Justice Srinivas Reddy : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాస్ రెడ్డిపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసభ్యకరమైన ట్రోల్స్‌పై రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ తీవ్రంగా స్పందించింది. ఇటీవల సింగయ్య మృతి కేసులో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి తీర్పు వెల్లడించారు. అలాగే కల్తీ నెయ్యి కేసులో ప్రధాన నిందితులకు బెయిల్ మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో జస్టిస్ శ్రీనివాస్ రెడ్డిపై నెట్టింట కొందరు ట్రోలింగ్ కు దిగారు. విమర్శలు, దూషణలు ఉద్ధృతంగా మారాయి. దీంతో హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ స్పందించింది. (Justice Srinivas Reddy)
ఈ తీర్పు అనంతరం సోషల్ మీడియాలో న్యాయమూర్తిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని చేసిన ట్రోలింగ్‌ను అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. “ఇది వ్యక్తిగత వ్యక్తిత్వాన్ని మాత్రమే కాకుండా న్యాయవ్యవస్థకే దెబ్బతీసే ప్రయత్నం”గా వారు పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
న్యాయమూర్తులు రాజ్యాంగబద్ధమైన విధుల్లో భయమూ, పక్షపాతం లేని విధంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. తీర్పుపై అభ్యంతరాలుంటే, చట్టబద్ధమైన మార్గాల్లో పరిష్కరించుకోవాలి గానీ సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలకు దిగకూడదు. ఈ విధమైన చర్యలు న్యాయవ్యవస్థ స్వతంత్రతను ప్రమాదంలోకి నెట్టి, ప్రజల నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తాయని హెచ్చరించారు. ట్రోలింగ్‌కు పాల్పడుతున్న వారిపై తక్షణమే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయవాదులు, మీడియా, ప్రజలందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.

మద్దతుగా నిలిచిన న్యాయవాదులు:
అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కే.చిదంబరం, ఉపాధ్యక్షుడు కె.వి. రఘువీర్, ప్రధాన కార్యదర్శి సుబోధ్ తదితరులు ఈ ప్రెస్ నోటుపై సంతకం చేసి, జడ్జికి మద్దతు ప్రకటించారు. వీరి ప్రకటన న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడే దిశగా ఒక కీలక పిలుపుగా నిలుస్తోంది.
ఇవీ చదవండి: Tirupati Crime : హైకోర్టులో తిరుపతి ఏఆర్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి పిటిషన్
AP High Court Posts : ఏపీ హైకోర్టులో 1,621 ఉద్యోగాలు.. అర్హత, దరఖాస్తు ఇలా!
