The Odyssey: ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన క్రిస్టోఫర్ నోలన్ తాజా చిత్రం ‘ది ఒడిస్సీ’ (The Odyssey) బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది. భారీ స్థాయిలో విడుదలైన ఈ చిత్రం విజువల్స్, కథనం, యాక్షన్ సీక్వెన్స్‌లతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. సినిమా చూసిన చాలామందికి ఒకే సందేహం వచ్చింది. మూవీలో కనిపించిన సముద్రాలు, గుహలు, పర్వతాలు, కోటలు, అడవులు అన్నీ కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో సృష్టించారా? లేక నిజమైన ప్రదేశాల్లో చిత్రీకరించారా? దీనికి సమాధానం ఒక్కటే.. సినిమాలో ఎక్కువ భాగం నిజమైన లొకేషన్లలోనే చిత్రీకరించారు. ఇదే నోలన్ సినిమాల ప్రత్యేకత.
3 వేల ఏళ్ల నాటి గ్రీకు కావ్యాన్ని తెరపై ఆవిష్కరించిన నోలన్
‘ది ఒడిస్సీ’ కథకు మూలం ప్రపంచ ప్రసిద్ధ గ్రీకు కవి హోమర్ రచించిన ‘Odyssey’ మహాకావ్యం. ట్రాయ్ యుద్ధం అనంతరం ఒడిసియస్ తన స్వదేశానికి చేరుకునే క్రమంలో ఎదుర్కొన్న సాహసాలు, దేవతలు, రాక్షసులు, సముద్ర యాత్రలు ఈ కథలో ప్రధానాంశాలు. ఈ కథకు తగిన వాస్తవికత తీసుకురావాలనే ఉద్దేశంతో నోలన్ గ్రీన్ స్క్రీన్‌పై ఆధారపడకుండా ప్రపంచంలోని చారిత్రక, సహజసిద్ధమైన ప్రాంతాలను ఎంపిక చేశాడు.
గ్రీస్ – పురాణ గాథలకు నిలయమైన నేల
గ్రీకు పురాణాలే కథకు ఆధారం కావడంతో గ్రీస్‌లోని అనేక చారిత్రక ప్రాంతాల్లో షూటింగ్ జరిగింది. ప్రత్యేకంగా నెస్టర్ గుహ (Nestor Cave)లో ఒంటికన్ను రాక్షసుడు సైక్లోప్స్ ఎపిసోడ్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గుహ సహజసిద్ధమైన అందాలతో సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మొరాకోలో ట్రాయ్ యుద్ధ సన్నివేశాలు
సినిమాలో ట్రాయ్ యుద్ధాన్ని చూపించే భాగాలను మొరాకోలోని ప్రసిద్ధ చారిత్రక ప్రాంతం ఐత్ బెన్ హద్దూ (Aït Ben Haddou)లో చిత్రీకరించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతంలో కొంత భాగం మాత్రమే సెట్స్ నిర్మించగా, మిగిలిన నేపథ్యం అంతా సహజంగానే చిత్రీకరించారు. అందుకే యుద్ధ సన్నివేశాలు అత్యంత వాస్తవికంగా కనిపిస్తాయి.
ఇటలీలో రాజప్రాసాదం.. సముద్ర యాత్రలు
ఒడిసియస్ రాజు నివసించే ప్యాలెస్‌కు సంబంధించిన సన్నివేశాలను ఇటలీలోని చారిత్రక ప్రాంతాల్లో తెరకెక్కించారు. అలాగే సముద్రంలో భారీ అలలు, సుడిగుండాలు, ప్రమాదకర ప్రయాణానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఫరాగ్లియోనీ డి లిపారి (Faraglioni di Lipari) పరిసరాల్లో చిత్రీకరించినట్లు సమాచారం.
