Rajyasabha Elections AP: రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది సభ్యుల ఎన్నికకు షెడ్యూల్ వచ్చింది. వచ్చే నెల ఫిబ్రవరి 8వ తేదీన నోటిఫికేషన్ రానుంది. ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3, తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఏపీలో రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా కొనసాగనున్నాయి. టీడీపీకి బలం లేకపోయినా వైయస్సార్‌సీపీ సభ్యులు తమతో టచ్‌లో ఉన్నారంటూ ఆ పార్టీ అధిష్టానం కామెంట్స్ చేస్తుండడం.. అధికార పార్టీలో గుబులు పుట్టిస్తోంది. మరోవైపు అనర్హత వ్యవహారం తెరపైకి వచ్చింది. (Rajyasabha Elections AP)
ఏపీలో ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియనుంది. వారిలో టీడీపీ నుంచి ఎన్నికై బీజేపీలోకి జంప్ అయిన సి.ఎం.రమేష్, టీడీపీ నుంచి ఎన్నికైన కనకమేడల రవీంద్రకుమార్, వైయస్సార్‌సీపీ నుంచి ఎన్నికైన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. ఇక తెలంగాణ నుంచి వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య, జోగినపల్లి సంతోష్ పదవీకాలం పూర్తవుతోంది. (Rajyasabha Elections AP)
ఏపీలో మూడు స్థానాలు ఖాళీ అవడంతో రాజ్యసభ సభ్యత్వంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు హై అలర్ట్ అయ్యాయి. ఒక రాజ్యసభ సభ్యుడిని ఎన్నుకోవాలంటే 44 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. అయితే, ఏపీలో విపక్షానికి అధికారికంగా 23 మంది ఎమ్మెల్యేల బలమే ఉంది. కానీ అందులో వల్లభనేని వంశీ, మద్దాళి గిరిధర్, కరణం బలరామకృష్ణమూర్తి, వాసుపల్లి గణేష్ రెబెల్స్‌గా మారారు. అధికార పార్టీ వైయస్సార్‌సీపీకి మద్దతు ఇచ్చారు. మరోవైపు వైయస్సార్‌సీపీలో ప్రస్తుతం సీట్ల సర్దుబాటు కారణంగా పలువురికి టికెట్లు నిరాకరిస్తోంది అధిష్టానం. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ భంగపాటుకు గురైంది వైయస్సార్‌సీపీ. ఆ పార్టీ నుంచి ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి రెబెల్స్ అయ్యారు.
వైయస్సార్ సీపీలో టెన్షన్ టెన్షన్..
1. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి,
2. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి,
3. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి,
4. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి,
5. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి.. వీళ్లంతా అధికార పార్టీకి దూరమయ్యారు.
ఇంకా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం అసంతృప్తిగా ఉన్నారు. ఇంకా కొందరు ఎమ్మెల్యేలు వైయస్సార్‌సీపీని ధిక్కరించే అవకాశాలు లేకపోలేదు.
టీడీపీకి సపోర్ట్ చేస్తున్న వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు నలుగురిపై స్పీకర్ అనర్హత వేటు వేస్తే టీడీపీ సపోర్టింగ్ బలం 19కి తగ్గుతుంది. అయితే, వైయస్సార్‌సీపీకి సపోర్ట్ చేస్తున్న నలుగురు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలపై కూడా అనర్హత వేటు వేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఎటు లెక్కేసుకున్నా టీడీపీకి రాజ్యసభ సీటు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అయితే, తమతో 50 మందికిపైగా వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఒక సీటు తప్పకుండా చేజిక్కించుకుంటామని టీడీపీ చెబుతోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్బంగా అనుసరించిన వ్యూహాన్ని రిపీట్ చేస్తామని టీడీపీ జోస్యం చెబుతోంది. ఇవాళ నలుగురు వైసీపీ రెబల్స్, మరో నలుగురు టీడీపీ రెబల్స్ అనర్హత పిటిషన్లు స్పీకర్ ముందుకు వచ్చాయి. ఒక సీటు గెలవాలంటే దాదాపు 44 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది. వైసీపీ నుంచి రాజ్యసభ బరిలో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాస్ రావు, వైవీ సుబ్బారెడ్డి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, అసంతృప్త ఎమ్మెల్యేల వ్యవహారం వైసీపీని టెన్షన్ పెడుతోంది.
ఇంచార్జ్ ల మార్పు ప్రభావం పడకుంగా అధిష్టానం జాగ్రత్తలు వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల చేదు అనుభవం రిపీట్ కాకుండా వ్యూహం పన్నుతున్నారట. గంటాపై వేటు వేయడం ద్వారా టీడీపీకి ఒక సీటు తగ్గిందన్న లెక్కల్లో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికల్లోనూ వైసీపీకి ఝలక్ ఇస్తామంటూ టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక స్థానానికి వర్లరామయ్య, కోనేరు సురేష్ పేరును టీడీపీ పరిశీలిస్తోందని చెబుతున్నారు. వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేల మద్దతుతో ఒక సీటు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది.
రాజ్యసభలో టీడీపీ అడ్రస్ గల్లంతు!
రాజ్యసభ ఎన్నికల్లో 3 స్థానాలనూ వైయస్సార్‌సీపీ దక్కించుకొనే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 132 మంది ఎమ్మెల్యేల బలం ఉంటే చాలు.. మూడు స్థానాలు లాంఛనంగా దక్కించుకోవచ్చు. కానీ వైయస్సార్‌సీపీ అధికారిక లెక్క 151. నలుగురు రెబెల్స్ తీసేసినా, టీడీపీలో నలుగురు రెబల్స్ లెక్క సరిపోతుంది. గంటాపై ఆల్‌రెడీ అనర్హత వేటు పడింది. సాధారణ ఎన్నికలకు ముందే రాజ్యసభలో టీడీపీ అడ్రస్ గల్లంతు అయ్యే అవకాశాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. టీడీపీకి చివరికి రాజ్యసభలో ఉనికే లేకుండా పోనుంది. సంఖ్యా బలాన్ని బట్టి ఈ మూడూ వైఎసార్‌సీపీ ఖాతాలోకే పడనున్నాయి. 41 ఏళ్లలో టీడీపీకి రాజ్యసభలో సభ్యత్వం లేకుండాపోవడం ఇదే తొలిసారి.
ఇదీ చదవండి: YS Jagan Bheemili: దేవుడి దయతో ప్రజలే అండగా ఒంటరి పోరాటానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా..!

[…] ఇదీ చదవండి: Rajyasabha Elections AP: అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఏపీ… […]