గురువారం, 10 సెప్టెంబర్ 2026తాజా వార్తలు • ట్రెండింగ్
Andhra Pradesh

Vijayasai Reddy: చంద్రబాబుతో షర్మిల కుమ్మక్కు.. సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ప్రచురణ తేదీ: ఆదివారం, 27 అక్టోబర్ 2024

Vijayasai Reddy: తల్లి విజయమ్మ కన్నీళ్లు తుడవడానికి ప్రజల ముందుకు వచ్చానని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చెబుతున్నది ఆవాస్తవమని, ఆమె సీఎం చంద్రబాబు కళ్లలో ఆనందం కోసమే ఈ పని చేస్తున్నారని, ఇది అసలు ఆస్తి తగాదా కానేకాదని, అధికారం కోసం చేస్తున్న వివాదం అని వైయస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభలో పార్టీ పక్షనేత వి.విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) స్పష్టం చేశారు. తన అన్న జగన్‌ మళ్లీ సీఎం కాకూడదన్న ఎజెండాతోనే ఆమె పని చేస్తున్నారని ఆయన వెల్లడించారు. కేంద్రంలో కాంగ్రెస్‌ ఎన్డీఏకు వ్యతిరేకంగా ఉంటే, ఇక్కడ అదే కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు, అదే ఎన్డీఏకు అనుకూలంగా పని చేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ
వైఎస్‌ఆర్‌ మరణానికి చంద్రబాబు కారకుడని అనేకసార్లు చెప్పిన షర్మిల, ఇప్పుడు అదే చంద్రబాబు ఎజెండా అమలు చేస్తున్నారని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. తల్లి, చెల్లిని మోసం చేసిన జగన్, ప్రజలకు ఏం చేస్తాడని షర్మిల ప్రశ్నించడం తగదని ఆయన మండిపడ్డారు. తల్లి, చెల్లిని జగన్‌ మోసం చేశాడంటూ అదే పనిగా ప్రచారం చేయాలని షర్మిలకు చంద్రబాబు బ్రాండింగ్‌ ఇచ్చాడని, ఆ అజెండానే అమలు చేస్తూ, ఆయన్ను నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నారని ఆక్షేపించారు.

జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు దాదాపు కోటిన్నర కుటుంబాలకు సంక్షేమం, 80 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఆసరా, 40 లక్షలకు పైగా తల్లులకు అమ్మఒడి ఇచ్చిన సంగతి షర్మిల మర్చిపోయారా? అని ప్రశ్నించారు. మహిళా సంక్షేమం కోసం ఇంతగా పాటుపడిన సీఎంను గతంలో ఎక్కడైనా చూశామా? అని ప్రస్తావించారు. జగన్‌ మీద మహిళల్లో వ్యతిరేకత పెంచాలన్న దుర్భుద్ధితో చంద్రబాబు తెలివిగా షర్మిలను వాడుకుంటున్నాడని చెప్పారు. కలలో కూడా మహిళలకు అన్యాయం చేయని జగన్‌పై చంద్రబాబు ఎన్ని కుట్రల చేసిన ప్రజలు నమ్మబోరని స్పష్టం చేశారు. అందుకే షర్మిల ఆత్మవిమర్శ చేసుకుని, అంతరాత్మ సాక్షిగా ఆలోచించాలని కోరారు.