స్కాట్లాండ్‌లో అడవి.. భారీ మనుషుల సన్నివేశాలు
సినిమాలో కనిపించే విశాలమైన అడవులు, సముద్రతీర ప్రాంతాలు, భారీ జీవుల నేపథ్య సన్నివేశాల కోసం స్కాట్లాండ్‌లోని కల్బిన్ ఫారెస్ట్ (Culbin Forest)ను ఎంపిక చేశారు. మంచు, సముద్రం, దట్టమైన అడవి కలిసిన ఈ ప్రాంతం సినిమాకు మరింత సహజమైన అనుభూతిని అందించింది.
ఐస్‌లాండ్ సహజ అందాలు కూడా సినిమాలో
అగ్నిపర్వతాలు, మంచు పర్వతాలు, విస్తారమైన ప్రకృతి దృశ్యాల కోసం నోలన్ బృందం ఐస్‌లాండ్‌లో కూడా చిత్రీకరణ జరిపింది. తక్కువ గ్రాఫిక్స్‌తో ప్రకృతి వైభవాన్ని తెరపై చూపించడమే లక్ష్యంగా ఈ లొకేషన్లను ఎంపిక చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
గ్రాఫిక్స్‌కు బదులు రియల్ లొకేషన్స్.. ఇదే నోలన్ స్టైల్
క్రిస్టోఫర్ నోలన్ తన కెరీర్‌లో ఎప్పుడూ సాధ్యమైనంత వరకు ప్రాక్టికల్ ఎఫెక్ట్స్కే ప్రాధాన్యం ఇస్తుంటాడు. The Dark Knightలో నిజంగానే ట్రక్‌ను బోల్తా కొట్టించడం, Inceptionలో తిరిగే కారిడార్ సెట్ నిర్మించడం, Interstellarలో వాస్తవిక స్పేస్ విజువల్స్,
Oppenheimerలో కంప్యూటర్ గ్రాఫిక్స్‌పై తక్కువ ఆధారపడడం వంటి ఉదాహరణలు ఆయన పనితీరును చూపిస్తాయి. అదే సంప్రదాయాన్ని ‘ది ఒడిస్సీ’లోనూ కొనసాగించాడు.
మేకింగ్ వీడియోకు భారీ స్పందన
సినిమా విడుదలకు ముందు విడుదలైన 23 నిమిషాల మేకింగ్ వీడియోలో షూటింగ్ కోసం బృందం పడిన కష్టం, వివిధ దేశాల్లో చేసిన చిత్రీకరణ, భారీ సెట్స్ నిర్మాణం, సముద్ర యాక్షన్ సన్నివేశాల రూపకల్పన వంటి అంశాలను చూపించారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఎందుకు ఈ సినిమా ప్రత్యేకం?
‘ది ఒడిస్సీ’ని కేవలం మరో మైథాలజికల్ సినిమా అని చెప్పలేం. ప్రపంచ చరిత్రలోనే అత్యంత ప్రసిద్ధమైన గ్రీకు కావ్యాన్ని ఆధునిక సాంకేతికత, నిజమైన లొకేషన్లు, సహజ విజువల్స్‌తో తెరపై ఆవిష్కరించేందుకు నోలన్ చేసిన ప్రయత్నం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అందుకే ఈ సినిమా కథతో పాటు, చిత్రీకరణ జరిగిన లొకేషన్లు కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
Read also: Lakshmi Ashtottaram: లక్ష్మీ అష్టోత్తరం ఎవరు చదవాలి? ఎప్పుడు పఠిస్తే మంచిది? ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఇవే!
OTT Movie: రూ.6 కోట్లతో తీస్తే రూ.19 కోట్ల వసూళ్లు.. ఓటీటీలోకి వస్తున్న హారర్ కామెడీ బ్లాక్‌బస్టర్!
OTT Horror Thriller: నాలుగో అంతస్తులో అడుగుపెట్టిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. ఆ తర్వాత ప్రతి రాత్రీ నరకమే!
