Chandrababu Alliance: రాజకీయ జీవితమంతా పొత్తులు, జిత్తులు, కుయుక్తులు.. ఇదీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చరిత్ర. ఆయన జీవితంలో పొత్తు లేకుండా పోటీ చేసిన దాఖలాలు లేవు. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, జనసేన.. ఇలా ఏ పార్టీనీ వదలకుండా అంటకాగుతూ వస్తున్నారు. స్వార్థం కోసం పొత్తులు పెట్టుకోవడం, అధికారం చేతబట్టి స్వలాభం చూసుకొని ఆయా పార్టీలతో విబేధించడం.. తర్వాత ఎన్నికలు రాగానే మళ్లీ జతకట్టడం.. ఇదీ చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు. తిట్టిన పార్టీ జెండా పట్టనిదే ఆయనకు నిద్రపట్టదు. పొత్తులేకుండా పోటీకి సాహసించలేరు. ఇప్పటి వరకు ఆయన పెట్టుకున్న పొత్తులు, తిట్టిన నోటితోనే పొగుడుతూ జరిగిన ప్రయాణాలపై ఈ కథనంలో ఓ లుక్కేయండి. (Chandrababu Alliance)
1999 సార్వత్రిక ఎన్నికలకు ముందు అటల్ బిహారీ వాజ్‌పేయీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంతో పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో బీజేపీ సపోర్ట్‌తోనే ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ గట్టెక్కింది. ఆ ఎన్నికల్లో టీడీపీకి 180 సీట్లు రావడానికి కారణం వాజ్‌పేయీ చరిష్మానే.
2004 అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్సార్ దెబ్బకు టీడీపీ కకావికలమైంది. అప్పటికే అధికారంలో ఉండి అనేక దారుణాలు చేసిన తర్వాత.. ఎన్డీఏ భాగస్వామిగా రంగంలోకి దిగాడు చంద్రబాబు. అయితే, వైయస్సార్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను కళ్లారా చూసి వారికి నమ్మకం కలిగించారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం 47 సీట్లకే పరిమితమైంది. వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్ 185 సీట్లతో తిరుగులేని మెజార్టీ లభించింది.
2009లో మహాకూటమి నాటకం..
2009 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు మహా కూటమి పేరిట కొత్త నాటకానికి తెర తీశాడు. టీఆర్‌ఎస్, కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికల్లో పోటీ దిగాడు. కానీ చంద్రబాబు వేషాలను ప్రజలు అసహ్యించుకుని టీడీపీని ఓడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని 294 నియోజకవర్గాల్లో తెలుగుదేశం 222 స్థానల్లో పోటీకి దిగి, 92 సీట్లే సాధించగలిగింది. డాక్టర్ వైయస్సార్ రెండోసారి దిగ్విజయంగా అధికారం చేపట్టారు. వైయస్సార్ ప్రభుత్వం 294 స్థానాల్లో పోటీ చేసి, 156 స్థానాల్లో గెలిచి సత్తా చాటింది.
2014 ఎన్నికల్లో ఎన్డీఏతో పొత్తు కోసం ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసిన చంద్రబాబు.. చివరకు వారిని ఒప్పించి ఎన్నికలకు సిద్ధమయ్యాడు. 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు బీజేపీ-మోదీ-అమిత్ షా హవా కలిసొచ్చింది. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా వీరిలో భాగంకావడం బాబుకు కలిసొచ్చింది. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ 160 స్థానాల్లో పోటీ చేస్తే, 102 సీట్లలో నెగ్గింది.
2019లో జగన్ హవాతో టీడీపీ కకావికలు
2019లో సైకిల్ కకావికలమైంది. ఈ ఎన్నికల ముంగిట బీజేపీని, ప్రధాని మోదీని, అమిత్ షాను, పవన్ కల్యాణ్‌ను తిట్టిన చంద్రబాబు.. సింగిల్‌గా సైకిల్ గుర్తుతో పోటీకి దిగాడు. చరిత్రలో కనీవినీ ఎరుగని చెత్త పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. 175 స్థానాల్లో పోటీ చేసి కేవలం 23 స్థానాలకు టీడీపీ పరిమితమైంది. వైయస్సార్‌సీపీ అద్భుత విజయంతో 151 స్థానాల్లో గెలిచి రికార్డు సృష్టించింది. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా పవన్ కల్యాణ్ ఘోర ఓటమిని చవిచూశాడు. దొడ్డిదారిన మంత్రి అయిన లోకేష్ కూడా మంగళగిరిలో ఓడిపోయాడు.
ఇప్పుడూ అవే పొత్తులు రిపీటు..
2024లో మళ్లీ పొత్తు నాటకాలతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రజల్ని మోసం చేయడానికి వస్తున్నారు. పవన్ కల్యాణ్.. ఓవైపు బీజేపీతో పొత్తులో ఉంటూనే టీడీపీతో కలిసి ఎన్నికలకు వస్తామని ప్రకటించాడు. చంద్రబాబు అవినీతి కేసులో జైలుపాలు కావడంతో పవన్ తెరపైకి వచ్చి అప్పుడప్పుడూ ఏపీలో పర్యటిస్తున్నారు. ఇప్పుడు కూడా బీజేపీతో పొత్తు పంచుకోవడానికి బాబు తహతహలాడుతున్నారు. తాజాగా ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు చంద్రబాబు. ఏపీలో పొత్తు గురించే ప్రధాన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. బీజేపీ, టీడీపీ, జనసేన అలయన్స్ కలిసి ఈసారి జగన్‌ను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. అయితే, సంక్షేమ విప్లవం సృష్టించిన జగన్‌ను ఓడించడం అంత తేలిక కాదనే విశ్లేషణలు వస్తున్నాయి.
ఢిల్లీని ఢీకొట్టి సీఎం అయిన జగన్
రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీ.. వైయస్సార్ మరణానంతరం వైయస్ జగన్‌ను తీవ్రంగా అవమానాలకు గురి చేసింది. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి కేసులను ఎదుర్కొని అన్యాయంగా 16నెలలు జైలుపాలు చేసినా వెరవక ఢిల్లీని ఢీకొట్టి, ప్రజా సంకల్ప పాదయాత్రతో జనానికి దగ్గరయ్యారు. దాని ఫలితమే 2019లో 151 సీట్లతో చరిత్ర సృష్టించారు. పొత్తులు, జిత్తులు, నక్క జిత్తులను తాను నమ్ముకోలేదని, తాను నమ్ముకున్నది పైన దేవుడిని, కింద ప్రజలను మాత్రమేనని ప్రతి సభలోనూ వైయస్ జగన్ చెబుతుంటారు. ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించి 99 శాతం హామీలు నెరవేర్చిన చరిత్ర చూపిస్తూ ఏ పార్టీ అండదండలు, పొత్తులు అవసరం లేదని స్పష్టీకరిస్తున్నారు సీఎం జగన్. అందుకే ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.
ఇదీ చదవండి: Jagan on CBN Chandramukhi: చంద్రముఖి బెడద శాశ్వతంగా మీకు ఉండదు.. బాబుపై జగన్ పంచ్‌లు అదుర్స్..
