Mudragada Padmanabham: కాకినాడ: కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
ఆయన మరణ వార్తతో తూర్పుగోదావరి జిల్లాతో పాటు ఉమ్మడి గోదావరి జిల్లాలు, కాపు సామాజిక వర్గంలో తీవ్ర విషాదం నెలకొంది. దశాబ్దాల పాటు కాపు హక్కుల కోసం పోరాడిన నాయకుడిగా, తనదైన రాజకీయ శైలితో ప్రత్యేక గుర్తింపు పొందిన నేతగా ముద్రగడను పలువురు గుర్తుచేసుకుంటున్నారు.
రాజకీయ ప్రస్థానం
ముద్రగడ పద్మనాభం తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజా ప్రతినిధిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా, ఒకసారి కాకినాడ ఎంపీగా ప్రజలకు సేవలందించారు. రాష్ట్ర రాజకీయాల్లో వివిధ దశల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో పనిచేసిన ఆయన, అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి క్రియాశీలకంగా కొనసాగారు.
కాపు ఉద్యమానికి ప్రతీక
ముద్రగడ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది కాపు రిజర్వేషన్ల ఉద్యమం. కాపు సామాజిక వర్గానికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆయన అనేక ఆందోళనలు చేపట్టారు. ప్రత్యేకించి తుని ఘటన అనంతరం ఆయన చేపట్టిన నిరాహార దీక్షలు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. కాపు వర్గానికి న్యాయం చేయాలనే డిమాండ్‌తో ప్రభుత్వాలపై నిరంతరం ఒత్తిడి తీసుకొచ్చిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు.
స్పష్టమైన వైఖరితో ప్రత్యేక గుర్తింపు
రాజకీయాల్లో ఎలాంటి రాజీ లేకుండా తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేసే నేతగా ముద్రగడకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అధికారంలో ఎవరు ఉన్నా ప్రజా సమస్యలపై తనదైన శైలిలో స్పందించేవారు. అందుకే ఆయనను అభిమానించే వర్గంతో పాటు విమర్శించే వర్గం కూడా ఉండేది.
వైఎస్సార్‌సీపీలో కీలక పాత్ర
చివరి దశలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ముద్రగడ, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ముఖ్యంగా కాపు వర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఇటీవల ఆరోగ్య సమస్యల కారణంగా ప్రజా కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ, రాజకీయ పరిణామాలపై అప్పుడప్పుడు స్పందించేవారు.
నిఖార్సైన వ్యక్తిత్వం
రాజకీయాల్లో ప్రత్యర్థి వర్గం సహజంగానే ఉంటుంది. నమ్మిన వారి కోసం, ఇచ్చిన మాట కోసం నిలబడటం అందరికీ సాధ్యం కాదు. కానీ, తన వర్గం కోసం ఎంతవరకైనా వెళ్లగలిగేంత ధైర్యం ముద్రగడకే సొంతం. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ను ఓడించకపోతే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ముద్రగడ సవాల్ విసిరారు. ఆ తర్వాత పవన్ గెలవడంతో తన పేరును అధికారికంగా ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుని ఔరా.. అనిపించారు. ఇలా తాను నమ్మిన బాటలో ఎన్ని అవరోధాలు కలిగినా ఎదుర్కోగలిగిన నిఖార్సైన వ్యక్తిత్వం కలిగిన రాజకీయ నాయకుడిగా ముద్రగడ చరిత్రలో నిలిచిపోయారు.
రాజకీయ నేతల సంతాపం
ముద్రగడ పద్మనాభం మరణంపై వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక సంస్థలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, కాపు ఉద్యమంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొంటున్నారు.
ఇవీ చదవండి: Mudragada Padmanabham : ఎయిర్ అంబులెన్స్ ద్వారా హైదరాబాద్ కు ముద్రగడ?
Mudragada on Pawan: కాపుల కొట్లాటగా మారిన పవన్ టూర్.. ముద్రగడ లేఖతో మరింత రంజుగా రాజకీయం!
