Andhra Crime : నేరం ఎంత పక్కాగా ప్లాన్ చేసినా.. ఎక్కడో ఒక చోట చేసిన చిన్న పొరపాటు చివరికి నిందితులను చట్టం ముందు నిలబెడుతుందని మరోసారి రుజువైంది ఈ ఘటన. తల్లి ఆకస్మికంగా చనిపోతే గుండెపోటేనని భావించి కుటుంబం మొత్తం కన్నీరు పెట్టింది. భర్త కూడా ఏమీ తెలియనట్టు అంత్యక్రియలు పూర్తి చేశాడు. ఎవరికీ అనుమానం రాలేదు. కానీ 9 నెలల తర్వాత బయటపడ్డ ఒకే ఒక్క ఫోన్ కాల్ రికార్డింగ్, ఆ ఇంట్లో దాగి ఉన్న భయంకరమైన నిజాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది.
భార్య అడ్డొస్తోందన్న కోపంతో ఘాతుకం
కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పరిధిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
పోరంకి ప్రాంతానికి చెందిన ముక్కామల ప్రసాద్ చౌదరి, రేణుకాదేవి భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు నాగేష్ లండన్‌లో చదువుతుండగా, కుమార్తె తేజశ్రీ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తోంది.
ఇదే సమయంలో పోరంకి ప్రాంతంలో బ్యూటీషియన్‌గా పని చేసే ఝాన్సీ తరచూ వారి ఇంటికి వచ్చి వెళ్లేది. ఈ పరిచయం క్రమంగా ప్రసాద్ చౌదరితో అక్రమ సంబంధంగా మారినట్టు పోలీసులు చెబుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న రేణుకాదేవి భర్తతో తరచూ గొడవపడేది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తోందన్న కోపం ప్రసాద్‌లో పెరిగిపోయింది. చివరికి భార్యను అడ్డు తొలగించాలనే దురాలోచనకు అతడు ప్రియురాలు ఝాన్సీతో కలిసి స్కెచ్ వేసినట్టు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.
గుండెపోటు ముసుగులో హత్య
గత ఏడాది మే 18వ తేదీ రాత్రి రేణుకాదేవి అకస్మాత్తుగా మృతి చెందింది.
ఆ రోజు ఆమె తల్లిదండ్రులు కూడా అదే ఇంట్లో ఉండటంతో ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదు. కుటుంబసభ్యులు, బంధువులు అందరూ ఇది గుండెపోటుతో జరిగిన సహజ మరణంగానే భావించారు.
ప్రసాద్ చౌదరి కూడా ఏమీ తెలియనట్టు వ్యవహరిస్తూ అంత్యక్రియలు పూర్తి చేశాడు. ఈ ఘటన అక్కడితో ముగిసినట్టే కనిపించింది.
9 నెలల తర్వాత మొదలైన అనుమానం
తల్లి మరణానంతరం లండన్ నుంచి ఇండియాకు వచ్చిన కుమారుడు నాగేష్ తండ్రి ప్రవర్తనలో మార్పును గమనించాడు. తల్లి చనిపోయిన బాధ తండ్రిలో ఎక్కడా కనిపించకపోవడం, రోజురోజుకు అతని ప్రవర్తన అనుమానాస్పదంగా మారడం నాగేష్‌ను కలవరపెట్టింది.
ఒకరోజు తండ్రి నిద్రిస్తున్న సమయంలో అతని మొబైల్‌ను పరిశీలించిన నాగేష్ షాక్‌కు గురయ్యాడు. ఫోన్‌లో ఉన్న కాల్ రికార్డ్స్, సంభాషణలు చూసిన తర్వాత తన తల్లి మరణం సహజం కాదన్న అనుమానం బలపడింది.
కాల్ రికార్డ్‌లో బయటపడ్డ భయంకర నిజం
ప్రసాద్ చౌదరి తన ప్రియురాలు ఝాన్సీతో మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డుల్లో,
రేణుకాదేవిని ఎలా చంపాలన్న ప్రణాళిక, ఘటన తర్వాత జరిగిన చర్చలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
ఈ ఆధారాలతో నాగేష్ నేరుగా పోలీసులను ఆశ్రయించాడు.
పోలీసుల విచారణలో బయటపడ్డ అసలు కథ
కొడుకు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రసాద్ చౌదరి, ఝాన్సీలను అదుపులోకి తీసుకుని సుదీర్ఘంగా విచారించారు.
విచారణలో బయటపడిన వివరాల ప్రకారం —
రేణుకాదేవికి నిద్రమాత్రలు కలిపిన ఫ్రూట్ జ్యూస్ ఇచ్చి, మత్తులోకి వెళ్లిన తర్వాత దిండుతో ముఖాన్ని నొక్కి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
కటకటాల వెనక్కి నిందితులు
బలమైన డిజిటల్ ఆధారాలు, కాల్ రికార్డ్స్, విచారణలో వచ్చిన ఒప్పుకోళ్లతో ఇద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాలతో వారిని రిమాండ్‌కు తరలించారు.
గుండెపోటు ముసుగులో దాచిన హత్య…
చివరికి ఒక్క ఫోన్ కాల్ రికార్డ్ వల్లే వెలుగులోకి రావడం ఇప్పుడు ఈ కేసును సంచలనంగా మార్చింది.
ఇవీ చదవండి: Karimnagar Kiladi Lady : కరీంనగర్‌లో కిలాడీ లేడీ.. సోషల్ మీడియా ద్వారా ట్రాప్.. 100 మందితో అక్రమ సంబంధాలు!
Hyderabad Crime : ఇదెక్కడి దారుణం తల్లీ.. 10 నెలల కొడుక్కి విషమిచ్చి తానూ ఆత్మహత్య చేసుకున్న తల్లి.. పసి బిడ్డ ప్రాణం ఎలా తీయాలనిపించింది?
