HomeAndhra PradeshYS Jagan: మరో మూడు నెలల్లోనే చంద్రబాబు.... వైయస్ జగన్ కీలక వ్యాఖ్యలు

YS Jagan: మరో మూడు నెలల్లోనే చంద్రబాబు…. వైయస్ జగన్ కీలక వ్యాఖ్యలు

YS Jagan: ఏపీలో కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికపై కొన్ని రోజులుగా బిజీగా పార్టీ శ్రేణులు, నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్న జగన్.. ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు.

మరో మూడు నెలల్లోనే చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబికి.. కూటమి పార్టీల నేతలు రోడ్లపై తిరిగే పరిస్థితి ఉండబోదని జగన్ హెచ్చరించారు.

’’ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరుగుతున్న అన్యాయం మీద మనమంతా ఏకమై ఎప్పుడైతే యుద్దం చేయడం ప్రారంభించామో, ఎప్పుడైతే వైయస్సార్సీపీ కేడర్‌ బలంగా కనిపించిందో చంద్రబాబు వెన్నులో భయం ప్రారంభమైంది. తాను కూడా పోటీ నుంచి విరమించుకున్నట్టు ప్రకటన చేయడం జరిగింది.

గత ఎన్నికలు ఎలా జరిగాయో ప్రజాప్రతినిధులుగా మీరంతా చూసే ఉంటారు. ఎన్నికల్లో ఈ మాదిరిగా ఎందుకు ఫలితాలు వచ్చాయంటే.. కారణం పది శాతం ఓటర్లు చంద్రబాబు చెబుతున్న అబద్ధాలకు అటువైపు మొగ్గు చూపారు. ఎన్నికల ప్రచారంలో అబద్ధపు హామీలతో మోసపూరితమైన ప్రచారం చేశారు. చంద్రబాబు చెప్పిన అబద్ధాలకు ఇప్పుడు అంతా మోసపోయిన పరిస్థితుల్లో ఉన్నారు.

ఇప్పడు ప్రతి ఇంట్లోనూ జగన్‌ ఉండి ఉంటే.. అన్నదానిపై చర్చ జరుగుతోంది. జగన్‌ పలావు పెట్టాడు. చంద్రబాబు బిర్యానీ పెడతానని ఆశ చూపాడని అంటున్నారు. చివరకు పలావు పోయింది. బిర్యానీ పోయిందనే చర్చ ఇప్పుడు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక పథకాలు రాకపోగా, వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో ఓపీ దగ్గర కుర్చీలు కూడా తీసేస్తున్న పరిస్థితి ఉంది.

ఇవాళ ఏ సమస్య లేకపోయినా చంద్రబాబు ఎన్నో సమస్యలున్నట్టు చిత్రీకరిస్తున్నాడు. కానీ, నిజానికి ఆనాడు మనం అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్నో సమస్యలు. ఒకవైపు చంద్రబాబు చేసిన అప్పులు. ఆ అప్పులు మీద వడ్డీలు. వాటికి తోడు కోవిడ్‌ అనే మహమ్మూరి కూడా మన పరిపాలన కాలంలో తాండవిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అటువంటి భయానక పరిస్థితుల్లో ఉన్నా.. మరోవైపు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గినా.. రాష్ట్రంలో పెట్టే ఖర్చు అనూహ్యంగా పెరిగినా మనం ఎలాంటి సాకులు చూపలేదు. ఎటుంటి కారణాలు చెప్పలేదు. శ్వేతపత్రాలు అని చెప్పడమో.. గత ప్రభుత్వాల మీద నిందలు మోపడమో చేసి.. ప్రజలకు చేయాల్సినంది చేయకుండా పోయే కారణాలు ఎప్పుడూ చూపించ లేదు.

ఎన్ని కష్టాలున్నా చిక్కటి చిరునవ్వుతో ప్రతి ఇంటికి మంచి చేస్తూ.. ఈ నెలలో ఈ కార్యక్రమం చేస్తామని.. గతంలోఎప్పుడూ జరగని విధంగా బడ్జెట్లో ఒక కేలెండర్‌ విడుదల చేసి బటన్‌ నొక్కి, ప్రతి ఇంటికీ నేరుగా డోర్‌ డెలివరీ చేసిన చరిత్ర మన ప్రభుత్వానిది. ఇలా గతంలో ఎప్పుడూ జరగలేదు. దేవుని దయతో ఇవన్నీ చేయగలిగాం. అందుకే ఈరోజు నిజంగా చెబుతున్నాను. ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి సగర్వంగా తలెత్తుకుని పోగలుగుతాడు. అక్కా, అన్నా మా ప్రభుత్వంలో ఇది చెప్పాం.. చెప్పింది తూచా తప్పకుండా ప్రతి ఒక్కటీ అమలు చేశామని చెప్పగలుగుతాం.

అదే రెండున్నర నెలల చంద్రబాబు పాలన చూశాం. రెండున్నర నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఇంత వేగంగా పుట్టడం మొట్టమొదటసారిగా చూస్తున్నాం. ఇవాళ ప్రతి ఇంట్లోనూ కూడా ప్రజలందరూ అనుకుంటున్నారు.

అదే జగన్‌ ఉండి ఉంటే
ఇవాళ ప్రతి ఇంట్లోనూ జగనే ఉండి ఉంటే అన్న చర్చ జరుగుతోంది. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉండి ఉంటే.. ప్రతి తల్లికి అమ్మఒడి వచ్చేది. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వమే ఉండి ఉంటేం ప్రతి రైతన్న వ్యవసాయ పనుల్లో ముమ్మరంగా నిమగ్నం అయి ఉన్నాడు. ఆ ప్రతి రైతుకు రైతుభరోసా సొమ్ము వచ్చి ఉండేది. రైతులకు 2023–24 ఖరీఫ్‌కు సంబంధించి ఇన్సూరెన్స్‌ సొమ్ము కూడా వచ్చి ఉండేది.

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉండి ఉంటే ఇప్పటికే పిల్లలకు ప్రతి మూడు నెలలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద తల్లుల ఖాతాల్లో డబ్బులు పడేవి. ప్రతి త్రైమాసికం అయిపోయిన తర్వాత ఇచ్చే పరిస్థితులు గతంలో ఉంటే.. ఇప్పుడు రెండు త్రైమాసికాలు అయిపోయినా డబ్బులు ఇవ్వలేదు. వసతి దీవెన కూడా ఇవ్వలేదు.

పొదుపు సంఘంలోని ప్రతి అక్కచెల్లెమ్మకు మామూలుగా ఏప్రిల్లో సున్నావడ్డీ డబ్బులు జమ అయ్యేవి. అవి కూడా పడలేదు.నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా లేదు. వాహనమిత్ర కూడా లేదు. ఎక్కడా ఎవ్వరూ అడగాల్సిన అవసరం లేకుండా సాఫీగా అన్నీ జమ అయ్యే పరిస్థితి నుంచి ఇవాళం ఒక్కరికీ ఒక మేలు జరగకపోగా.. అన్నీ దారుణాలే జరుగుతున్నాయి.

విద్యా రంగంలో టోఫెల్‌ అనే సబ్జెక్టు పీరియడ్‌గా ఉండేది .దాన్ని ఎత్తేశారు. ఇంగ్లిషు మీడియం, రోజుకొక మెనూతో గోరుముద్ద ద్వారా చిన్న పిల్లలకు పెట్టే బోజనం ప్రశ్నార్ధకం అయింది. డిసెంబరులో పిల్లలకిచ్చే ట్యాబులు పరిస్థితి ప్రశ్నార్ధకం అయింది. ఆరోగ్య రంగానికి సంబంధించి చూస్తే ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.1800 కోట్లు దాటాయి. మార్చిలో ఎన్నికల కోడ్‌ నేపధ్యంలో ఆరోగ్యశ్రీకి సంబంధించి జనవరి నుంచి ఉన్న రూ.1800 కోట్ల బకాయిలు ఆపేశారు. ఇవాల్టికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.

వ్యవసాయంలో రైతులు మరలా విత్తనాల కోసం క్యూలైన్లో నిల్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రీ ఇన్సూరెన్స్‌ పోయింది. ఇ–క్రాప్‌ పోయింది. ఉచిత పంటల బీమాను కూడా పక్కన పెట్టేశారు. గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు అవ్వాతాతల పెన్షన్‌ నుంచి, బియ్యం వరకు ప్రతి పథకం డోర్‌ డెలివరీ జరిగేది. ఇప్పుడు అంతా పోయింది. తెలుగుదేశం పార్టీ నాయకులు చుట్టూ.. జన్మభూమి కమిటీలంటూ నాయకులు ఎక్కడున్నారని వాళ్ల దగ్గరకు ప్రజలు వెళ్లాల్సిన దుస్దితిలో ఇవాళ పాలన సాగుతోంది. పరిపాలన ఏమైందో తెలియదు.

రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ అయితే పూర్తిగా అధ్వాన్నం. రెడ్‌బుక్‌ పాలన సాగుతోంది. గ్రామస్ధాయిలో కక్షలను ప్రోత్సహించకూడదన్నది పక్కన పెట్టి.. గ్రామస్ధాయిలోనే వాటిని ప్రోత్సహిస్తూ మీరు చేసుకొండి.. పోలీసులను మేం చూసుకుంటాం అని రెడ్‌ బుక్‌ పాలన సాగిస్తున్నారు. దిశ యాప్‌ ఏమైందో కూడా అర్దం కావడం లేదు. ఇవన్నీ కేవలం రెండున్నర నెలల్లోనే మన కళ్లెదుటే కనిపిస్తున్న మార్పులు.

ఎక్కడా అబద్దాలు, మోసాలు లేకుండా ప్రజలకు మనం మంచి చేశాం. జగన్‌ పలావు పెట్టినా కూడా చంద్రబాబు బిర్యానీ పెడతాను అని చెప్పాడు. మోసం చేస్తున్నాడు. మరి చంద్రబాబు ఏ మంచి పనీ చేయనప్పుడు, ఇచ్చిన ఏ మాట నెరవేర్చనప్పుడు ప్రజలు తాము మోసపోయామన్న భావవ నుంచి కోపం పుడుతుంది. అప్పుడు చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి.

అదే మనకు శ్రీరామరక్ష
ఈ ఐదేళ్లలో కష్టాలు ఉంటాయి. కష్టాలు లేకుండా సృష్టే ఉండదు. చీకటి వచ్చిన తర్వాత మరలా పగలు రాక తప్పదు. కష్టాలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే.. 16 నెలలు నన్నే జైల్లో పెట్టారు. ఇవి తప్పవు. కష్టాలు వచ్చినప్పుడు మన వ్యక్తిత్యమే మనకు శ్రీరామరక్షగా నిలబడుతుంది.

నిజానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చంద్రబాబు అందరికీ కాల్స్‌ చేసి.. అది ఇస్తా, ఇది ఇస్తా ఆశ చూపే ఉంటాడు. కానీ ధర్మం, న్యాయం గెలిచింది. మీరు ఒక్కటిగా నిలబడ్డారు కాబట్టి చంద్రబాబు మెడలు వంచక తప్పలేదు. సంఖ్యా బలం లేనప్పుడు పోటీ పెడతాననడమే తప్పు. అలా చేయడం తన నైజం. ఆ మనిషి అలా చేసినా కూడా వైయస్సార్సీపీ నాయకులు అందరూ ఒకే తాటిమీద విలువలు, విశ్వసనీయతతో నిలబడ్డం వల్లే ఆ మనిషి తలవంచక తప్పలేదు.’’ అని జగన్ కామెంట్ చేశారు.

ఇవీ చదవండి: YS Sharmila Reddy: అన్నపై షర్మిల మరోసారి ఆక్రందన.. విలీనం, జగన్ మళ్లీ రాడంటూ…
YS Jagan: ఢిల్లీలో ధర్నాపై వైయస్సార్‌సీపీ సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు
YS Jagan in Nellore: దాడులు ఆపాలి.. చంద్రబాబుకు వైయస్ జగన్ హెచ్చరిక
Reddy Community: సొంత సామాజికవర్గమే జగన్‌ను ముంచేసిందా? అంత వ్యతిరేకతకు కారణాలేంటి?
YS Jagan: అసెంబ్లీలో ఓ మూలన జగన్.. మళ్లీ సున్నా నుంచి మొదలు….?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు