HomeAndhra PradeshKancha Ilaiah: ఏపీలో చదువుల విప్లవం మరో ఐదేళ్లు కొనసాగాలి.. జగన్‌ రాజకీయాలను మార్చేశారు: కంచ...

Kancha Ilaiah: ఏపీలో చదువుల విప్లవం మరో ఐదేళ్లు కొనసాగాలి.. జగన్‌ రాజకీయాలను మార్చేశారు: కంచ ఐలయ్య

Kancha Ilaiah: ఏపీలో చదువుల విప్లవం, ఇప్పుడు కొనసాగుతున్న అభవృద్ధి మరో ఐదేళ్లు ఇలాగే జరగాల్సిన అవసరం ఉందని ప్రముఖ సామాజికవేత్త కం ఐలయ్య వ్యాఖ్యానించారు. ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానల్‌ (ఈహా టీవీ)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక విషయాలు పంచుకున్నారు. ఇంగ్లీషు మీడియం కొనసాగాల్సిన ఆవశ్యకతను, జగన్‌ తెచ్చిన రాజకీయ సంస్కరణలను కంచ ఐలయ్య వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే..

“అందరికీ సమానంగా ఇంగ్లీష్‌ మీడియం చదువులు… ఇదో విప్లవం. ఇది కేవలం ఏపీలోనే విప్లవం కాదు. ఇది ఇండియాకే ఆదర్శం. ఇదో కొత్త తరహా మోడల్‌. ఇది ఓ 10–15 ఏళ్లు ఇలాగే కొనసాగితే… మన పిల్లలు ప్రపంచస్థాయిలో పోటీపడగలుగుతారు. విద్యా వ్యవస్థను ప్రైవేటీకరణ నుంచి తీసుకొస్తే తప్ప దేశంలో ఉన్న కుల అసమానతల నిర్మూలనకు సమాధానం దొరకదు.

జగన్‌.. వెంకయ్యనాయుడు, జస్టిస్‌ రమణ, చంద్రబాబు… వ్యతిరేకించారు. అయినా జగన్‌ వెనక్కు పోకుండా పట్టుదలగా ముందుకు వెళ్లారు.ఇంగ్లీష్‌ మీడియం చదువును మేనిఫెస్టోలో పెడితే ఓట్లు వస్తాయన్న గ్యారంటీ లేదు. అంతకుముందు ఎవరూ ఈ ప్రయోగం చేసింది లేదు. కానీ జగన్‌ విద్యను నేను ఆస్తిగా ఇస్తాను అని ఎన్నికల్లో చెప్పి, ధైర్యంగా చేసి చూపించారు.

ఇంగ్లీష్‌ మీడియంకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం వచ్చి మరో 5 ఏళ్లు ఉంటే బాగుంటుంది. ప్రభుత్వ బడుల్లో నాడు – నేడు కింద మౌలిక వసతులు ఇంతలా అభివృద్ధి చేసిన ప్రభుత్వం దేశంలో లేదు. ఢిల్లీ ప్రభుత్వం కొద్దిగా చేసింది గానీ… వాళ్లు ఇంగ్లీష్‌ మీడియం, అమ్మ ఒడి లాంటి పథకాలతో నిరుపేదలు, కూలీల ఖాతాల్లో నేరుగా డబ్బులు వేయడం… ఇలాంటివి ఢిల్లీలో లేదు.

మీ పిల్లలు చదువుకునే ఇంగ్లీషు నాగలి దున్నుకునేవాళ్లకు, చెట్లు కొట్టుకునే వాళ్లకు, క్షవరం చేసే వాళ్లకు, కుండలు చేసుకునే వాళ్లకు ఇవ్వొద్దా? బట్టలు ఉతుక్కునే వాళ్లకు, బుట్టలు చేసుకునే వారికి, అడవుల్లో ఉన్న ఆదివాసీలకు ఇవ్వొద్దా? ప్రజాస్వామ్యం ఇంత అన్యాయంగా, ఇంత గుడ్డిగా ఉందా?

జగన్‌ సరికొత్త అభివృద్ధి విధానాన్ని తీసుకొచ్చారు. ఇంతకుముందు వరకు అభివృద్ధి విధానం అంటే.. పట్టణ ప్రాంతాల్లో జరిగే అభివృద్ధి మాత్రమే. అక్కడ రోడ్లు, భవనాల నిర్మాణం.. ఇలా చేయడం. వీటివల్ల అంతిమంగా ఆర్థికంగా లబ్ధిపొందేది కాంట్రాక్టర్లు. కానీ జగన్‌ అలా కాదు… ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చారు. మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు.. ఇలాంటివి నిర్మించారు. వీటి కాంట్రాక్టులను గ్రామ కమిటీలు వేసి, వారికి కాంట్రాక్టులు ఇచ్చారు.

ఈ అభివృద్ధి విధానంలో నిరుపేద మహిళల ఖాతాల్లోకి డబ్బులు వేసినప్పుడు ఆ డబ్బును వాళ్లు ఆ నెలల్లోనో, మరుసటి నెలలోనో ఖర్చు చేస్తారు. అది మార్కెట్లోకి వచ్చి.. ఫలితంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమయింది. పిల్లల చదువుల కోసం అమ్మ ఒడి కింద ప్రభుత్వం రూ.15వేలు ఇస్తోంది. విద్యాకానుక కింద యూనిఫాం, బుక్స్‌ అన్నీ ఇస్తున్నారు. మధ్యాహ్న భోజనం పెడుతున్నారు.

అంటే ఈ 15వేలు వాళ్లు స్వతంత్రంగా ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇక ఉన్నత చదువుల విషయానికొస్తే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నారు. మార్కెట్‌ వైబ్రేషన్‌ మాల్స్‌ నుంచి గ్రామాల్లోని షాపులకు మారింది. కరోనా సమయంలో కూడా జగన్‌ ప్రభుత్వ బడుల మీద పెట్టుబడి ఆపలేదు. నగదు బదిలీ పథకాలు ఆపలేదు. పిల్లలు బడికి పోనప్పుడు ఆహారాన్ని డ్రై రేషన్‌ కింద ఇంటికే పంపించారు.

వైద్యరంగంలో మౌలిక సదుపాయాలను గ్రామీణ ప్రాంతాలకు తీసుకొచ్చారు. డాక్టర్లు ఇప్పుడు గ్రామాలకు వస్తున్నారు. చైనాలో సోషలిస్టు పాలన సమయంలో బేర్‌ఫుట్‌ డాక్టర్లు ఉండేవారు. గ్రామాల్లో చాలా రోగాలను వాళ్లే నయం చేసేసేవారు. ఇప్పుడు జగన్‌ కూడా అలాంటి మోడల్‌నే తీసుకొచ్చారు. దాన్ని టెలీమెడిసిన్‌కు అనుసంధానం చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా చేయలేదు. అందువల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ఇబ్బందీ రాలేదు.

అదే చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే… ఆ 30వేల ఎకరాల్లోనే బంగ్లాలు కట్టేవారు. భూములిచ్చిన రైతులకు సిటీని డెవలప్‌ చేసి 250 గజాలు ఇస్తామని చెప్పారు. అదో బిజినెస్‌ మోడల్‌. కానీ అది కట్టడానికి ఎంత సమయం పడుతుంది? 30–40–50 ఏళ్లపాటు సిటీ కడుతుంటే… ఈ భూములిచ్చిన రైతులు ఏమైపోతారు? అప్పటివరకూ కేవలం ఎకరానికి రూ.50వేలు పంట నష్టం కింద ఇస్తారట. నిజానికి ఇప్పుడు జగన్‌ కూడా ఆ మొత్తం ఇస్తున్నారు.

చంద్రబాబు వస్తే ప్రభుత్వ స్కూళ్లను పట్టించుకునేవారు కాదు. ఆరోగ్య రంగాన్ని పట్టించుకునేవారు కాదు. ఆయన ధ్యాస.. మొత్తం 30వేల ఎకరాల భూమిలో సిటీ డెవలప్‌మెంట్‌ మీదే, భూములిచ్చిన ఆ రైతులను అసంతృప్తికి గురికాకుండా చూసుకోవడం మీదే ఉండేది. రాజధాని పేరుతో 30వేల ఎకరాల్లో సిటీ కడితే అది అభివృద్ధి కాదు. 15–20 గ్రామాలకు మాత్రమే లబ్ధి. జగన్‌ చేసిందేంటంటే… సరికొత్త విధానం తీసుకొచ్చారు. అది రూరలైజేషన్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌. గతంలో అందరూ చేసింది కేంద్రీకృత అభివృద్ధి. అది డబ్బున్న వాళ్ల అభివృద్ధికే ఉపయోగపడింది.

కానీ జగన్‌ 5 ఏళ్లలో రూ.2.70 లక్షల కోట్లలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద మహిళల ఖాతాల్లోకి పోయింది. మహిళలు దుబారా చేయరు. వాళ్లు తమ పిల్లల చదువుల కోసం జగన్‌ ఇచ్చిన డబ్బును జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. జగన్‌ పాలనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైంది. అక్కడనే కొనుగోళ్లు నడుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ విధానం వల్ల… ఆంధ్రప్రదేశ్‌లో జరిగినంత రీసైక్లింగ్‌ ఆఫ్‌ ఎకానమీ దేశంలో మరే రాష్ట్రంలోనూ జరగలేదు.

పరిశ్రమలు ఏపీలో ఎప్పుడూ లేవు. చంద్రబాబు రాజధాని కడతానన్నా ఎవ్వరూ వచ్చి పరిశ్రమలు పెట్టరు. ఎందుకంటే అర్బన్‌ వైబ్రంట్‌ సిటీ లేదు. జగన్‌ అందుకే, వైజాగ్‌ను మరింత అభివృద్ధి చేసి, పెట్టుబడులు ఆకర్షించాలని అనుకున్నారు. అక్కడ ఆల్రెడీ పోర్టు ఉంది. ఎయిర్‌పోర్టు ఉంది. రైల్‌ కనెక్టివిటీ ఉంది. విశాల కోస్తా తీరం ఉంది.

ఎక్కడో పులివెందులలో పుట్టిన సీఎం జగన్‌… ఓ పది ఆఫీసులు కట్టి, ఊరుకుంటే ఎవ్వరూ అడగరు. ఉమ్మడి రాష్ట్రంలో సెక్రెటేరియట్‌ మొత్తం 15 ఎకరాలు కూడా లేదు. మరి, చంద్రబాబు 30వేల ఎకరాలు తీసుకుని ఏం రాజధాని కడతారు? రాజధానికి అంత అవసరం లేదు. జగన్‌ మోడల్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌లో 3 విప్లవాత్మక విషయాలు ఉన్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టడం వల్ల… నిపుణులైన విద్యార్థులు లక్షల్లో వస్తారు. ఒక్క జాబ్‌కు అన్ని అర్హతలూ ఉన్న పిల్లలు వందలాది మంది ఉంటారు. అదే అంతకుముందు… ఇంగ్లీష్‌ మీడియం చదివినవాళ్లే ఆ ఉద్యోగాలు ఎగరేసుకుపోయేవారు. 2019 ముందు వరకూ ప్రైవేటు స్కూళ్లను ప్రోత్సహించారు. అపార్టుమెంట్లలో.. సూర్యుణ్ని చూడనివ్వకుండా బట్టీ చదువులు చదివే ఆ పిల్లలకు ఆటలు ఉండవు. అలాంటి పిల్లలు 45 ఏళ్లకే అన్ని అనారోగ్యాలపాలయ్యేవారు.

జగన్‌ ఈ విధానాన్ని మార్చారు. ఓపెన్‌ స్కూల్‌ విధానం తీసుకొచ్చారు. విద్య ప్రైవేటీకరణ నుంచి బయటకు రావడం అన్నది ఏపీలో జరిగినంతగా దేశంలో మరే రాష్ట్రంలోనూ జరగలేదు. ఇంగ్లీష్‌ నేర్చుకునేవాళ్లకు తెలుగు రాదు అనేది మోసపూరిత వాదన. ఇంగ్లీష్‌ ప్రపంచ భాష.

గతంలో ఎప్పుడైనా.. దేశంలో ఎక్కడైనా… ఏ రాష్ట్రంలోనైనా.. ప్రధానమంత్రులుగానీ., ముఖ్యమంత్రులుగానీ నిర్వహించే బహిరంగ సభల్లో ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలు ఇంగ్లీష్‌లో మాట్లాడటం మనం ఇంతకుముందు చూశామా? అది కేవలం ఏపీలో వైయస్‌ జగన్‌ ఒక్కరే చేయిస్తున్నారు. అందుకు కారణం… ఆ పిల్లల్లో ఎక్కడలేని ఆత్మ విశ్వాసం ఉండటమే. అంటే… వాళ్లకు తెలుగూ, ఇంగ్లీషూ రెండూ రావనీ, తెలుగు భాషను మర్చిపోతారని… ఇలా అందరూ చేసిన ఆరోపణలన్నీ తప్పు అని నిరూపించారు జగన్‌.

ఒక యువకుడు.. తండ్రి చనిపోయిన తర్వాత సొంత పార్టీ పెట్టుకున్న వ్యక్తి.. జగన్‌ ప్రతి 15 రోజులకోసారి విద్యారంగంపై సమీక్ష నిర్వహించేవారు. అలాగే ప్రతి 15 రోజులకోసారి వైద్య రంగంపై సమీక్ష నిర్వహించేవారు. రాయలసీమలో డోన్‌లో ఓ ప్రభుత్వ పాఠశాల… అమెరికాలోని స్కూళ్లకంటే బాగుంది. జగన్‌ ప్రభుత్వంలో విద్యావంతులైన మంత్రులు ఉన్నారు. వైద్యశాఖ మంత్రి విడదల రజని… అద్భుతమైన ఇంగ్లీష్‌ మాట్లాడుతుంది. ఆదిమూలపు సురేష్‌ ఇంగ్లీష్‌ అద్భుతంగా మాట్లాడతారు. ఇవాళ చంద్రబాబు లక్షల కోట్లు అప్పులు చేశారు అని చెప్తున్నారు.

ఆంధ్రా బెస్ట్‌ మోడల్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ను కొందరు ఇంటలెక్చువల్‌ అనుకునే వారు కూడా బ్లేమింగ్‌ చేస్తున్నారు. నారాయణ, శ్రీచైతన్య, విద్వాన్, భాష్యం లాంటి ప్రయివేటు విద్యాసంస్థలను ప్రోత్సహించి స్కూల్‌ ఎడ్యుకేషన్‌ను ప్రయివేటైజేషన్‌ చేసింది చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం పెట్టాలని చంద్రబాబు నాయుడు వద్దకు కొందరు స్టూడెంట్స్‌ను 1998లో పంపితే, మా పార్టీ పేరే తెలుగుదేశం.. ఇంగ్లీషు మీడియం ఎలా పెడతాం అన్నాడు.

నారాయణ, శ్రీచైతన్య, విద్వాన్‌ లాంటి ప్రయివేటు స్కూళ్లలో చదివి వచ్చిన వారు ఒక్కరన్నా మేధావి అయ్యారా? పబ్లిక్‌ ఇంటలెక్చువల్‌ ఉన్నారా? అలాంటి ప్రయివేటు స్కూళ్లలో స్పోర్ట్స్‌ లేవు, ప్రాపర్‌ ఫుడ్‌ లేవు, 4 గంటలకు లేపి సిలబస్‌ మగ్‌ అప్‌ చేయిస్తారు. పేపర్‌ లీకేజీలు, ఈ దందా అంతా చంద్రబాబు నాయుడు ఇంట్రడ్యూస్‌ చేయించాడు. ప్రయివేటు కంపెనీలు పేపర్లు కొనేయడం, ఎంసెట్‌ తదితర ర్యాంకులు తేవడం చేశారు.

జగన్‌ తీసుకొచ్చిన మొదటి విప్లవం ఎడ్యుకేషన్‌ అయితే, రెండో విప్లవం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే నగదు బదిలీ చేయడం. దేశంలో ఏ సీఎం కూడా ఇలా చేయలేదు. మూడోది.. జగన్‌ సోషల్‌ జస్టిస్‌. ఎక్కడా జరగని విధంగా జరిగింది. మంత్రుల్లో 50 శాతం ఇచ్చారు. 4 ఉప ముఖ్యమంత్రులు ఇచ్చారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా అక్కలు, నా చెల్లెళ్లు అని మాట్లాడుతూ.. ఆయన చేసిన అనూహ్యమైన మార్పు విజయవాడ నడిబొడ్డులో కట్టిన అంబేద్కర్‌ విగ్రహం. ఇలాంటి మ్యూజియం ప్రపంచంలో ఏ విప్లవకారుడికీ లేదు. మార్టిన్‌ లూథర్‌ కింగ్, నెల్సన్‌ మండేలా లాంటి వారికి కూడా ఇలాంటి మ్యూజియం, వాతావరణం లేవు.

ఆ మ్యూజియంలోకి ఒకసారి వెళ్తే.. 5–6 గంటలు తిండి తినకుండా మై మర్చిపోయి అంబేద్కర్‌ జీవితాన్ని చదువుతారు. అంత క్లాసికల్‌ మ్యూజియం, అంత బ్యూటిఫుల్‌ స్టాచూ, వెనుక ఓ ఆడిటోరియం కడుతున్నారు. దాన్ని అందుకే అంబేద్కర్‌కు గుడి కట్టారు అనొచ్చు. అయోధ్యలో రామునికి గుడి కడితే జగన్‌ ఇక్కడ అంబేద్కర్‌కు గుడి కట్టాడు. అదే ఒక వేళ అక్కడ ఏ బీజేపీ ముఖ్యమంత్రో ఉంటే కడతాడా? చంద్రబాబు నాయుడు అయితే అలాంటిది కడతాడా?

జగన్‌ ఒక శూద్రుడు. ఒక యంగ్‌ ఎనర్జిటిక్‌. ఆయనకు తాను రెడ్డి అనే అహంకారం తన జీవిత ప్రాక్టీస్‌లో కనపడదు. మొన్న బస్సు యాత్రలో ఒకతను కుష్టువ్యాధి రోగి.. డాక్టర్లు కూడా పట్టుకునేందుకు భయపడే మనుషిని ఆయన రాగానే జగన్‌ ఆప్యాయతతో రెండు చేతులూ పట్టుకుని తలకాయ దగ్గర ముఖం పెట్టాడు. ద్వేషించుకున్నట్లు, ఇబ్బంది పడుతున్నట్లు ఎక్కడా కనిపించలేదు. చాలా ఆప్యాయత కనిపించింది.

చంద్రబాబు నాయుడు కూడా తిరుగుతున్నాడు కదా.. ఒక్కసారి అయినా ఎవరైనా ముసలమ్మను ప్రేమతో గౌరవంగా పట్టుకున్నాడా? పిల్లలు కనపడితే చాలు జగన్‌ ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటున్నాడు. మానవత్వం కనిపించడం లేదా? జగన్‌ పొలిటికల్‌ కల్చర్‌ను మార్చేశాడు. ప్రేమతో మనుషులను తన దగ్గరికి తీసుకుంటున్నాడు. జగన్‌ వద్దకు లక్షలాది మంది పోతుంటే కూడా జగన్‌ దందా చేశాడు, మోసం చేశాడంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో రోజూ అబద్ధాలు రాస్తే జనం నమ్ముతారా? పోయిన సారి కూడా ఇలాగే చేశారు. ఆయనకు 151 వచ్చిన తర్వాత ఏం చేశారు? నోరు మూసుకుని కూర్చున్నారు.

రేప్పొద్దున జగన్‌ గెలుస్తాడు. సైకో సైకో అంటూ ప్రజా పాలన చేసిన ముఖ్యమంత్రిని పట్టుకుని రాస్తున్నారంటే వాళ్లకు అసలు మానవత్వం ఉందా? చంద్రబాబు నాయుడు సొంత పార్టీ పెట్టుకుని గెలవలేదు. జగన్‌ను చనిపోయిన రాజశేఖరరెడ్డి వచ్చి సీఎం చేయలేదు. పార్టీ తను పెట్టుకున్నాడు. ప్రజల్లో తిరిగాడు. జైలుకు పోయాడు. పార్టీ నిర్మించాడు.

తెలంగాణ ఎందుకు డివైడ్‌ అయ్యింది? జగనే అధికారంలోకి వస్తాడని ఆనాడు కాంగ్రెస్‌ అంచనా కూడా. మమ్మల్ని ధిక్కరించి జగన్‌ మొత్తం ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించబోతున్నాడు. దీనికి పరిష్కారం.. డివైడ్‌ చేసి తెలంగాణను అయినా రక్షించుకోవాలని కాంగ్రెస్‌ ఇలా చేసింది. 42 ఎంపీ సీట్లు జగన్‌ గెలుస్తాడని అప్పట్లో రిపోర్టులు ఉన్నాయి.

జగన్‌ పార్టీ నిర్మించి మొదటి సారి 67 సీట్లు సాధించాడు. రెండో సారి జగన్‌కు 151 సీట్లు వచ్చాయి. గత చరిత్ర అయినా గమనించాలి కదా? అలాంటి వ్యక్తిని పట్టుకుని సైకో అంటూ పేపర్లలో రాస్తున్నారు. కులాభిమానం, కులం చేతుల్లో నుంచి పవర్‌ పోతుందనే భయం, మనోడికి వస్తుందో లేదో భయంతో నేరుగా పవర్‌ను తీసుకుని పోయి జగన్‌ చేతుల్లో పెడుతున్నారు. దేవునికంటే గొప్పోడివని స్కూలుకు వెళ్లే చిన్న పిల్లలు పాటలు పాడుకున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా?

ప్రజలకు కోపం తెప్పించే భాష టీవీ స్టూడియోల్లో, పేపర్లలో రాసుకోవడం చేస్తే ప్రజాస్వామ్యంలో అలాంటి వారిని దిక్కు లేకుండా ఓడించి పంపుతారు ప్రజలు. నా దృష్టిలో జగన్‌ 90 శాతం గెలుస్తాడు ఈసారి. ఎందుకంటే మాస్‌ విలేజర్స్, మహిళలు, యువతను చూస్తే మనకు అర్థం అవుతుంది.” అని కంచ ఐలయ్య వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి: Kancha ilaiah: జగన్‌మోహన్‌రెడ్డి ఓడితే ఆయనకు నష్టం లేదు.. నష్టపోయేది పేదలే.. కంచె ఐలయ్య ప్రసంగం తప్పక చదవాల్సిందే..
YS Jagan Assets: ఎన్నికల అఫిడవిట్‌లో సీఎం జగన్‌ ఆస్తుల వివరాలు
Memantha Siddham: మూడు వారాలుగా జనం మధ్యలోనే జగన్‌.. పండుగలు కూడా బస్సు యాత్రలోనే!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు