HomeAndhra PradeshPawan Kalyan: కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు: పచ్చదనం సంరక్షణకు జియో ట్యాగింగ్: ఉప...

Pawan Kalyan: కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు: పచ్చదనం సంరక్షణకు జియో ట్యాగింగ్: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Pawan Kalyan: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను కొత్తగా విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan తెలిపారు. ఇందుకు సంబంధించిన కసరత్తు ఇప్పటికే జరుగుతోందని ఆయన వెల్లడించారు.

గురువారం శాసనసభలో మాట్లాడుతూ పంచాయతీల పునర్విభజనకు ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు లేవని చెప్పారు. స్థానిక సంస్థల స్వావలంబన, బలోపేతం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక సంస్థలను బలపరిచే చర్యలు ప్రారంభించామని తెలిపారు.

పచ్చదనం సంరక్షణకు చర్యలు
రహదారుల విస్తరణ, ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం చెట్లను తొలగించాల్సి వస్తే వాటికి తగిన ప్రత్యామ్నాయాలు తీసుకురావాలనే దానిపై ప్రభుత్వం పరిశీలన చేస్తోందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పర్యావరణ ప్రేమికుడిగా పచ్చదనాన్ని కాపాడే దిశగా అన్ని కోణాల్లో ఆలోచించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

భవిష్యత్తులో చెట్లు, వృక్షాలను సంరక్షించేందుకు బలమైన చట్టాన్ని తీసుకురావాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉందని ఆయన తెలిపారు. ఆ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తేనే పచ్చదనానికి నిజమైన రక్షణ లభిస్తుందని అన్నారు.

నాటే ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్
అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటుతున్నప్పటికీ వాటి సంరక్షణలో లోపాలు ఉన్నాయని సభ్యులు తన దృష్టికి తీసుకువచ్చారని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇకపై అటవీ శాఖ ద్వారా పంపిణీ చేసే ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ విధానం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.

నర్సరీ స్థాయి నుంచే ప్రత్యేక వ్యవస్థను అమలు చేయాలని యోచిస్తున్నామని తెలిపారు. బెంగళూరులో అమలు చేస్తున్న అత్యాధునిక విధానాలను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు కూడా ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.

ఎర్రచందనం అమ్మకాలపై ప్రత్యేక బృందం
ఎర్రచందనం అమ్మకాల విషయంలో మెరుగైన ధరలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. గోదాముల్లో ఉన్న దుంగలను అమ్మకానికి పెట్టేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించామని చెప్పారు. ప్రపంచ మార్కెట్ ధరలకు అనుగుణంగా వేలం నిర్వహిస్తూ ప్రభుత్వానికి మంచి ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

బడ్జెట్ ప్రతిపాదనలు
2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలకు సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను కూడా పవన్ కళ్యాణ్ శాసనసభలో సమర్పించారు.
పంచాయతీరాజ్ శాఖకు రూ.15,485 కోట్లు
గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.11,217 కోట్లు
అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలకు రూ.713 కోట్లు
ఈ ప్రతిపాదనలను సభ ఆమోదం కోసం ఆయన సమర్పించారు.

ఇవీ చ‌ద‌వండి: Balakrishna Pawan Kalyan: పవన్ కల్యాణ్ తో బాలయ్య భేటీ.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్
Pawan Kalyan : పార్టీ నేతలపై పవన్ సీరియస్.. కార్యవర్గ సమావేశం నుంచి ఆగ్రహంగా వెళ్లిపోయిన జనసేనాని

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు