Anti immigrant protests : అభివృద్ధి చెందిన దేశాల్లో వలసలు ప్రధాన సమస్యగా మారాయి. అధిక జీవన ప్రమాణాలు, ఉద్యోగ అవకాశాలు ఆకర్షణీయంగా ఉండటంతో ఇతర దేశాల నుంచి వలసలు గణనీయంగా పెరిగాయి. గతంలో వలసదారులకు స్వాగతం లభించగా, ఇప్పుడు పరిస్థితి మారింది. “స్థానికులకే ఉద్యోగాలు” అనే నినాదంతో అనేక దేశాల్లో నిరసనలు, ఉద్యమాలు తీవ్రమవుతున్నాయి. ఉన్నత విద్య, మెరుగైన భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయుల ఆశలపై ఈ పరిణామాలు నీళ్లు చల్లుతున్నాయి.
అమెరికా నుంచి ఐరోపా వరకూ వ్యతిరేకత వ్యాప్తి
అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఐరోపా దేశాల్లో వలసలపై వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరుగుతోంది. ప్రతి ఏడాది లక్షలాది మంది వలస వెళుతున్నారు. ఒకప్పుడు అమెరికాకు మాత్రమే పరిమితమైన ఈ వ్యతిరేకత ఇప్పుడు ఇతర దేశాలకు వ్యాపించింది. దీంతో వలసదారుల భద్రత, భవిష్యత్తు అనిశ్చితంగా మారుతోంది. “స్థానికులకు ప్రాధాన్యం” అనే డిమాండ్‌తో నిరసనలు చెలరేగుతున్నాయి.
‘అమెరికా ఫస్ట్’తో మొదలైన వివాదం
అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం అనుసరించిన ‘అమెరికా ఫస్ట్’ విధానం వలస వ్యతిరేకతకు మూలం వేసింది. డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంపై ప్రచారం చేసి అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ నినాదంతో అమెరికన్లకు ప్రాధాన్యమిస్తూ, వలసదారులపై కఠిన ఆంక్షలు విధించారు. ఈ ధోరణి ఇతర దేశాలకూ విస్తరించింది. ఆస్ట్రేలియాలో ‘మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా’ పేరిట వేలాది మంది వలసలను నిలిపివేయాలని ఆందోళన చేశారు. కెనడాలోనూ విదేశీయులు, ముఖ్యంగా భారతీయులు దేశం విడిచి వెళ్లాలని నిరసనలు జరిగాయి.
ఐరోపాలో తీవ్రమైన ఆందోళనలు
ఐరోపాలో వలస వ్యతిరేకత మరింత ఉద్ధృతంగా ఉంది. లండన్‌లో లక్షన్నర మంది నిరసనలో పాల్గొనగా, జర్మనీ, డబ్లిన్, వార్సాలోనూ ఇలాంటి ఆందోళనలు చోటుచేసుకున్నాయి. ఈ పరిణామాలు విదేశాల్లో విద్య, ఉద్యోగాల కోసం వెళ్లే భారతీయులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్థిక, సామాజిక భద్రతకు ఢోకా ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జాతి విద్వేష దాడుల భయం
వలస వ్యతిరేక నిరసనలు తీవ్రమైతే, భారతీయులపై జాతి విద్వేష దాడులు జరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఈ సమస్యను దౌత్యపరంగా పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. సలహాలు, సూచనలకే పరిమితం కాకుండా, ఆయా దేశాలతో చర్చలు జరిపి భారతీయుల భద్రతకు హామీ ఇవ్వాలని వారు సూచిస్తున్నారు.
వలస వ్యతిరేకత ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తుండటంతో, భారతీయ వలసదారుల భవిష్యత్తు అనిశ్చితంగా మారుతోంది. ఈ సవాళ్లను అధిగమించేందుకు గట్టి చర్యలు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చదవండి: Climate Crisis: వంద కోట్ల మంది సామూహిక వలసలు..!
Indian Woman Begging : ఏమీటీ దుర్గతి? కెనడాలో భారత యువతి భిక్షాటన? వీడియో వైరల్!
