీ పోస్టు

కర్నూలు జిల్లాకు చెందిన ఈడిగ ప్రభాకర్‌కు ఎలాంటి పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్‌ కోటాలో ఎస్జీటీ ఉద్యోగం ఇచ్చారని వైయస్‌ జగన్‌ తెలిపారు. అతని రిజర్వేషన్‌ కేటగిరీ ప్రకారం టెట్‌లో 75 మార్కులు రావాల్సి ఉండగా, 65 మార్కులు వచ్చినా పోస్టు ఇచ్చారని వెల్లడించారు. ఈ విషయాన్ని కర్నూలు డీఈవో కూడా అంగీకరించారని చెప్పారు.

2018 టెట్‌లో అతనికి 77 మార్కులు వచ్చాయని చూపిస్తూ అక్రమాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. హాల్‌టికెట్‌ నంబర్‌తో టెట్‌ వెబ్‌సైట్‌లో పరిశీలిస్తే ఆ మార్కులు స్కూల్‌ అసిస్టెంట్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌–2బీ కేటగిరీకి సంబంధించినవని తేలిందన్నారు. ఆ అర్హతతో టెట్‌–1ఏ పరిధిలోని ఎస్జీటీ పోస్టు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.

ఒక సబ్జెక్టులో అర్హత.. మరో సబ్జెక్టులో ఉద్యోగం

కొన్ని కేసుల్లో అభ్యర్థులు టెట్‌ ఉత్తీర్ణులు కాకపోయినా ఉద్యోగాలు ఇచ్చారని వైయస్‌ జగన్‌ తెలిపారు. ఒక కేటగిరీ లేదా సబ్జెక్టులో టెట్‌ అర్హత ఉంటే మరో సబ్జెక్టుకు సంబంధించిన టీచర్‌ పోస్టు ఇచ్చారని చెప్పారు. ఒక కులానికి చెందిన రిజర్వేషన్‌ అర్హత ఉన్న వారిని మరో కులం కోటాలో ఎంపిక చేసిన ఉదంతాలూ వెలుగులోకి వస్తున్నాయన్నారు.

ఈడబ్ల్యూఎస్‌ పేరుతో కొత్త రాకెట్‌

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ పేరుతో పెద్ద ఎత్తున రాకెట్‌ నడిచినట్లు కేసులు బయటపడుతున్నాయని వైయస్‌ జగన్‌ ఆరోపించారు. ఇతర కులాలకు చెందిన అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్‌ కోటాలో పోస్టులు ఇచ్చారని చెప్పారు. కడప, కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయని వివరించారు.

కడప జిల్లాకు చెందిన రసూల్‌ బీసీ–ఈ కేటగిరీకి చెందిన వ్యక్తి కాగా, 2009, 2012, 2018 డీఎస్సీలకు అదే కేటగిరీ కింద దరఖాస్తు చేశారని తెలిపారు. ప్రస్తుత డీఎస్సీలో మాత్రం అతనికి ఓసీ–ఈడబ్ల్యూఎస్‌ కింద పోస్టు ఇచ్చారని ఆరోపించారు.

‘‘1:1 నిష్పత్తిలో అధికారుల పరిశీలన పూర్తయిన తర్వాత కేటగిరీలను మార్చి పోస్టులు ఎలా ఇచ్చారు? ప్రతి అభ్యర్థి సర్టిఫికెట్లను ఏడుసార్లు పరిశీలించామని చెబుతున్నప్పుడు ఇన్ని అక్రమాలు ఎలా జరిగాయి? అర్హత లేదని తెలిసి కూడా ఎవరి ఆదేశాలతో ఉద్యోగాలు ఇచ్చారు?’’ అని ప్రశ్నించారు.

డీఎస్సీ జీవోతోనే ఏపీపీఎస్సీలోనూ ప్రయత్నం

పరీక్షలు లేకుండా టీచర్‌ పోస్టులు కట్టబెట్టిన ప్రభుత్వం ఏపీపీఎస్సీలోనూ అదే తరహాలో ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రయత్నించిందని వైయస్‌ జగన్‌ ఆరోపించారు. అటవీశాఖలో 814 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చి, వాటిలో 40 స్పోర్ట్స్‌ కోటా పోస్టులను పరీక్ష లేకుండా కేవలం క్రీడా సర్టిఫికెట్ల ఆధారంగా భర్తీ చేసేందుకు డీఎస్సీలో ఉపయోగించిన జీవో నంబర్‌ 4నే ప్రయోగించారని తెలిపారు.

డీఎస్సీ అక్రమాలు బయటపడటంతో ఈ నియామకాల బాగోతం కూడా వెలుగులోకి వస్తుందనే భయంతో ప్రక్రియను మధ్యలో నిలిపేశారని చెప్పారు. 40 స్పోర్ట్స్‌ కోటా పోస్టుల జాబితా బయటపడితే అసలు వ్యవహారం వెలుగుచూస్తుందనే ఉద్దేశంతో మిగిలిన 774 పోస్టుల భర్తీని కూడా ఆపేశారని ఆరోపించారు.

లక్షల మంది కష్టం.. నచ్చినవారికి కొలువులా?

లక్షల మంది నిరుద్యోగులు పోటీ పరీక్షల కోసం సంవత్సరాల తరబడి కష్టపడుతూ, లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారని వైయస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు లంచాలు తీసుకొని, నచ్చిన వారికి అక్రమంగా పోస్టులు కట్టబెడితే ప్రభుత్వం, వ్యవస్థలపై యువతకు నమ్మకం ఎలా ఉంటుందని ప్రశ్నించారు.

‘‘వీడు మనవాడా? డబ్బులు ముట్టాయా? అయితే టీచర్‌ పోస్టు ఇచ్చేయండి అన్న పద్ధతిలో నియామకాలు జరిగినట్లు కనిపిస్తోంది. పైస్థాయి ఆదేశాలతో కిందిస్థాయి వరకు కుమ్మక్కై, ఒక మోడస్‌ ఆపరండీ ప్రకారం పోస్టులను భర్తీ చేశారు’’ అని ఆరోపించారు.

సొంత అధికారులతో విచారణ నిష్పాక్షికంగా జరుగుతుందా?

డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం అంగీకరించిన తర్వాత కూడా చంద్రబాబు కింద పనిచేసే అధికారులతోనే విచారణ జరిపిస్తే అది స్వతంత్రంగా, నిజాయితీగా ఎలా సాగుతుందని వైయస్‌ జగన్‌ ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాల్సిన పరిస్థితుల్లో ఆయన శాఖకు చెందిన అధికారులు స్వేచ్ఛగా విచారణ చేయగలరా అని నిలదీశారు.

నిజాయితీపరులైన అభ్యర్థులకు న్యాయం చేయడం కోసం వైయస్సార్‌సీపీ కోర్టులోనూ పోరాడుతోందని చెప్పారు. డీఎస్సీ–2025 నియామకాలపై పారదర్శకంగా సీబీఐ విచారణ జరిపించాలని పునరుద్ఘాటించారు.

ప్రశ్నిస్తే కేసులు.. ఖాతాలు బ్లాక్‌

డీఎస్సీ అక్రమాలకు సంబంధించిన ఆధారాలు బయటపెడుతున్న వారిని చంద్రబాబు ప్రభుత్వం బెదిరిస్తోందని వైయస్‌ జగన్‌ ఆరోపించారు. కేసులు పెడతామని, జైల్లో వేస్తామని హెచ్చరిస్తూ జర్నలిస్టులపైనా కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్‌ మీడియాలో ప్రభుత్వాన్ని నిలదీస్తున్న ఖాతాలను బ్లాక్‌ చేస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు.

‘‘వ్యవస్థలను చెడగొట్టినప్పుడే కాక్రోచ్‌లు వస్తాయి. అన్యాయం మరీ పెరిగితే నాలాంటి వ్యక్తి కూడా కాక్రోచ్‌లా మారి వ్యవస్థను ప్రశ్నిస్తాడు. పారదర్శకంగా సీబీఐ విచారణ జరగాలి. విద్యాశాఖ మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాలి. లేకపోతే ప్రజలే వీరి మెడలు వంచుతారు’’ అని వైయస్‌ జగన్‌ హెచ్చరించారు.

For YS Jagan PC PPT Documents click here YS JAGAN_PC_DSC SCAM_2025_10092026_FINAL

Read also: YS Jagan Padayatra: వచ్చే ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరు నుంచి పాదయాత్ర: వైఎస్‌ జగన్‌
YS Jagan tweet: ఉద్యోగాలు అడిగితే కేసులా?.. చంద్రబాబు సర్కార్‌పై వైఎస్‌ జగన్‌ ఫైర్‌
YS Jagan on Veligonda: వెలిగొండపై క్రెడిట్ వార్.. చంద్రబాబుపై జగన్ సంచలన ట్వీట్, ప్రాజెక్టు చరిత్రను గుర్తు చేసిన వైసీపీ అధినేత

Summarize with AI

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading