PMKVY : దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY) అమలులో భారీ అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. యువతకు నైపుణ్యాలు అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ పథకం కింద నిధుల దుర్వినియోగం జరిగిందని కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ గుర్తించింది. నకిలీ శిక్షణార్థులు, అసలు లేని సెంటర్లు, ఫేక్ సర్టిఫికేట్లు – ఇలా మోసపూరిత పద్ధతుల ద్వారా నిధులు దోచుకున్న అనేక కేంద్రాలను బహిర్గతం చేసింది.
ఇప్పటికే 178 ట్రైనింగ్ పార్ట్‌నర్లు (TPలు), ట్రైనింగ్ సెంటర్లు (TCలు) బ్లాక్‌లిస్ట్‌లో చేర్చబడ్డాయి. పథక నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
2015లో ప్రారంభమైన ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా ఇప్పటివరకు (జూన్ 2025 వరకు) 1.64 కోట్ల మందికి శిక్షణ అందించారు. కానీ 2022లో ప్రారంభమైన నాలుగో దశ (PMKVY 4.0) అమలులోనూ అవకతవకలు ఎక్కువయ్యాయి. అనేక ప్రాంతాల్లో శిక్షణార్థులు లేకపోయినా హాజరు చూపించడం, నకిలీ బిల్లులు తయారు చేయడం, సెంటర్ లేనిపక్షంలో కూడా నిధులు పొందడం వంటి అక్రమాలు బయటపడ్డాయి.
నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ అక్టోబర్ 30న అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ప్రాంతీయ డైరెక్టరేట్‌లకు లేఖ రాసి, పథకాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తులు, సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
బ్లాక్‌లిస్ట్‌లో ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు:
ఉత్తరప్రదేశ్ – 59 కేంద్రాలు/భాగస్వాములు
ఢిల్లీ – 25
మధ్యప్రదేశ్ – 24
రాజస్థాన్ – 20
నైపుణ్యాభివృద్ధి లక్ష్యాలను దెబ్బతీసిన ఈ అక్రమ చర్యలపై కేంద్రం సీరియస్‌గా వ్యవహరిస్తోంది. PMKVY పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు కొత్త పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా మంత్రిత్వ శాఖ యోచిస్తోంది.
ఇవీ చదవండి: PM Modi : గుజరాత్‌లో పటేల్ 150వ జయంతి వేడుకలో ప్రధాని మోడీ — ఐక్యతపై బాహుబల చూపించిందే
Trump : భారత్ గొప్ప దేశం.. ప్రధాని మోదీపై ట్రంప్ ప్రశంసల జల్లు