షర్మిల అనైతిక వ్యవహారం
వైయస్సార్‌ దుర్మార్గమైన చావు చస్తారన్న చంద్రబాబు ప్రకటన తర్వాత, నాలుగైదు రోజుల్లోనే ఆయన చనిపోయారని.. అలాంటి వ్యక్తితో కలసి పని చేయడం, చేతులు కలపడం, పసుపు చీర కట్టుకుని ఆయన మెప్పు పొందడం అత్యంత దారుణమని, ఇంతటి అమానవీయ ప్రవర్తన ఎక్కడైనా ఉంటుందా? అని విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ఆక్షేపించారు. వైయస్సార్‌ మరణం తర్వాత, ఓదార్పు యాత్రకు ఒప్పుకోకపోవడంతో జగన్‌ కాంగ్రెస్‌ వీడడంతో, అంతా కక్ష కట్టి.. కాంగ్రెస్‌కు చెందిన శంకరరావు, టీడీపీ నేతలు ఎర్రన్నాయుడు, అశోక్‌గజపతిరాజు.. బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని ఉపయోగించుకుని జగన్‌ను జైలుకు పంపిన విషయం షర్మిల నిజంగా మర్చిపోయారా? లేక స్వలాభం కోసం మర్చిపోయినట్లు నటిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఇలాంటి నటనలు రాజకీయాల్లో అవసరం లేదన్నారు.

మోచేతి నీళ్లు తాగుతున్నామా?
రాజారెడ్డి నాటి నుంచి తనకు వైయస్‌ కుటుంబంతో అనుబంధం ఉందన్న విజయసాయిరెడ్డి.. ఇప్పుడు తాను, వైవీ సుబ్బారెడ్డి జగన్‌ మోచేతి నీళ్లు తాగుతున్నామని షర్మిల మాట్లాడడం బాధాకరమని ఆవేదన చెందారు. శతృవుకు మేలు చేసేందుకు సొంత అన్నను వేటాడి, వెంటాడి, కాటేసే, విషపు పాము వంటి షర్మిలను ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదన్నారు. తన అన్నపై అన్యాయంగా కేసు పెట్టి, బెయిల్‌ కూడా రాకుండా చేసి, 16 నెలలు జైల్లో పెట్టి హింసించిన కాంగ్రెస్‌కు రాష్ట్ర అధ్యక్షురాలుగా పని చేస్తూ, చంద్రబాబుతో కలసి అన్నపై కుట్ర చేస్తున్న షర్మిల ఎవరి కోసం కన్నీళ్లు పెట్టుకున్నారని నిలదీశారు. ఆ కన్నీళ్లకు విలువ లేదన్న ఆయన, ఇప్పుడు షర్మిల ప్రవర్తనతో వైయస్సార్‌ ఆత్మ కూడా క్షోభిస్తుందని చెప్పారు.

మీ లేఖ చంద్రబాబుకు ఎలా చేరింది?
ఎన్నికల మందు ఆర్భాటంగా ప్రకటించిన హామీలు అమలు చేయలేక విఫలమైన చంద్రబాబు, వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు, జగన్‌పై మహిళల్లో వ్యతిరేకత సృష్టించేందుకు తనను పావుగా వాడుకుంటున్నారన్న విషయాన్ని షర్మిల గ్రహించాలని సూచించారు. అసలు షర్మిల తన అన్న జగన్‌కు రాసిన లేఖ చంద్రబాబుకు ఎలా చేరిందని సూటిగా ప్రశ్నించిన విజయసాయిరెడ్డి, (Vijayasai Reddy) అది ఇద్దరూ కుమ్మక్కు కావడం వల్లనే కాదా? అని నిలదీశారు. టీడీపీ కూటమి, ఆయన అనుకూల ఎల్లో మీడియా అదేపనిగా జగన్‌ను వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేస్తుంటే, కుట్రలో భాగంగా షర్మిల ప్రేక్షకపాత్ర పోషించడం శోచనీయమన్నారు.

రిటర్న్‌ గిఫ్ట్‌గా జైలుకు పంపే కుట్రనా!
తండ్రి మరణం తర్వాత 10 ఏళ్లకు జగన్, తన చెల్లిపై ప్రేమతో స్వార్జిత ఆస్తిలో 40 శాతం ఇస్తూ జగన్‌ 2019, ఆగస్టులో ఎంఓయూ చేస్తే.. అయిదేళ్ల తర్వాత చంద్రబాబు డైరెక్షన్‌ మేరకు కుట్రపూరితంగా, ఆ షేర్లు బదిలీ చేసుకుని, జగన్‌ బెయిల్‌ రద్దు చేయించాలని చూశారని విజయసాయిరెడ్డి తెలిపారు. అన్న ప్రేమతో ఆస్తి రాస్తే, చెల్లి ఆ రకంగా రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని గుర్తు చేశారు.

ఈడీ అటాచ్‌ చేసిన ఆస్తులపై హైకోర్టు కూడా స్టేటస్‌కో ఇచ్చిన నేపథ్యంలో, ఆ ఆస్తులకు సంబంధించిన షేర్లను బదిలీ చేస్తే, అది కోర్టు ధిక్కారం అవుతుందన్న ఇద్దరు రిటైర్డ్‌ సుప్రీంకోర్టు జడ్జిల ఒపీనియన్‌ మేరకు, కేసులు తేలిన తర్వాత ఆ షేర్లు షర్మిలకు బదలాయించేలా ఎంఓయూలో కండిషన్‌ పెట్టారని చెప్పారు. అయితే ఆ షేర్‌ సర్టిఫికెట్స్‌ మిస్‌ అయ్యాయంటూ, జగన్‌ సంతకాలు కూడా లేకుండా, ఎవరికీ తెలియకుండా, గిఫ్ట్‌ డీడ్స్‌ కూడా లేకుండా, దొంగ సంతకాలతో షర్మిల ఆ షేర్స్‌ బదిలీ చేసుకునే ప్రయత్నం చేశారని వెల్లడించారు.

కేసులు తేలక ముందే షేర్ల బదిలీ జరిగితే, జగన్‌ బెయిల్‌ రద్దయ్యే ప్రమాదం ఉందన్న విషయం తెలిసినా, షర్మిల ఆ పని చేశారంటే, జగన్‌ తిరిగి సీఎం కాకూడదన్న లక్ష్యంతోనే, చంద్రబాబుతో కలిసి కుట్ర చేసినట్లు తేలిందని చెప్పారు.

ఇవీ కూతురుకు వైయస్‌ ఇచ్చిన ఆస్తులు
వైయస్సార్‌ బతికి ఉన్నప్పుడే ఆస్తులు పంచారని, ఆ మేరకు షర్మిలకు ఈ ఆస్తులు దక్కాయంటూ, ఆ వివరాలు వెల్లడించారు. విజయలక్ష్మి మినరల్స్, కోడూర్‌ మిల్స్, కోడూరు ఆఫీస్‌ ప్రాపర్టీ, బెరైటీస్‌ మినరల్స్‌ స్టాక్స్, సరస్వతి పవర్‌ 22.5 మెగావాట్స్, ఎస్‌ఆర్‌ఎస్‌ హైడ్రో 10 మెగావాట్ల ప్రాజెక్టు, ఇడుపులపాయలో 51 ఎకరాలు, సెట్టుగుంట ల్యాండ్స్‌ 79 ఎకరాలు, పులివెందులలో 7.6 ఎకరాలు, హైదరాబాద్‌ బంజరాహిల్స్‌ రోడ్‌ నెం.2లో 280 గజాల ఇల్లు, విజయవాడలో రాజ్, యువరాజ్‌ థియేటర్లు.

మరి నష్టాలు, అప్పులు పంచుకున్నారా?
ఇవన్నీ షర్మిలకు దక్కినా.. జగన్‌ తన స్వార్జితంలో 40 శాతం రాసిచ్చిన విషయాన్ని మరోసారి ప్రస్తావించిన విజయసాయిరెడ్డి.. జగన్‌ తన వాటాగా వచ్చిన ఆస్తులను, వ్యాపారాలను దక్షతతో అభివృద్ధి చేశారని చెప్పారు. భారతి సిమెంట్స్‌ కోసం రూ.1400 కోట్ల రుణం తీసుకుని, ఆ తర్వాత తీర్చేశారని, తొలి కొన్నేళ్లలో సాక్షి మీడియాలో ఏటా రూ.20 కోట్ల నష్టం వచ్చిందన ఆయన, ఆ నష్టాలు, అప్పులను ఏనాడైనా షర్మిల పంచుకున్నారా? అని ప్రశ్నించారు. జగన్‌ స్వార్జిత ఆస్తుల్లో తనకూ హక్కు ఉందని షర్మిల చెబుతున్నారంటే, వైయస్‌ ఆమెకిచ్చిన ఆస్తిలో కూడా జగన్‌కు వాటా ఉంటుందన్న విషయాన్ని ఆమె గ్రహిస్తే మంచిదన్నారు.

