AP DSC – 2024: ఆంధ్రప్రదేశ్ లో మెగా డీఎస్సీకి సంబంధించి రోజుకో అప్ డేట్ వస్తోంది. కానీ ప్రభుత్వం మాత్రం ఎప్పుడు నోటిఫికేషన్ (AP DSC – 2024) ఇస్తామన్నది అభ్యర్థులకు క్లారిటీ ఇవ్వడం లేదు. పత్రికలు, న్యూస్ ఛానళ్లలో అప్ డేట్లు రోజూ వస్తున్నాయి. తాజాగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఫిబ్రవరిలో ఉండొచ్చంటూ రీసెంట్ గా కథనాలు వచ్చాయి.
ఏపీలో 16,347 పోస్టులతో మెగా డీఎస్సీకి అడుగులు ముందుకు సాగడంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఎస్సీ వర్గీకరణపై కార్యాచరణ మొదలైందని, ఫిబ్రవరిలో ఏకసభ్యకమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందని వార్తలు వస్తున్నాయి తప్ప ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందన్నది క్లారిటీ రావడం లేదు. అదే నెలాఖరులో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలున్నాయని కథనాలు వస్తున్నాయి. విద్యాశాఖ రోడ్ మ్యాప్ ప్రకారం ఫిబ్రవరి 20వ తేదీ నుంచి టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు ఉంటాయని, ఇవి పూర్తయిన మరుసటి రోజే నోటిఫికేషన్ ఇచ్చే చాన్స్ ఉందని సమాచారం.
ఇప్పటికే డీఎస్సీకి సంబంధించిన సిలబస్ విడుదలైంది. ఎస్సీ వర్గీకరణపై నియమించిన ఏకసభ్య కమిషన్ కూడా 60 రోజుల్లో నివేదిక ఇవ్వనుంది. డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన 45 రోజుల్లోనే పరీక్షలుంటాయని కొందరు, 3 నెలల సమయం ఇస్తారని కొందరు వాదిస్తున్నారు. అయితే, మంత్రి నారా లోకేష్ ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 3 నెలల సమయం ఇస్తామని చెప్పారు. మొత్తంగా పాఠశాలలు ప్రారంభమయ్యే తేదీ జూన్ 12 నాటికి కొత్త టీచర్లకు పోస్టింగులు ఇవ్వడం కత్తిమీద సాము లాంటిదనే చెప్పాలి.
ఇక సీఎం చంద్రబాబు పాలనలో మొత్తంగా ఇప్పటి వరకు 9 సార్లు డీఎస్సీలు పెట్టారని, తద్వారా 2,32,179 పోస్టులు భర్తీకి చర్యలు తీసుకున్నారంటూ తాజాగా ఓ పత్రికలో రాశారు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం నుంచి అధికారికంగా నోటిఫికేషన్ తేదీ రాకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో ప్రిపరేషన్ కోసం సమయం దొరికిందని మరికొందరు సంతోష పడుతున్నారు. పత్రికల్లో వచ్చినట్లుగా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తే జూన్ నాటికి దాదాపు ప్రక్రియ పూర్తయ్యే చాన్స్ ఉంది.
అయితే, ఇందులో న్యాయ వివాదాలు లేకుండా, పోస్టింగులు కూడా త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకుంటే మంచిదని టీచర్ ఉద్యోగార్థులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పరీక్షలు రాసి పోస్టు కొట్టిన తర్వాత పోస్టింగుల కోసం సంవత్సరాల తరబడి వేచి ఉండటం కూడా ఇబ్బంది కరం అని చెబుతున్నారు. మొత్తానికి డీఎస్సీ నోటిఫికేషన్ మాట అటుంచితే ఈ సమయం ప్రిపేర్ కావడానికి ఉపయోగించుకొని మంచి స్కోర్ సాధించేందుకు ఉపయోగపడుతోందని చెప్పొచ్చు.
ఇవీ చదవండి: Andhra Pradesh Mega DSC: విద్యావాలంటీర్ల నియామకమేనా? 16,347 పోస్టుల డీఎస్సీ ఎప్పుడు?
AP Mega DSC: మెగా డీఎస్సీ ద్వారా ఆరు నెలల్లో టీచర్ పోస్టుల భర్తీ: లోకేష్
Mega DSC: ఆర్ఆర్ మిశ్రా కమిటీ నివేదిక ఎప్పుడు? ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ అప్ డేట్!
