YS Jagan: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నేతల భేటీలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో (Andhra Pradesh) జరుగుతున్న దాడులు, హింసాత్మక ఘటనలపై ఢిల్లీలో (Delhi) ఈనెల 24వ తేదీన శాంతియుత ధర్నాకు (YSRCP Dharna) పిలుపునిచ్చిన నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నాయకులంతా పాల్గొనాలని సూచించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న దారుణకాండను యావత్ దేశం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అందుకే ఢిల్లీ ధర్నా కార్యక్రమానికి అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నామని, రాష్ట్రంలో గత 45 రోజులుగా ఏం జరుగుతుందో వారికి వివరిస్తామన్నారు. ఈ పోరాటంలో మాతో వచ్చే అన్ని పార్టీలను సమన్వయం చేసుకుంటామన్నారు.
’’ఢిల్లీలో ధర్నా తర్వాత, పార్టీ ఎంపీలు తమ సభలకు హాజరవ్వాలి. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, దాడులు, ఆస్తుల విధ్వంసంపై గట్టిగా మాట్లాడాలి. ఇక్కడ కూటమి ప్రభుత్వం కక్షతో చేస్తున్న దురాగతాలను పార్టీ ఎంపీలంతా.. తమ సభల్లో సభ్యులందరి దృష్టికి తీసుకెళ్లాలి. ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, (PM Modi) కేంద్ర హోం మంత్రి (Amit Shah) అపాయింట్‌మెంట్లు కోరాము. అవి రాగానే.. వారికీ ఇక్కడి పరిస్థితిని వివరిస్తాం. ఢిల్లీలో ధర్నా, నిరసన కార్యక్రమానికి సంబంధించి ఒక్కో ఎంపీకి, ఒక్కో బాధ్యత. వారంతా వెంటనే ఢిల్లీ వెళ్లి, ధర్నా కార్యక్రమంపై నిమగ్నం కావాలి.
ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు ప్రజల్లో మరింత ఆగ్రహానికి దారి తీస్తున్నాయి. అందుకే మనం రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాలి.అలా చంద్రబాబుకు (Chandrababu) గట్టిగా హెచ్చరికలు పంపాలి. పోరాటం చేయకపోతే దారుణాలకు అడ్డుకట్ట పడదు. అసెంబ్లీ సమావేశాల్లోనూ నిరసన వ్యక్తం చేస్తాం. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే సమయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. రాష్ట్రంలో దారుణాలు, అరాచకాలు, ఇక్కడ జరుగుతున్న ఘటనలపై అందరూ గళమెత్తాల్సిన అవసరం ఉంది.
రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఘటనలు ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదు. అవి ప్రజాస్వామ్య మనుగడకు పెద్ద దెబ్బగా భావించాలి.
అందుకే అన్ని పార్టీలకూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరించాలి. ఎందుకంటే, రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్న పరిస్థితులు ప్రజాస్వామ్యానికి మంచివి కావు.
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందింది. వైయస్సార్‌సీపీ (YCP) నాయకులు, కార్యకర్తల మీద దారుణంగా దాడులు జరగుతున్నాయి. వినుకొండ హత్య ఇందులో పరాకాష్ట. ఆ హత్య వీడియో దృశ్యాలు.. రాష్ట్రంలో దారుణ శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ప్రజలందరూ చూస్తుండగా, నడిరోడ్డు మీద కత్తితో నరికి చంపిన తీరు అత్యంత అత్యంత అమానుషం. తమ రాజకీయ ప్రత్యర్థులకు, వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు ఒక మెసేజ్ పంపడానికి చేసిన ప్రయత్నం ఇది.
వక్రీకరణకు యత్నం
వినుకొండలో దారుణహత్యకు గురైన పార్టీ కార్యకర్త రషీద్ ఒక వైన్‌షాపులో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. ఆ రాజకీయ హత్య ఘటనను వక్రీకరించడానికి ఎల్లోమీడియా సహాయంతో ప్రభుత్వం నానా ప్రయత్నాలు చేస్తోంది. ఏదో బైక్ కాల్చిన ఘటనకు, ఇప్పుడు జరిగిన దారుణహత్యకు ముడి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరవాత, ఈ 45 రోజుల్లో 36 మంది రాజకీయ హత్యలకు గురయ్యారు. 300కు పైగా హత్యాయత్నాలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ వారి వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 560 చోట్ల ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. ఇళ్లల్లోకి చొరపడుతున్నారు. ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. షాపులను కాల్చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులకు చెందిన చీనీ చెట్లు నరికేస్తున్నారు. మొత్తం 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు. ఇవి కాక 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయి. హత్యలు, దాడులు చేయడానికి టీడీపీ వాళ్లకి లైసెన్స్ ఇచ్చినట్టుగా ఉంది.
రషీద్ హంతకుడైన జిలానీ, లోకేష్ పుట్టినరోజున, స్థానిక ఎమ్మెల్యే భార్యకు స్వయంగా కేక్ తినిపించిన ఫొటోలను.. రషీద్ తల్లిదండ్రులు చూపారు. ఇంకాస్థానిక ఎమ్మెల్యేతో హంతకుడి ఫొటోలను కూడా వారు చూపించారు. మరోవైపు తన సొంత పార్లమెంటు నియోజకవర్గంలో, తన తండ్రి ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలోనే ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడులు చేశారు. కావాలనే అక్కడ టీడీపీ మనుషులు ఉండేలా, పోలీసులతో ప్లాన్ చేసి మరీ దాడులు చేశారు.
రాష్ట్రంలో 15 సంవత్సరాలుగా వైయస్సార్‌సీపీ ప్రస్థానంలో ఉంది. చంద్రబాబు ఆశించినట్టుగా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆయన అణగదొక్కలేరు. ఎవరు అధికారంలో ఉన్నా ఇలాంటి దాడులు మంచివి కావు. అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలో లేని పార్టీ మీద దాడులు చేయడం అనేది ధర్మమా? ఇక ప్రజాస్వామ్యానికి విలువ ఏముంటుంది?
ప్రభుత్వాలు చేసే మంచి పనుల ఆధారంగా ఆ పార్టీ పరిస్థితులు ఉంటాయి.
గత ఎన్నికల్లో మనం 86 శాతం సీట్లను గెలిచాం. అయినా ఇలాంటి ఘటనలు జరగలేదు. వైయస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఓటు వేయని వారికి కూడా ఇంటింటికీ వెళ్లి పథకాలు ఇచ్చాం. దాడులను ఎప్పుడూ ప్రోత్సహించలేదు. ప్రజలందరినీ సమానంగా చూశాం, అందరికీ పారదర్శకంగా సేవలు అందించాం.’’ అని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
Read also: CBN vs YS Jagan: తగ్గేదే లేదు.. ఏపీలో హై వోల్టేజ్ రాజకీయం!
YS Jagan in Nellore: దాడులు ఆపాలి.. చంద్రబాబుకు వైయస్ జగన్ హెచ్చరిక
YS Jagan: అసెంబ్లీలో ఓ మూలన జగన్.. మళ్లీ సున్నా నుంచి మొదలు….?
Prannoy Roy Interview with YS Jagan: వైయస్ జగన్‌తో ప్రణయ్ రాయ్ ఇంటర్వ్యూ.. అభివృద్ధి, మద్యం పాలసీపై క్లారిటీ!
YS Jagan in Kaikaluru: చంద్రబాబు ప్రలోభాలకు మోసపోకండి: కైకలూరులో సీఎం జగన్