జగన్‌ అతి మంచితనం వల్లే అనర్థాలు
పెళ్లైన 25ఏళ్ల తర్వాత, తండ్రి చనిపోయాక 10 ఏళ్లకు చెల్లికి తన స్వార్జితంలో 40 శాతం వాటా రాసివ్వడమే కాకుండా, గత 10 ఏళ్లలో రూ.200 కోట్లు ఆమెకు ఇవ్వడం దేశంలో ఎక్కడైనా చూశామా? ఇంత వరకు ఆ పని ఎవరైనా చేశారా? అని విజయసాయిరెడ్డి ప్రస్తావించారు.
అన్నకు ద్రోహం చేసిన సోదరిగా షర్మిల చరిత్రలో మిగిలిపోతుందన్నారు. జగన్‌ అతి మంచితనం వల్లనే షర్మిలకు స్వార్జిత ఆస్తిలో వాటాలు ఇచ్చి ఈ అనర్థాలును కొని తెచ్చుకున్నారనేది నిర్వివాద అంశమని స్పష్టం చేశారు.

షర్మిల వల్లే చర్చలు కొలిక్కి రాలేదు
ఈ తగాదా పరిష్కారం కోసం చర్చలు జరిగాయన్న ఆయన, షర్మిల గొంతెమ్మ కోరికల వల్లనే అవి కొలిక్కి రాలేదని చెప్పారు. తాను చెప్పేది వాస్తవమని, ఈ విషయాలన్నీ షర్మిలకు కూడా తెలుసని చెప్పారు. ‘సరస్వతి పవర్‌కు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం చంద్రబాబును కలిస్తే.. జగన్‌ను ఈ రకంగా ఇబ్బంది పెడితేనే తాను ఆ పని చేస్తానని చంద్రబాబు చెప్పారని’.. షర్మిల స్వయంగా ఆ చర్చల సందర్భంగా తెలిపారని విజయసాయిరెడ్డి వెల్లడించారు.

ఎన్నింటినైనా ఎదుర్కొంటాం
ఇప్పటికైనా షర్మిల ఆత్మ పరిశీలన చేసుకుని, చంద్రబాబును వీడాలని విజయసాయిరెడ్డి హితవు పలికారు. చంద్రబాబు మానవజన్మకు అనర్హుడు.. అత్యంత దుర్మార్గుడు అనే విషయాన్ని గ్రహించాలని ఆమెకు సూచించారు. వీటన్నింటి నేపథ్యంలో చంద్రబాబు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. మళ్లీ అరెస్ట్‌ చేసినా భయపడేది లేదని ఆయన తేల్చి చెప్పారు.

ఇవీ చదవండి: Jagan and Sharmila: కుటుంబ తగాదాలు రాజకీయం చేయొద్దు
YS Sharmila: షర్మిల కంట తడి.. అన్నపై హాట్ కామెంట్స్.. దౌర్భాగ్యుడు, శాడిస్ట్ అంటూ… పూర్తి ప్రసంగం ఇదీ
Sharmila: కరెంటు చార్జీల భారం ఉపసంహరించుకోవాలి
CBN on Jagan Family issue: జగన్ ఫ్యామిలీ ఇష్యూపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Jagan in Gurla: ఘర్ ఘర్ కీ కహానీలే.. ఆస్తుల వివాదంపై జగన్ హాట్ కామెంట్స్!

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading