Modi on G20: జీ-20 సమావేశాలపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ లో ఎక్కడైనా సమావేశాలు నిర్వహిస్తాం అని మోదీ అన్నారు. చైనా, పాకిస్తాన్ అభ్యంతరాలకు మోదీ కౌంటర్ ఇచ్చారు. కశ్మీర్, అరుణాచల్ లో సమావేశాలను నిర్వహించే హక్కు తమకు ఉందంటూ పరోక్షంగా చైనా, పాకిస్తాన్ దేశాల అభ్యంతరాలకు స్ట్రాంగ్‌గా బదులిచ్చారు మోదీ. (Modi on G20)
భారత్ లో అవినీతికి, మతతత్వానికి చోటు లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. జీ-20కి భారత్ అధ్యక్షత వహించడంతో సానుకూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. 2045 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి చర్చలతోనే పరిష్కారం లభించగలదని మోదీ సూచించారు.
గతంలో చిన్న దేశాలూ ఒలింపిక్స్ లాంటి భారీ క్రీడలను నిర్వహించడం చూశామన్నారు. అతి పెద్ద సమావేశాలను జరపడం గమనించామన్నారు. ఇలాంటివి పరివర్తనలో ఎంతో ప్రభావం చూపిస్తాయని మోదీ అభిప్రాయపడ్డారు. అభివృద్ధికి మార్గం చూపడంతోపాటు మన ఆలోచనా ధోరణిని మారుస్తాయని స్పష్టం చేశారు. ప్రపంచం గుర్తించేలా చేస్తాయన్నారు. భారత్‌లోని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రపంచాన్ని అనుసంధానించే ఇటువంటి కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించగలవన్నారు.
దురదృష్టవశాత్తూ గతంలో దిల్లీలోనే ఇలాంటి కార్యక్రమాలు జరిగేవన్నారు. విజ్ఞాన్ భవన్ చుట్టూనే తిరిగేవన్నారు. కానీ మన ప్రజల సమర్థతపై నాకు అచంచల విశ్వాసముందని మోదీ ఉద్ఘాటించారు. అవకాశమిస్తే ఎలాంటి బాధ్యతలనైనా చేపట్టగలరనే నమ్మకముందని దీమా వ్యక్తం చేశారు. ప్రతి ప్రాంతంలోని ప్రజలు పలు భారీ సమావేశాలను విజయవంతంగా నిర్వహించారన్నారు. బ్రిక్స్ సమావేశం గోవాలో, పసిఫిక్ ద్వీప దేశాల సమావేశం జైపుర్‌లో, గ్లోబల్ ఆంత్రప్రెన్యూర్స్ సమావేశం హైదరాబాద్‌లో విజయవంతంగా జరగడమే ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు.
అదే పద్ధతిని జీ20కి అమలు చేయాలనుకున్నామని వెల్లడించారు మోదీ. జీ20కి మన అధ్యక్షత ముగిసే నాటికి 220 సమావేశాలను 60 నగరాల్లో నిర్వహించనున్నామన్నారు. దాదాపు 125 దేశాల నుంచి లక్ష మంది ప్రతినిధులు హాజరవుతున్నారని, 1.5 కోట్ల మంది ప్రజలు ఇందులో భాగస్వాములయ్యారని స్పష్టీకరించారు మోదీ. ఈ సమావేశాలవల్ల అతిథ్యం, పర్యాటకరంగం, సృజనాత్మక నైపుణ్యం, ప్రాజెక్టుల బాధ్యతల నిర్వహణలో ప్రజలకు నైపుణ్యం వస్తుందని తెలిపారు. అంతర్జాతీయ సమావేశాలకు అతిథ్యం ఇవ్వగలమనే విశ్వాసం పెరుగుతుందన్నారు. హాజరయ్యే ప్రతినిధులకు స్థానిక సంస్కృతి గురించి వివరించే అవకాశం దక్కుతుందని మోదీ అన్నారు. ఇది జీ20 దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also : IT Notice to CBN: చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు.. ఇప్పటి వరకు రియాక్షన్ లేదెందుకు? తేలుకుట్టిన దొంగేనా?