Vande Bharat Sleeper: నూతన సంవత్సరం సమీపిస్తున్న వేళ రైలు ప్రయాణికులకు భారీ శుభవార్త అందింది. ఇప్పటివరకు చైర్‌కార్ సదుపాయాలతో మాత్రమే అందుబాటులో ఉన్న వందే భారత్ రైళ్లకు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా స్లీపర్ వందే భారత్ రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నాయి. అత్యాధునిక సాంకేతికతతో రూపొందిన ఈ రైళ్లు ట్రయల్ రన్స్‌లో సంచలన రికార్డులు నమోదు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
2026లో భారతీయ రైల్వేకు కొత్త రూపం
భారతీయ రైల్వే ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న వందే భారత్ స్లీపర్ ప్రాజెక్ట్‌తో 2026 నుంచి దేశవ్యాప్తంగా రైలు ప్రయాణ అనుభవం పూర్తిగా మారనుంది. ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో చైర్‌కార్ కోచ్‌లే ఉండటంతో, దీర్ఘదూర మరియు రాత్రి ప్రయాణాల్లో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా రాత్రి ప్రయాణాలకు అనువుగా స్లీపర్ కోచ్‌లతో కొత్త వందే భారత్ రైళ్లను తీసుకురానున్నారు.
కోటా–నాగ్ధా మధ్య చారిత్రాత్మక ట్రయల్ రన్
రాజస్థాన్‌లోని కోటా – నాగ్ధా మార్గంలో నిర్వహించిన ట్రయల్ రన్‌లో వందే భారత్ స్లీపర్ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగం సాధించి అరుదైన రికార్డ్ నమోదు చేసింది. అంతేకాదు, రైలు స్థిరత్వాన్ని పరీక్షించేందుకు నిర్వహించిన ‘వాటర్ టెస్ట్’ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రైల్లో ఉంచిన నీటి గ్లాసులు అత్యధిక వేగంలోనూ ఒక్క చుక్క కూడా జారిపోకుండా ఉండటం ఈ రైలు సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది.
ఈ విశేషాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించారు. ట్రయల్ రన్స్‌లో వందే భారత్ స్లీపర్ రైలు అత్యుత్తమ పనితీరును చూపిందని ఆయన పేర్కొన్నారు.
రాత్రి ప్రయాణికులకు ప్రత్యేక సౌకర్యాలు
స్లీపర్ వందే భారత్ రైళ్లలో ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక ఆధునిక ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి.
సెన్సార్ ఆధారిత లైటింగ్
బయో వాక్యూమ్ టాయిలెట్లు
కవచ్ భద్రతా సాంకేతికత
కుదుపులు తగ్గించే ప్రత్యేక సస్పెన్షన్ సిస్టమ్
ఈ రైళ్లలో థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ కోచ్‌లు ఉంటాయి. మొత్తం 16 కోచ్‌లతో రూపొందిన ఈ ట్రైన్‌ను BEML, IPF సంస్థలు కలిసి అభివృద్ధి చేశాయి.
తొలి సర్వీస్ ఎక్కడంటే?
తొలి వందే భారత్ స్లీపర్ రైలు త్వరలో ఢిల్లీ – పాట్నా మధ్య ప్రారంభించనున్నారు. అనంతరం ఢిల్లీ–ముంబై రూట్‌లో రెండో సర్వీస్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత దశలవారీగా దేశవ్యాప్తంగా కీలక మార్గాల్లో ఈ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
ఇవీ చదవండి: Vande bharat express fire: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు, మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
Indian Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. వందే భారత్ సహా పలు రైళ్లలో చార్జీల సవరణ.. ఎంత తగ్గించారంటే..
