AP Govt Serious on CHO’s: తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న సీహెచ్‌వోలపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. వారి డిమాండ్లు సహేతుకం కాదని స్పష్టం చేసింది. సామాజిక ఆరోగ్యాధికారులు (CHOs/MLHPs) వెంటనే తమ ఆందోళనను విరమించుకుని ప్రజారోగ్య పరిరక్షణ విధుల్లో చేరాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు సూచించారు. గ్రామీణ ప్రజలకు అవసరమైన వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం 2019 నుంచి సీహెచ్‌వోల నియామకాలను చేపట్టిందని ఆయన వివరించారు. (AP Govt Serious on CHO’s)
2019లో 697 మంది, 2020-22లో 4,519 మంది, 2022-23లో 4816 మంది సిహెచ్వోలు నియమితులయ్యారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి 5 వేల జనాభాకు ఒక ఆరోగ్య ఉపకేంద్రం ఉండాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో దాదాపు 2500-3000 మంది జనాభాకు ఒకటి వంతున డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ లను మంజూరు చేసిందని వివరించారు. ఈ క్లినిక్ లలో నియమితులైన సిహెచ్వోలను కాంట్రాక్ట్ పద్ధతిలో ఒక ఏడాది కాంట్రాక్ట్ పై నియమితులయ్యారనీ, వారి పనితీరు అంచనా ఆధారంగా ఆ కాంట్రాక్ట్ ను పునరుద్ధరించటం జరుగుతుందన్నారు.
వీరికి నెలకు రు.25,000 వంతున వేతనంతో పాటు రు.15000 ప్రోత్సాహకాన్ని (మొత్తం నెలకు రు.40,000) వంతున వారి పనితీరు ఆధారంగా అందజేయటం జరుగుతోందని వివరించారు. నియామక సందర్భంలో వీరు ప్రభుత్వంతో కుదుర్చుకున్న వార్షిక ఒప్పంద షరతుల ప్రకారం విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, ఎటువంటి అశక్తత కారణంగా విధులు నిర్వహించలేకపోయినా జిల్లా ఆరోగ్య సమాఖ్య (District Health Society), వారి వేతనాలను నిలుపు చేయటంతో పాటు విధుల నుండి తొలగించే అధికారం కలిగి వుంటుందన్న అంశం అత్యంత ప్రధానమైనదని ఆయన గుర్తు చేశారు.
సీహెచ్‌వోల పనితీరు అంచనా వేసే కమిటీ వారి పనితీరు ఆధారంగా అదనపు ప్రోత్సాహకాన్ని అందిస్తుందన్నారు. వారు తమకు నిర్దేశించిన విధంగా ప్రధాన కేంద్రంలో అందుబాటులో ఉండి పాముకాటు, వడదెబ్బ వంటి అత్యవసర సేవలను అందించాలని ఇందుకు అదనంగా వారికి కాంట్రాక్ట్ ప్రోత్సాహకంతో పాటు మరో 30 శాతం (రు.4,500) అందించాలని నిర్ణయించిందని, ఈ ప్రకారమే ఇప్పుడు వేతన చెల్లింపులు కొనసాగుతున్నాయని వివరించారు. కాగా, సిహెచ్ఓలు ఇప్పుడు Andhra Pradesh MLHP/CHO Association (APMCA) 372/2021 అన్న పేరుతో కొన్ని డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారని, ఇందులో తమ వేతన శ్రేణిని రు.25,000 మూల వేతనం(రూ.15000 ఇన్సెంటివ్) నుంచి రు.35,000లు మూల వేతనం (మరియు రూ.5000 ఇన్సెంటివ్) గా ఇవ్వాలని, వార్షిక ఇంక్రిమెంట్ అందజేయాలని, ఏడాదికి 35 రోజులు సెలవులు మంజూరు చేయాలని, తమ విధులకు అవసరమైన మార్గదర్శకసూత్రాలను జారీ చేయాలని, సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని కోరారన్నారు.
దశలవారీ ఆందోళన కార్యక్రమాలను కూడా పేర్కొన్నారన్నారు. నవంబర్ 20, 21 తేదీలలో అందరు డిఎంహెచ్ఓలు, వైద్యాధికారులకు నోటీసులు అందచేయటం, 22వ తేదీ పెండింగ్ క్లియరెన్స్ లపై కమిషనర్ కు మెయిల్ పంపటం, 23వ తేదీ నుండి సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ ఇ -సంజీవని కాల్స్ ను నిలిపివేయటం, 24వ తేదీ నుండి ఆన్ లైన్లో నీటి నాణ్యతా పరీక్షలను నిలిపివేయటం, 27 వ తేదీ నుండి ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ సెంటర్(ABHWC) పోర్టల్ లో రోజువారి నివేదికల అప్డేషన్ నిలిపివేయటం, 28 వ తేదీ నుండి ఎంఎల్ హెచ్చ్ పి లో మందుల జారీ వివరాల నమోదు నిలిపివేత, 30వ తేదీ నుండి అధికారిక వాట్సప్, టెలిగ్రామ్ గ్రూపుల నుండి నిష్క్రమణ, డిసెంబర్ 1వ తేదీ నుండి ABHWC యాప్ లో నివేదికల నమోదు నిలిపివేత, 2వ తేదీ నుంచి హెల్త్ మేళా ఎంట్రీల నిలిపివేత, 4వ తేదీ నుండి వేతన బకాయిలు, అద్దెల చెల్లింపులు, విద్యుత్ బకాయిల కోసం కలెక్టర్ల స్పందన కార్యక్రమం ద్వారా వినతి పత్రాల అందచేత, 8వ తేదీన అన్ని డిఎంహెచ్ఓ కార్యలయాల ముందు శాంతియుత నిరసన ప్రదర్శనలు, 12వ తేదీన కమీషనర్ కు సామూహిక వినతిపత్రం అందచేత, 13వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా వంటి కార్యక్రమాల్ని చేపట్టేందుకు నిర్ణయించారన్నారు.
దీనిపై నేషనల్ హెల్త్ మిషన్ ఎండీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ 10-10-2023, 23-11-2023 తేదీలలో APMCA ప్రతినిధులతో సమావేశమై చర్చించారని తెలిపారు. ఈ కార్యక్రమం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో కొనసాగిస్తున్నందున ఇందులో ఉద్యోగాల రెగ్యులరైజేషన్ ప్రశ్నే తలెత్తదని కమీషనర్ వారికి స్పష్టం చేశారని, అలాగే వారికి చెల్లిస్తున్న వేతనాలు, అన్ని రాష్ట్రాల కన్నా అధిక మొత్తంలోనే వున్నాయన్న విషయాన్ని వివరించారని తెలిపారు. మన రాష్ట్రంలో రు.40,000 చెల్లిస్తుండగా, కర్నాటకలో రు.30,000, తెలంగాణాలో రు.29,900, తమిళనాడులో రు. 19,000, కేరళలో రు.17,000 వంతున చెల్లిస్తున్నారని వివరించారు.
వారి డిమాండ్ మేరకు ఏటా 15 రోజుల సాధారణ సెలవుల(casual leaves)ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. అయినప్పటికీ వారు తమ ఆందోళన విరమించకుండా దశలవారీ ఆందోళన పేరుతో విధులను విస్మరిస్తున్నారని తెలిపారు. వారు వాస్తవ పరిస్థితులను గమనించి ఇప్పటికైనా తమ ఆందోళన విరమించి, విధుల్లో చేరాలని కృష్ణబాబు సూచించారు. వారు తిరిగి తమ విధుల్లో చేరని పక్షంలో వారి కాంట్రాక్ట్ లను రద్దు చేసి ఉద్యోగాల నుండి తొలగించేందుకు సైతం వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ప్రభుత్వం 27-11-2023 తేదీన సర్క్యులర్ ను జారీ చేసిందని తెలిపారు. సిహెచ్వోలకు వాస్తవ పరిస్థితుల్ని మరోసారి వివరించేందుకు 29-11-2023 తేదీన ఉదయం 11 గంటలకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు రాష్ట్రంలోని మొత్తం 10,032 మంది సీహెచ్‌వోలతో వెబినార్ నిర్వహిస్తారు. వాస్తవాల్ని తెలుసుకున్న తరువాత కూడా విధుల్లో చేరకుంటే వైద్య ఆరోగ్య శాఖ వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
Read Also : Children’s science congress: కేఎల్ యూనివర్సిటీలో రాష్ట్ర స్థాయి 31వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ – 2023
