AP Teachers: ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయుల హాజరు విధానంపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో సమయపాలన పెంచడం, బోధన నాణ్యత మెరుగుపరచడం లక్ష్యంగా హాజరు నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ముఖ్యంగా విజయవాడ, రాష్ట్రవ్యాప్తంగా ఈ కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి.
విద్యాశాఖ స్పష్టంచేసిన ప్రకారం ఉపాధ్యాయులు ఉదయం 9 గంటల తరువాత పాఠశాలకు హాజరైతే అది లేట్ ఇన్ గా పరిగణించబడుతుంది. 10 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఉన్నప్పటికీ, దాన్ని నెలలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే ఉపయోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.
ఉదయం సెలవు తీసుకుని మధ్యాహ్నం పాఠశాలకు వచ్చే ఉపాధ్యాయులు తప్పనిసరిగా మధ్యాహ్నం 1 గంటలోపు హాజరు నమోదు చేయాలి. ఆ తరువాత నమోదు చేస్తే ఆలస్యంగా వచ్చినట్లే నమోదు అవుతుంది. అలాగే ఉదయం హాజరై మధ్యాహ్నం సెలవు తీసుకునేవారు 12.30 గంటల ముందు ఔట్ టైం నమోదు చేస్తే ఎర్లీ ఔట్ గా పరిగణిస్తారు.
ప్రాథమిక పాఠశాలల్లో సాయంత్రం 3.30 గంటల ముందు, ఉప ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలల్లో సాయంత్రం 4 గంటల ముందు ఔట్ టైం నమోదు చేసినా ముందుగానే వెళ్లినట్లుగా నమోదు అవుతుంది. ఇక ఇన్ టైం నమోదు చేసి ఔట్ టైం నమోదు చేయకుండా వెళ్లిపోతే, పాఠశాల ప్రాంగణం విడిచినట్లుగా పరిగణిస్తామని విద్యాశాఖ హెచ్చరించింది.
గతంలో ఉపాధ్యాయ సంఘాలు వైఎస్ జగన్ ప్రభుత్వంపై హాజరు విధానాల విషయంలో తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అదే తరహా కఠిన నిబంధనలు అమలవుతుండటంతో ప్రభుత్వం ఇప్పుడు ఎలా స్పందిస్తుందన్న దానిపై సామాన్యుల్లో చర్చ జరుగుతోంది.
విద్యా ప్రమాణాలు మెరుగుపడటానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందా? లేక ఉపాధ్యాయులపై ఒత్తిడి పెరుగుతుందా? అన్నది రాబోయే రోజుల్లో స్పష్టంకానుంది.
ఇవీ చదవండి: Richest People’s Education : భారతదేశంలోని టాప్ 10 ధనిక వ్యాపారవేత్తలు.. వారి విద్యా ప్రస్థానం
Mega Parent Teacher Meeting: ప్రైవేటు స్కూళ్లకంటే ఉత్తమంగా ప్రభుత్వ స్కూళ్లు
