HomeAndhra PradeshCBN vs YS Jagan: తగ్గేదే లేదు.. ఏపీలో హై వోల్టేజ్ రాజకీయం!

CBN vs YS Jagan: తగ్గేదే లేదు.. ఏపీలో హై వోల్టేజ్ రాజకీయం!

CBN vs YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈ ఎన్నికల తర్వాత మరో మలుపు తిరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా అగ్రెసివ్ పాలిటిక్స్ ను ప్రజలు చూస్తున్నారు. దానికి కారణం.. ఎన్నికలు అయ్యాక ఏపీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలే. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తుల ధ్వంసం, ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై దాడులు, హింస, విగ్రహాల కూల్చివేతలు.. ఒకటేమిటి.. అధికార పక్షానికి అడ్డే లేదంటే అతిశయోక్తి కాదేమో.

ఈ ప్రభుత్వంలో అధికారులు చెప్పిన మాట వినకపోతే 1995 నాటి చంద్రబాబును చూస్తారు.. అప్పట్లో నేను సీఎంగా ఉండగా హైదరాబాద్ నుంచి బయల్దేరితే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ అయ్యేది.. ఇప్పుడు అధికారులు తప్పు చేస్తే మళ్లీ పాత బాబును చూస్తారు…
– ఇవీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు

చంద్రబాబు తీసుకొచ్చిన తప్పుడు సంప్రదాయం.. ఒక బీజంలా నేడు నాటుకుంది. అది రేపు చెట్టవుతుంది. రేప్పొద్దున గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలు, నాయకులు కూడా ఇలాంటి పరిస్థితులనే చూడాల్సి వస్తుంది. దాడులు చేయడం ఆపాలని కోరడం కాదు.. హెచ్చరిస్తున్నా. యాక్షన్ కు రియాక్షన్ ఉంటుంది.
– నెల్లూరులో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ నేటి కామెంట్స్

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం తర్వాత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 4వ సారి ముఖ్యమంత్రి అయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి అప్పుడే నెల రోజులు కావస్తోంది. ఈ క్రమంలో గతంలో జగన్ సర్కార్ చేతిలో బాధితులైన వారంతా ఇప్పుడు అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఎక్కడికక్కడ హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఈ విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోవడం లేదన్నది ప్రతిపక్షం ఆరోపణ.

అధికారం చేతులు మారిన నేపథ్యంలో దాడులు, హింసాత్మక ఘటనలు జరగడం కొత్తేమీకాదు. ఏ ప్రభుత్వం మారినా ఇది జరగక మానదు. తరతరాలుగా ఇది జరుగుతూనే ఉంది. కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా రెండు వర్గాలుగా విడిపోవడంతో ఇలాంటి ఘటనలు ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి.

చంద్రబాబు మార్క్ మళ్లీ చూస్తామా?
ముఖ్యమంత్రిగా చంద్రబాబు 4వ సారి 74 ఏళ్ల వయసులో ప్రమాణ స్వీకారం చేశారు. నాలుగు దశాబ్దాలుగా ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో అధికారంలో, విపక్షంలో తనదైన పాత్ర పోషించారు. ఎవరి రాజకీయం స్టైల్ వారికి ఉన్నా, అవకాశాలను అందిపుచ్చుకుని రాజకీయాలు చేయడంలో ఆయన దిట్ట. ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాక పాలనలో ఎలాంటి మార్పులు తెచ్చారు? ఉమ్మడి రాష్ట్రంలో సీఈవో అన్నట్లుగా ఆయన పాలన ఎలా సాగిందన్నది ఇప్పుడు అందరి మదిలో మెదులుతోంది.

సాఫ్ట్ వేర్, ఐటీ, టెక్నాలజీ లాంటి విషయాల్లో చంద్రబాబు ఎలాంటి చొరవ తీసుకుని అభివృద్ధి పథాన నడిపించారో ఇప్పుడు తలచుకుంటున్నారు. దీనికి కారణం.. ఇటీవల 1995 నాటి చంద్రబాబును చూస్తారంటూ ఆయన చేసిన కామెంట్సే. రెండోసారి సీఎం అయ్యాక చంద్రబాబు మార్క్ పాలన నడిచింది. అప్పటిదాకా ఉన్న సంస్కరణల్లో మార్పులు, కాంగ్రెస్ పాత విధానాలు కాకుండా తనదైన శైలిలో ఆయన గవర్నెన్స్ నడిపించారు. దానికి మీడియా తోడైంది. హైదరాబాద్ నగరాన్ని తానే నిర్మించానని, ఐటీని పరిచయం చేసింది తానేనని చంద్రబాబు చాలా సార్లు చెప్పుకుంటారు. హైటెక్ రాజకీయాలు, అభివృద్ధికి మళ్లీ కేరాఫ్ గా అమరావతిని నిలబెడతారా? మాట వినని అధికారులపై ఆయన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? పాత బాబును మళ్లీ చూస్తామా? వేచి చూడాల్సిందే మరి.

వింటేజ్ జగన్ మళ్లీ వచ్చేశాడు
మరోవైపు జగన్.. ఈరోజే మీడియా ముందు మాట్లాడుతూ కేడర్ లో కొత్త జోష్ తెప్పించారు. 2011లో పార్టీ పెట్టింది మొదలు.. ఆయన పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కాంగ్రెస్ ను వీడిన వెంటనే అధిష్టానం ఆయనపై తీసుకున్న కఠిన చర్యలు, దేశంలోనే అతిపెద్ద వ్యవస్థలను ప్రయోగించి ఆస్తులు సీజ్ చేయడం, ఆయన్ను టార్గెట్ చేసి 16 నెలల పాటు జైల్లో బంధించి బెయిల్ రాకుండా చేసిన ఉదంతాలు రాష్ట్ర ప్రజలు కళ్లారా చూశారు. అయినా తగ్గకుండా ఓదార్పు యాత్ర, అనంతరం ప్రజల్లో కలిసి ఉద్యమాలు చేసిన చరిత్ర జగన్ ది. అప్పట్లో జగన్ దేశంలో ఎవరికీ తలవంచని వీరత్వం ప్రదర్శించారు.

ఆ హీరోయిజాన్ని రాష్ట్రంలో చాలా మంది ఇప్పటికీ అభిమానిస్తారు. 2014 ఎన్నికల్లో కేవలం 67 సీట్లకే పరిమితమైనా సరే.. మళ్లీ అదే ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్లి, 3648 కిలోమీటర్ల మేర సుదీర్ఘ పాదయాత్ర చేసి 2019 ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 151 సీట్లతో ముఖ్యమంత్రి అయ్యారు జగన్. మళ్లీ ఇప్పుడు కేవలం 11 సీట్లకే పరిమితమైన పరిస్థితి. ఇప్పుడు అదే అగ్రెసివ్ నెస్ తో జగన్ దూసుకెళ్తారా? అధికార పార్టీపై అంతే స్థాయిలో విరుచుకుపడతారా? అంటే తాజాగా ఇవాళ జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు అవుననే సమాధానం ఇచ్చాయి.

సీఎం చంద్రబాబును ఉద్దేశించి… రాష్ట్రంలో దాడులు ఆపాలని, తాము అధికారంలోకి వచ్చాక మళ్లీ ఇవే రిపీటవుతాయని హెచ్చరించారు. దాడులు ఆపాలని కోరడం కాదు.. హెచ్చరిస్తున్నానని జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నెల రోజులుగా స్తబ్ధుగా ఉన్న కేడర్ లో ఇప్పుడు జోష్ పెంచేలా చేశారు. అధినేత స్వయంగా ధైర్యం ఇచ్చి తిరగబడండి అనే సంకేతాలు ఇవ్వడంతో ఇప్పుడు యాక్షన్ కు రియాక్షన్ అంటున్నాయి వైసీపీ శ్రేణులు. ప్రభుత్వంపై జగన్ పోరాటంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో, ఎదుర్కొన్నా ఈసారి పాత జగన్ మాదిరిగా, అంతే అగ్రెసివ్ గా దూకుడు ప్రదర్శిస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.

Read also: YS Jagan in Nellore: దాడులు ఆపాలి.. చంద్రబాబుకు వైయస్ జగన్ హెచ్చరిక
Arunachalam: అరుణాచలం టూర్ ప్యాకేజీ.. పూర్తి వివరాలు ఇవీ..
Pawan Kalyan: పవన్‌.. ఏపీ రాజకీయాల్లో తుఫాన్ కావడానికి కారణాలేంటి?
Deputy CM Pawan Kalyan: కొత్త రక్తం.. నవ్య పథం.. గతితప్పిన రాజకీయాల్ని ప్రక్షాళన చేస్తాడా?
YS Jagan: అసెంబ్లీలో ఓ మూలన జగన్.. మళ్లీ సున్నా నుంచి మొదలు….?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు