HomeAndhra PradeshYS Jagan at Bangarupalem : రైతులపై రౌడీషీట్లు తెరుస్తామంటారా?

YS Jagan at Bangarupalem : రైతులపై రౌడీషీట్లు తెరుస్తామంటారా?

YS Jagan at Bangarupalem : మామిడి రైతుల నుంచి పంట కొనకుండా చంద్రబాబు ప్రభుత్వం గాడిదలు కాస్తోందా? అంటూ మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మరే రాష్ట్రంలోనైనా మామిడి కిలో రూ.2కు దొరుకుతుందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను వచ్చి రైతుల్ని పరామర్శిస్తే తప్పేంటని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డును సందర్శించిన వైయస్ జగన్.. అక్కడ మీడియాతో మాట్లాడారు. మామిడి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. (YS Jagan at Bangarupalem)

రైతుల జీవితాలు నాశనమైపోవాలా?
సమస్యలపై ఎవరూ బయటకు తొంగి చూడకూడదని, రైతులు ఎన్ని అగచాట్లు పడుతున్నా కూడా, వాళ్ల జీవితాలు నాశనమైపోవాలి అని ఎందుకు ఈ ఆంక్షలు పెడుతున్నారు? జగన్ వచ్చి రైతుల్ని కలిస్తే తప్పేమిటి? జగన్ వచ్చి రైతుల కోసం మాట్లాడితే తప్పేముంది? పోనీ రైతులు అగచాట్లు పడకుండా ఉన్నింటే, రైతులకు సమస్యలు లేకపోయి ఉంటే ఇన్ని వేల మంది ఎందుకు వస్తారు? జగన్ వచ్చాడు కాబట్టి.. జగన్ వాళ్లకు తోడుగా నిలబడుతున్నాడు కాబట్టి.. వాళ్ల సమస్య ఇప్పుడైనా ప్రభుత్వం దృష్టికి కచ్చితంగా పోతుంది అని చెప్పి.. ప్రభుత్వం కనీసం ఈ కుంభకర్ణుడి నిద్ర నుంచి ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపడం కోసం ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చి వాళ్ల ఆక్రందన వినిపిస్తున్నారు. YS Jagan at Bangarupalem

2 వేల మందిని మోహరిస్తారా?
ఇవాళ ఇక్కడికి జగన్ వస్తున్నాడని తెలిసి.. 2 వేల మంది పోలీసులను మోహరించారు. ప్రతి గ్రామంలోనూ ఏ రైతూ కూడా రాకూడదని కట్టడి చేశారు. ఏకంగా రైతులను రౌడీషీట్లు తెరుస్తాం, మీరు కనుక ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటే అని రైతుల్ని బెదిరించారు. రైతులు స్వచ్ఛందంగా వచ్చే కార్యక్రమంలో భాగంగా టూవీలర్స్ లో ఎవరైనా వస్తే పెట్రోలు పోయకండి అంటూ చెప్పారు. కేవలం 500 మంది మాత్రమే రావాలట. కేవలం 500 మంది మాత్రమే రైతులు నష్టపోయారా? ఎందుకీ ప్రభుత్వం భయపడుతోంది? ఎందుకీ ప్రభుత్వం ఆంక్షలు పెడుతోంది. జగన్ వస్తే తప్పేముంది? రైతులతో మాట్లాడితే తప్పేముంది? రైతు సమస్యలు జగన్ లేవనెత్తితే తప్పేముంది?

ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు
రైతులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టే ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చి వాళ్ల ఆవేదన చెబుతున్నారు. ఇవాళ రైతులు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర రాని పరిస్థితి. వరి తీసుకుంటే దాదాపు రూ.300 నుంచి రూ.400 తక్కువకు అమ్ముకుంటున్న పరిస్థితి. మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, చీనీ, కోకో, పొగాకు, టొమాటో, చివరికి మామిడి.. ఏ రైతు పరిస్థితి చూసుకున్నా గిట్టుబాటు ధర రావడం లేదు. ఏ రైతుకూ కనీస మద్దతు ధర రాని పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రంలో తప్ప.. వేరే రాష్ట్రంలో ఎక్కడైనా కూడా రూ.2కే కేజీ ఎక్కడైనా దొరుకుతుందా? కానీ ఈరోజు చంద్రబాబు పరిపాలన చేస్తున్న రాష్ట్రంలో మామిడి కేవలం రూ.2కే దొరుకుతున్న పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. YS Jagan at Bangarupalem

వైయస్సార్ సీసీ హయాంలో కేజీ రూ.29
ఇదే రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈరోజు రైతులకు మామిడి పంట అమ్ముకుంటే.. ఇదే మండలానికి సంబంధించిన రైతులు ఉన్నారు. మామిడి పంట అమ్ముకుంటున్న రైతులు.. అన్నా.. రెండున్నర రూపాయలు రావడం లేదంటున్నారు. ఇదే రైతన్నలకు గత సంవత్సరం వైయస్సార్ సీపీ హయాంలో ఇదే పంట కేజీ రూ.29 రూపాయలు పలికింది. వైయస్సార్ సీపీ ప్రభుత్వంలో మామిడి పంటను ఇదే చిత్తూరు జిల్లాలో రూ.22 నుంచి రూ.29 వరకు రైతులు అమ్ముకున్నారు. ఇదే చిత్తూరు జిల్లాలో వైయస్సార్ సీపీ ప్రభుత్వం వెళ్లిపోయిన తర్వాత సంవత్సర కాలంలో రైతుల బతుకులు తల్లకిందులయ్యాయి. YS Jagan at Bangarupalem

జూన్ 3వ వారమైనా కొనరా?
అయ్యా చంద్రబాబూ.. ప్రతి ఏటా మామిడి కొనుగోళ్లు కార్యక్రమం అన్నది మే 10వ తేదీ నుంచి మే 15వ తేదీ మధ్యలో మొదలు పెడతారు. మరి ఎందుకు ఈ సంవత్సరం మొదలు పెట్టలేదు? జూన్ 2వ వారం, 3వ వారంలో వస్తే గానీ మార్కెట్ తెరవలేదు. పంట మొత్తం ఒకేసారి ఒత్తిడి పెరిగింది. ఫ్యాక్టరీలకు ఒకేసారి పంట మొత్తం తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. పంట కుళ్లిపోయే పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి రైతన్నలు ఏం చేయాలో దిక్కు తోచక.. ఫ్యాక్టరీలు తెరిచే టయ్యానికి వీళ్లు పంట అమ్ముకుందామంటే రేటు రెండున్నర రూపాయలు, మూడు రూపాయలకు కొనే నాథుడు లేడు. 52 పల్ప్ కంపెనీలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. మే 10, 15వ తేదీన తెరవాల్సిన ఫ్యాక్టరీలు మే 2వ వారం, 3వ వారమైనా తెరవకపోతే మీరు ఏం గాడిదలు కాస్తున్నారు చంద్రబాబూ?

ఎంత మంది రైతులకు ఇచ్చారు?
ఎంత మంది రైతులకు ఈ ఫ్యాక్టరీలు కేజీ రూ.8కి కొనుగోలు చేశారు? రూ.4 చొప్పున ఎంత మంది రైతులకు ఇచ్చారు? అయ్యా చంద్రబాబూ.. మీ పుణ్యాన పరిస్థితి ఏమిటి అంటే.. ఈరోజు రైతులకు ఏ ఒక్కరికీ కూడా గిట్టుబాటు రాని పరిస్థితి. పక్కన కర్ణాటకలో రూ.16 కేజీకి అక్కడి జనతాదళ్ నేత కేంద్ర మంత్రి కుమార స్వామి అడిగితే కేంద్రం ముందుకొచ్చిందట. ఈ రూ.16 కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ముందుకొచ్చింది కూడా మంచి రేటు అని కాదు.. కనీస రేటు. మరి చంద్రబాబు ప్రభుత్వం ఏం గాడిదలు కాస్తోంది. చిత్తూరు జిల్లాలో 6.45 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. 2.20 లక్షల ఎకరాల్లో పంట పండుతుంది. 76 వేల మంది రైతులు వ్యవసాయం చేస్తూ మామిడి మీద బతుకుతారు. ఈ 76 వేల కుటుంబాలకు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత మందికి రూ.12 కేజీకి వచ్చింది? ఇదే చంద్రబాబు నాయుడు రూ.12 కూడా ఇవ్వలేక, ఇప్పించే పరిస్థితి లేక రైతుల్ని నడిరోడ్డుపై నిలబెట్టాడు.

జగన్ వస్తున్నాడు కాబట్టి మెసేజులు
రైతులకు ఇవాళ రెండున్న, మూడు రూపాయలకు ఇవాళ మార్కెట్ యార్డులోనూ, కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతోంది. ప్రతి దగ్గర కూడా జగన్ ఇవాళ వస్తున్నాడు కాబట్టి.. జగన్ వస్తున్నాడు అని చెప్పి మూడు రోజుల నుంచి రూ.6 ఇస్తాము అని మెసేజులు పెడుతున్నారు. అయ్యా చంద్రబాబూ.. రైతులకు కనీసం రూ.3 కూడా లేకుండా కేజీ అమ్ముతున్నారు అంటే ఏమి నిద్రపోతున్నారు అని అడుగుతున్నారు.

వ్యవసాయం రూపురేఖలు మార్చాం
మా ప్రభుత్వ హయాంలో వ్యవసాయం రూపురేఖలు మారుస్తూ రైతులకు తోడుగా ఉన్న పరిస్థితి ఉండేది. రైతన్నలకు మే మాసం వచ్చే సరికి పంట కొనుగోలు కోసం పెట్టుబడి సహాయం అందేది. రైతన్నలకు ఆర్బీకేలు తోడుగా ఉండేవి. చేయి పట్టుకుని రైతన్నలను నడిపించే కార్యక్రమం జరిగేది. కానీ ఈరోజు ఏం జరుగుతోంది? మొదటి సంవత్సరం దాటిపోయింది. రైతన్నలకు ఇవాళ ఇవ్వాల్సిన రైతు భరోసా రూ.20 వేలు ఎగరగొట్టేశారు. ఈ సంవత్సరం కూడా జూన్ అయిపోయింది, జూలైలో ఇవాళ ఉన్నాం. ఇంత వరకు రైతులకు పెట్టుబడి సహాయం అందలేదు.

చంద్రబాబు పుణ్యాన అన్నీ పోయాయి..
చంద్రబాబు పుణ్యాన రైతులకు సమయానికే రావాల్సిన ఇన్ పుట్ సబ్సిడీ రాకుండా పోయింది. చంద్రబాబు పుణ్యాన ఉచిత పంటల బీమా రైతులకు పూర్తిగా ఎగరగొట్టేసిన పరిస్థితి. చంద్రబాబు పుణ్యాన ఆర్బీకేలన్నీ నిర్వీర్యమైపోయి, ఈ-క్రాప్ అన్నది పూర్తిగా నిర్వీర్యమైపోయింది. రైతులకు కనీస మద్దతు ధర రానప్పుడు మా ప్రభుత్వ హయాంలో సీఎం యాప్ ఉండేది. ఆర్బీకేల పరిధిలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రాకపోయినా కూడా వెంటనే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ గా ఉన్న ఆర్బీకే అసిస్టెంట్ నోటిఫై చేసేవారు. జాయింట్ కలెక్టర్లు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్లుగా, మార్క్ ఫెడ్ గా వ్యవహరించేవాళ్లు. వెంటనే ఇన్వాల్వ్ అయ్యి ఆర్బీకే పరిధిలో ఈ క్రాప్ ఆధారంగా పంటను కొనుగోలు చేసేవారు. ఇవన్నీ పూర్తిగా కనుమరుగు అయిపోయాయి. ఆర్బీకేలు నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఇవాళ కనిపిస్తోంది. రైతులకు నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు యూరియాలు, ఎరువులు ఇవన్నీ కూడా ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలోనే సరఫరా చేసే పరిస్థితి ఇవాళ లేకుండా పోయింది. నియోజకవర్గానికి ఒక అగ్రి టెస్టింగ్ ల్యాబ్ కూడా ఇవాళ నిర్వీర్యమైపోయిన పరిస్థితి జరుగుతోంది. వ్యవసాయానికి సంబంధించిన అన్ని రంగాలూ ఇవాళ నిర్వీర్యమైపోయిన పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది.

ప్రభుత్వమే కొనాలి..
చంద్రబాబు నాయుడిని గట్టిగా డిమాండ్ చేస్తున్నా. 76 వేల మంది రైతులున్నారు. 6.45 లక్షల టన్నులు మామిడి పంట పండించే ఈ రైతులంతా 2.20 లక్షల ఎకరాల్లో పంట సాగవుతోంది. ఈ 76 వేల మంది రైతులకు మీరే రూ.12 వేలు వాళ్ల బ్యాంకు అకౌంట్లలో డబ్బులు వేయాలి. ఆ పంటను మీరే కొనుగోలు చేసి ఆ తర్వాత మార్కెట్ కు మీరే అమ్ముకోండి. రైతులు ఇవాళ ఫ్యాక్టరీలు కొనుక్కోక రెండున్నర, మూడు రూపాయలకు అమ్ముకోలేక, పంటలు కుళ్లిపోతున్న పరిస్థితుల్లో రైతులు.. తాము తెచ్చిన పంటను ఫ్యాక్టరీల చుట్టూ లారీల్లో సరుకు పెట్టుకుని, అక్కడ కూడా లారీ ఖర్చులకు డబ్బులు ఇవ్వలేక అగచాట్లు పడుతున్నారు. ఆ రైతులకు తోడుగా ఉండాలని కోరుతున్నా. లేదంటే రైతుల తరఫున వైయస్సార్ సీపీ గట్టిగా ఉద్యమిస్తుంది. చంద్రబాబు ఈ డిమాండ్లు నెరవేర్చకపోతే రైతుల తరఫున గట్టిగా ఉద్యమం చేస్తాం.

పోలీసులా? రాక్షసులా?
శశిధర్ రెడ్డి అనే వ్యక్తి.. తాను రైతు కుటుంబం కాదా అని అడుగుతున్నా. రాష్ట్రంలో 62 శాతం మంది వ్యవసాయం మీద బతుకుతున్నారు. చిత్తూరు జిల్లాలో దాదాపు 80 శాతం మంది వ్యవసాయం మీద బతుకుతున్నారు. మరి వీళ్లంతా రైతు బిడ్డలు కాదా? మరి వీళ్లందరినీ ఈ మాదిరిగా తల పగలగొట్టి దాదాపుగా 1200 మందిని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. విచ్చలవిడిగా లాఠీ చార్జ్ చేశారు. నేను అడుగుతున్నా. మీరు పోలీసులా? మనుషులా? మనిషి రూపంలో ఉన్న రాక్షసులా? ప్రతి పోలీసు అధికారికీ ఒకటే చెబుతున్నా. అయ్యా ప్రతి పోలీస్ సోదరుడా.. మీకు కూడా సమస్యలుంటాయి. ఎప్పుడు ఎవరికి సమస్య వచ్చినా పలికేది ఒక్క జగన్ మాత్రమే.

పలికేది జగన్ మాత్రమే
పొగాకు రైతులకు సమస్య అయినా జగనే పలుకుతున్నాడు. మామిడి రైతులైనా జగనే పలుకుతున్నాడు. మిర్చి రైతులైనా జగనే పలుకుతున్నాడు. ఉద్యోగస్తుల సమస్యలైనా కూడా వాళ్లకు ఐఆర్ ఇవ్వాలన్నా, పీఆర్సీ డిమాండ్ చేయాలన్నా, వాళ్లకు డీఏలు ఇప్పించాలన్నా, చివరికి చంద్రబాబు హామీలను నిలదీస్తూ గట్టిగా ప్రశ్నించాలన్నా, ఆయన సూపర్ సిక్సు, సూపర్ సెవెన్లు మోసం చేసిన దాన్ని ఎండగట్టాలన్నా ఇక్కడ జగనే ముందుంటాడు అనేది ప్రతి పోలీస్ సోదరుడూ గుర్తుపెట్టుకోవాలి.

ప్రలోభాలకు లొంగకండి..
అధికారంలో ఉన్న ఆ ఎస్పీలు, డీఐజీలు లంచాలకు లోనవుతున్న ఆ సీఐలు.. వీళ్ల మాటలు వినకండి. వీళ్ల ప్రలోభాలకు లొంగకండి. రేప్పొద్దున మీ సమస్యలు కూడా ఇదే మాదిరిగానే చంద్రబాబు మోసం చేసి రోడ్డు మీద పడేసే కార్యక్రమం చేసినప్పుడు జగన్ అనే వ్యక్తి ముందుకు రావాలంటే.. ఈ మాదిరిగా పోలీస్ హరాస్మెంట్ జరుగుతున్న తీరును ప్రతి పోలీస్ సోదరుడు కూడా, కింది స్థాయిలో ఉన్న ప్రతి కానిస్టేబుల్ కూడా, ప్రతి ఎస్ఐ, సీఐ కూడా గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నా. లేదంటే ఈ రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడేవాడు ఎవడూ ఉండడు. ఆ సమస్య లేదు అని వక్రీకరిస్తారు, డ్రామాలాడతారు. తప్పుదోవ పట్టిస్తారు. సమస్యలను గాలికి వదిలేసే పరిస్థితి వస్తుంది. నష్టపోయే కార్యక్రమం జరుగుతుందని ప్రతి పోలీస్ సోదరుడికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.’’ అని వైయస్ జగన్ స్పష్టం చేశారు.

ఇవీ చదవండి: YSRCP Meets Governor : జగన్ భద్రతపై ప్రభుత్వం కుట్రలు: గవర్నర్‌కు వైసీపీ ఫిర్యాదు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు