HomeAgricultureAndhra Pradesh: రైతన్నలకు శుభవార్త.. ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే ఖాతాల్లోకి డబ్బులు

Andhra Pradesh: రైతన్నలకు శుభవార్త.. ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే ఖాతాల్లోకి డబ్బులు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో రైతు సంక్షేమాన్ని కేంద్రంగా పెట్టుకుని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు అమలు చేస్తోందని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) వెల్లడించారు. రాష్ట్రంలో ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు జమ అవుతోందని, ఇది గతంలో ఎప్పుడూ లేనివిధమైన పారదర్శక విధానమని ఆయన తెలిపారు.

శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి పలు ధాన్యం సేకరణ కేంద్రాలు, గోదాములు, రైస్ మిల్లులను తనిఖీ చేసి రైతులతో నేరుగా మాట్లాడారు. ముందుగా అరసవెల్లిలోని మండల స్థాయి పౌరసరఫరాల గోదామును సందర్శించిన మంత్రి, అంగన్‌వాడీ కేంద్రాలు మరియు ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) కోసం సిద్ధంగా ఉన్న చక్కెర ప్యాకెట్లను స్వయంగా తూకం వేసి పరిశీలించారు.

అనంతరం గార మండలం రామచంద్రాపురంలోని శ్రీనివాస రైస్ మిల్లును సందర్శించి మిల్లర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం సేకరణపై రైతులతో మాట్లాడిన సమయంలో, డబ్బులు కేవలం 4 గంటల్లోనే ఖాతాల్లో పడుతున్నాయని రైతులు చెప్పడంతో మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. మిల్లుల వద్ద తరుగు, తేమ పేరుతో ఎలాంటి ఇబ్బందులు లేవని రైతులు స్పష్టం చేశారు.

గత ప్రభుత్వ బకాయిలకు పూర్తిస్థాయి చెక్

గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన రూ. 1,674 కోట్ల ధాన్యం బకాయిలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే పూర్తిగా చెల్లించిందని మంత్రి తెలిపారు. మొదటి నెలలో రూ. 1,000 కోట్లు, రెండో నెలలో మిగిలిన రూ. 674 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు.

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 38 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తయ్యిందని వివరించారు. దీని ద్వారా సుమారు 6 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 9,300 కోట్లు కేవలం 24 గంటల్లోనే జమ చేసినట్లు వెల్లడించారు.

శ్రీకాకుళం జిల్లాలో 6.50 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యానికి గానూ ఇప్పటివరకు 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రైతుల ఖాతాల్లోకి రూ. 1,200 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. మిగిలిన 1.50 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు కూడా త్వరలో పూర్తవుతుందని స్పష్టం చేశారు. ఈ మొత్తం ప్రక్రియలో రైతులు, మిల్లర్లు, హమాలీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని మంత్రి అన్నారు.

కొత్త సంస్కరణలు.. మరిన్ని సౌకర్యాలు
సిమ్మపేట గ్రామంలో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, రైతులకు ఉచితంగా తార్పాలిన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పట్టణాల్లో ప్రయోగాత్మకంగా రూ. 20కే కిలో గోధుమపిండి అందిస్తున్నామని, స్పందనను బట్టి ఈ పథకాన్ని గ్రామాలకు కూడా విస్తరిస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 34 వేల పాఠశాలలు, 4 వేల సంక్షేమ హాస్టళ్లకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని గుర్తుచేశారు.

జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ, తుపాను ప్రభావం ఉన్నప్పటికీ పక్కా ప్రణాళికతో ధాన్యం సేకరణను వేగవంతం చేశామని తెలిపారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ, గతంలోలా వాహనాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా, 15 రోజుల్లో ఎప్పుడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించామని పేర్కొన్నారు.

మొత్తంగా, ధాన్యం కొనుగోళ్లలో వేగం, పారదర్శకత, రైతులకు తక్షణ చెల్లింపులు—ఈ మూడింటితో ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు నిజమైన ఊరట లభిస్తోందని అధికారులు చెబుతున్నారు.

ఇవీ చదవండి: Telangana: అన్నదాతలకు తీపికబురు.. విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ‘విద్యుత్ అంబులెన్స్‌లు’
Telangana: అన్నదాతలకు గుడ్ న్యూస్.. ఈ నెల నుంచే కొత్త పథకం అమలు.. రూ.101 కోట్ల నిధులు విడుదల!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు