Andhra Pradesh News: ఇంట్లో ఆడపడుచు కన్నీళ్లు పెట్టుకుంటే అరిష్టమని జగన్ గుర్తించాలని మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. (Andhra Pradesh News) జగన్ కుటుంబ ఆస్తుల గొడవపై ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు.
షర్మిల ఆస్తుల గొడవల విషయంలో షర్మిల-జగన్ ఒకరికొకరు బహిరంగ లేఖలు రాసుకుంటున్నారన్నారు. ఆస్తుల విషయంలో రోడ్డుపైకి రావడం చూస్తున్నామన్నారు. నిజంగా రాజశేఖర రెడ్డి 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతో హోందాగా నడుచుకున్నారని గుర్తు చేశారు. వీళ్లు రాజశేఖర్ రెడ్డిని బజారున పెడుతున్నారంటే.. సిగ్గుపడాల్సిన అవసరం ఉందన్నారు.
రాజకీయ భిక్ష పెట్టింది వైయస్ఆర్
‘‘నేను జనసేనలో చేరి ఉండొచ్చు. కానీ నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర్ రెడ్డి. ఈ గొడవలు చూసి పార్టీ మారిన నాకు కూడా బాధ కలిగిందంటే… ఎంతో మంది రాజశేఖర్ రెడ్డి అభిమానులు బాధపడుతున్నారు. అసహ్యించుకుంటున్నారని వాళ్లు ఇద్దరు గుర్తుపెట్టుకోవాలి. రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని గురించి చోటా నాయకులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. నిన్న వైవీ సుబ్బారెడ్డి షర్మిల గురించి మాట్లాడారు. వైవీ కానీ నేను కానీ విజయమ్మ వల్ల పైకి వచ్చిన వాళ్ళమే.
వైవీ ఆర్ధికంగా బలపడ్డారంటే విజయమ్మ వల్ల. నేను రాజకీయంగా బలపడ్డానంటే విజయమ్మ వల్ల. విజయమ్మ ఎంతో బాధపడుతుంటే ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా? షర్మిల కన్నీళ్లు పెట్టుకొని ఒక మాట మాట్లాడారు. నేను నా బిడ్డల మీద ఓట్టు వేస్తానని అన్నారు. నువ్వు నీ మనవళ్లు మీద ఓట్టు వేస్తావా అంటే.. ఒక మాట మాట్లాడలేదు. దానికి వైవీ నుంచి సమాధానం లేదు. ఎందుకు మాట్లాడాలి. ఎందుకు అనిపించుకోవాలి ..అసలు మనకు ఏం పని?
విజయమ్మ పరిష్కరిస్తారు. జగన్, షర్మిల.. విజయమ్మకి రెండు కళ్లు. షేర్స్ మార్చినదానికి జగన్ కోర్టుకు వెళ్తారని, బెయిల్ రద్దు అవుతుందని మాట్లాడుతున్నారు. ఒక కొడుకు బెయిల్ రద్దు అయి జైలుకి వెళ్లాలని తల్లి ఆ పనిచేస్తోందా? ఒకవేళ విజయమ్మకు తెలియకుండా జరిగిందనికుంటే.. అప్పుడు జగన్ ఇలా జరిగిందని మాట్లాడితే ఆ తల్లి స్పందించారా?
ఎందుకు రచ్చ చేసుకుంటున్నారు. మీరు రచ్చ చేసుకుంటూ ఒకరికొకరు లేఖలు రాసుకుంటే చంద్రబాబు గారిని ఏమి సంబంధం? పవన్ కల్యాణ్, కూటమికి ఏం సంబంధం? ఈ అంశంలో వైవీ సుబ్బారెడ్డి, సజ్జల కాదు.. విజయమ్మ బయటికి వచ్చి ఎవరిది తప్పో, ఒప్పో చెప్పాలి. ఒక ఆడపడుచు కన్నీళ్లంటే.. ఆ ఇంటికే ఆరిష్టం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆస్తుల గొడవను పరిష్కరించడానికి విజయమ్మ ముందుకు రావాలి.
ఎవరూ జోక్యం చేసుకోరాదు
విజయమ్మ తప్ప ఎవరూ జోక్యం చేసుకోకూడదు. ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టి ఆమె ముందుకు వచ్చి ఈ విషయాన్ని పరిష్కరించాలి. వైయస్సార్ సీపీలో నేను సంపాదించుకోలేదు.. ఉన్నవి కూడా పోగొట్టుకున్నా. నా బిడ్డ సాక్షిగా చెబుతున్నా. నేనేమీ సంపాదించుకోలేదు. ఎలా పోగొట్టుకున్నానో ఇన్నాళ్లూ నేను మనసులోనే పెట్టుకున్నా. నాకు సంస్కారం ఉంది కాబట్టి పార్టీ మారాక నేనేమీ మాట్లాడలేదు. నాపై విమర్శలు చేసేవాళ్లు జగన్ ను నేరుగా అడగండి.
ఇవీ చదవండి: Jagan and Sharmila: కుటుంబ తగాదాలు రాజకీయం చేయొద్దు
YS Jagan Clarity: ఫ్యామిలీ ఆస్తుల గొడవపై స్పష్టత ఇచ్చిన జగన్!
CBN on Jagan Family issue: జగన్ ఫ్యామిలీ ఇష్యూపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
YS Jagan bail: జగన్ బెయిల్ రద్దు ప్రమాదం!
