HomeInternationalAmerica : ప్రాణం తీశాడు.. దేశం దాటాడు.. అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య వెనుక...

America : ప్రాణం తీశాడు.. దేశం దాటాడు.. అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య వెనుక షాకింగ్ ట్విస్ట్!

America : న్యూ ఇయర్ రోజున అమెరికాలో చోటుచేసుకున్న తెలుగు యువతి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భారతీయ యువతి నికిత రావు హత్యకు ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మే కారణమని అమెరికా పోలీసులు బలమైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య తర్వాత నగదు లావాదేవీలు, దేశం విడిచి పారిపోవడం వంటి ఆధారాలు ఈ అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి.

హత్య తర్వాతే ఫిర్యాదు.. అదే రోజు భారత్‌కు పరారీ
డిసెంబర్ 31న నికిత రావు హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే రెండు రోజుల తర్వాత, జనవరి 2న ఆమె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తి అర్జున్ శర్మనేనని అధికారులు తెలిపారు.
అయితే అదే రోజున అర్జున్ అమెరికా నుంచి భారత్‌కు వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఫిర్యాదు చేసిన వెంటనే దేశం విడిచి వెళ్లడం అనుమానాలకు దారితీసింది.

ఈ ఘటన మేరీల్యాండ్ రాష్ట్రంలోని ఎలికాట్ సిటీలో చోటుచేసుకుంది.

అపార్ట్‌మెంట్‌లో దాడి.. కత్తిపోట్లు
పోలీసులు అర్జున్ ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడం, అతడు భారత్ వెళ్లిపోయిన విషయం తెలియడంతో జనవరి 3న అతడి అపార్ట్‌మెంట్‌పై దాడి చేశారు. అక్కడే నికిత రావు మృతదేహాన్ని గుర్తించారు.
ఆమె శరీరంపై పలుచోట్ల కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడైంది.

పోలీసుల ప్రకారం.. డిసెంబర్ 31 సాయంత్రం 7 గంటల ప్రాంతంలో అర్జున్ శర్మే నికితను హత్య చేసినట్లు అనుమానం.

మృతురాలి అకౌంట్ నుంచి డబ్బుల ట్రాన్స్‌ఫర్
హత్య తర్వాత వెలుగులోకి వచ్చిన మరో కీలక విషయం ఆర్థిక లావాదేవీలు.
డిసెంబర్ 31న నికిత మృతి చెందితే, జనవరి 1న ఆమె బ్యాంక్ అకౌంట్ నుంచి అర్జున్ అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయినట్లు పోలీసులు గుర్తించారు.
ఒకసారి 3,000 డాలర్లు
మరోసారి 395 డాలర్లు
మొత్తం కలిపి దాదాపు 4,000 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు 3.5 లక్షల రూపాయలు) అతడి అకౌంట్‌కు వెళ్లినట్లు తేలింది. ఈ లావాదేవీలు హత్యకు ముందు లేదా తర్వాత జరిగాయా అన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

చదువులో టాపర్.. కెరీర్‌లో దూసుకెళ్లిన నికిత
నికిత రావు చదువులో అత్యంత ప్రతిభావంతురాలు.
అమెరికాకు వెళ్లే ముందు ఆమె కిమ్స్ ఆస్పత్రిలో క్లినికల్ ఫార్మసిస్ట్‌గా పని చేసింది.
తర్వాత అమెరికా వెళ్లి మేరీల్యాండ్‌లో మాస్టర్స్ పూర్తి చేసి, ఓ ప్రముఖ ఫార్మా సంస్థలో ఉద్యోగం సంపాదించింది.

2025 ఫిబ్రవరిలో హెల్త్‌కేర్ కంపెనీలో చేరిన నికిత.. తక్కువ సమయంలోనే తన ప్రతిభతో “ఆల్ ఇన్ అవార్డ్” కూడా దక్కించుకుంది. ప్రస్తుతం ఆమె డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్టుగా పనిచేస్తోంది.

అర్జున్‌పై మర్డర్ కేసు.. ఇంటర్‌పోల్ రంగంలోకి
ఈ కేసులో అర్జున్ శర్మపై అమెరికా పోలీసులు ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ మర్డర్ చార్జెస్ నమోదు చేశారు. అతడిపై సెర్చ్ వారెంట్ కూడా జారీ అయ్యింది.
భారత ఎంబసీ నికిత కుటుంబంతో సంప్రదింపులు జరుపుతోంది.

అర్జున్‌ను తిరిగి అమెరికాకు తీసుకురావడానికి ఇంటర్‌పోల్ సహాయంతో పాటు, భారత్–అమెరికా మధ్య ఉన్న చట్టపరమైన ఒప్పందాల్ని వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.
పాస్‌పోర్టు వివరాల ప్రకారం అర్జున్ శర్మ చెన్నైకి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

అసలు కారణమేంటి?
నికితను ఎందుకు హత్య చేశాడు?
ఆర్థిక లావాదేవీలే కారణమా?
వ్యక్తిగత విభేదాలా?
డిసెంబర్ 31 రాత్రి అపార్ట్‌మెంట్‌లో నిజంగా ఏం జరిగింది?
ఈ ప్రశ్నలకు సమాధానాలు అర్జున్ శర్మను విచారించిన తర్వాతే తేలనుందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

విదేశాల్లో ఉన్నత చదువులు, మంచి ఉద్యోగంతో భవిష్యత్తు నిర్మించుకుంటున్న ఓ తెలుగు యువతి ఇలా దారుణంగా హత్యకు గురికావడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నేరస్థుడిని త్వరగా పట్టుకుని కఠిన శిక్ష విధించాలని నికిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ఇవీ చదవండి: Andhra Crime : పెళ్లైన మూడు నెలలకే వివాహిత ఆత్మహత్య.. వరకట్న వేధింపులే కారణమా?
Telangana Crime : అక్క వరుసయ్యే మహిళతో వివాహేతర బంధం.. చివరకు భర్త చేతిలో ఏమైందంటే..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు