Buggana on AP Appulu: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితికి ఢోకా ఏం లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రానికి మేలు జరుగుతుంటే ప్రతిపక్షం ఓర్వలేకపోతోందన్నారు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం చేసిన అప్పు రూ.1,77,991 కోట్లే..నని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం మొత్తం అప్పు రూ.4,42,442 కోట్లు అన్నారు. కార్పొరేషన్ రుణాలతో కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు కలిపితే టీడీపీది 33%, వైసీపీది 25 శాతమేనని వెల్లడించారు. స్థూల ఉత్పత్తి, రుణాల నిష్పత్తిని తీస్తే 7 శాతం పెంచిన టీడీపీ ఎక్కువ? 3 శాతం ఉన్న వైసీపీ ఎక్కువా? అని ప్రశ్నించారు. (Buggana on AP Appulu)
పబ్లిక్ అకౌంట్ లో టీడీపీ తీసుకుంది రూ.36,241 కోట్లు, వైసీపీ కేవలం రూ.3,475 కోట్లే అని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. అత్యుత్సాహం, అవగాహనారాహిత్యంతోనే ఎల్లో మీడియా, ప్రతిపక్షాల విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. టీడీపీ హయాంలో రాబడి 6%, జగన్ హయాంలో అది 16.7% ఉందని క్లారిటీ ఇచ్చారు. అప్పుల్లో ముంచిన బాబు.. సంపద సృష్టిస్తానంటే ఎవరు నమ్ముతారు? అని నిలదీశారు. స్యయంప్రతిపత్తి సంస్థల నివేదికల కన్నా..స్వయం ప్రకటిత ఆర్థిక నిపుణుల ఆరోపణలే మిన్నా? అని ప్రశ్నలు గుప్పించారు. ‘ప్రజా సంక్షేమమే’ గిట్టనోళ్లు రెట్టింపు సంక్షేమ మేనిఫెస్టోని ప్రకటిస్తే ప్రజలు నమ్ముతారా? అన్నారు. సింహం, కొదమసింహం మీరు అనుకోవడం కాదు చంద్రబాబు గారూ..ప్రజలు చెప్పాలి అని చురకలంటింటారు. (Buggana on AP Appulu)
2019లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి నాలుగేళ్ల కాలంలో చేసిన అప్పు రూ.1,77,991 కోట్లు మాత్రమేనని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. కొన్ని మీడియా వర్గాలు, ప్రతిపక్ష నాయకులు అత్యుత్సాహంతో, అవగాహన రాహిత్యంతో అసత్య ప్రచారం చేస్తున్నట్లు రాష్ట్ర అప్పు రూ.10 లక్షల కోట్లు కాదని ఆయన స్పష్టం చేశారు. తమకు తాము స్వయం ప్రకటిత ఆర్థిక నిపుణులుగా భావించే కొందరి దుష్ప్రచారం రాష్ట్ర ప్రజలు నమ్మరని మంత్రి బుగ్గన పేర్కొన్నారు.
2014-15 నుంచి 2018-19 ఐదేళ్ల కాలంలో గత ప్రభుత్వం ఏడాదికేడాది అప్పుల్లో వార్షిక వృద్ధి రేటు 14.7% పెరిగిందన్నారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిపాలనా కాలంలో(2019-23) 12.4% మాత్రమే ఉందని వెల్లడించారు. రెవెన్యూ లోటు గత టీడీపీ ప్రభుత్వంలో 2.4% కాగా అప్పుడు కేంద్ర ప్రభుత్వం రెవెన్యూ లోటు 2.5% అంటే దాదాపుగా కేంద్ర, రాష్ట్రాల లోటు సమానంగా ఉందన్నారు. 2019-23 కాలంలో భారత దేశ రెవెన్యూ లోటు 4.8% కాగా, ఏపీ రెవెన్యూ లోటు కేవలం 2.7%గా నమోదైందని..అంటే కేంద్రంతో చూస్తే, ఇంచుమించుగా రాష్ట్రంలో సగమే రెవెన్యూ లోటు నమోదైనట్లు మంత్రి బుగ్గన వివరించారు.
ద్రవ్య లోటు విషయానికొస్తే..గత ప్రభుత్వంలో భారతదేశ సగటు 3.1 శాతం కాగా, నాటి టీడీపీ ప్రభుత్వంలో మాత్రం 4.5శాతం ఉందన్నారు. అదే గత నాలుగేళ్ల కాలంలో ద్రవ్యలోటు భారత ప్రభుత్వానిది 6.7 శాతంగా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 4 శాతమే ద్రవ్యలోటుగా నమోదైందన్నారు. ఇలా ఏ విషయంలోనైనా గత ప్రభుత్వ స్థితితో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నా..అసత్య ప్రచారంతో ప్రజలని నమ్మించడమే ప్రతిపక్షాలు పనిగా పెట్టుకున్నారని ఆర్థిక మంత్రి విమర్శించారు.
చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన కాలం 1994-95 నుంచి 1998-99 పాలనా కాలాన్ని పరిశీలిస్తే, అప్పుల్లో వార్షిక వృద్ధి రేటు 16.8 శాతంగా నమోదైందన్నారు. రెండో పర్యాయంలో సీఎంగా ఉన్నప్పుడు కూడా 17 శాతానికి పెంచిన చరిత్ర చంద్రబాబుదన్నారు. ఆ తర్వాత, 2004 నుంచి 2009 మధ్య వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో అప్పు వార్షిక వృద్ధి రేటు 17% నుంచి 9.9%కి తగ్గిందన్నారు. 2014-2019 చంద్రబాబు పాలన కాలంలో అప్పు వార్షిక వృద్ధి రేటు మళ్లీ 14.7%కి చేరిందన్నారు.
ప్రస్తుత 2019-23 సీఎం వైఎస్ జగన్ పాలనలో అప్పు వార్షిక వృద్ధి రేటును మళ్లీ కేవలం 12.4 శాతంగా తీసుకురాగలిగామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గణాంకాలతో సహా వివరించారు. కార్పొరేషన్ రుణాల విషయానికొస్తే, ఈ అంశంలో గ్యారంటీ, నాన్-గ్యారంటీ అనే రెండు పద్ధతులు ఉంటాయని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. విద్యుత్ డిస్కంలకు గ్యారంటీలుండవు,కానీ మిగతా అన్నింటికీ గ్యారంటీ రుణాలుంటాయని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన నాటికి కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రూ.14,028 కోట్లు కాగా, చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి అది రూ.59,257 కోట్లకు తీసుకెళ్లారని మంత్రి బుగ్గన తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వ కాలంలో గత జూలై చివరి నాటికి రూ.1,44,875 కోట్లుగా కార్పొరేషన్ రుణాలున్నాయన్నారు. కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటుతో కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలను కలిపి చూస్తే టీడీపీ హయాంలో 33.4% అప్పు పెరిగిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వ కాలంలో పెరిగింది 25% మాత్రమేనన్నారు.
గ్యారంటీ ఇవ్వని రుణాలను పరిశీలిస్తే..విభజన నాటికి రూ.18,374 కోట్లు కాగా, గత చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.59,692 కోట్లన్నారు. అది ప్రస్తుత ప్రభుత్వం మార్చి-2023 నాటికి రూ.56,017 కోట్లున్నట్లు తెలిపారు. విద్యుత్ రంగానికి సంబంధించి డిస్కంలకు తిరిగి చెల్లించిన అప్పులను కూడా ఆర్థిక మంత్రి గణాంకాలతో సహా వివరించారు. రూ.2893 కోట్లు విభజన నాటికి, రూ.21,541 కోట్లు గత ప్రభుత్వంలో, రూ.8,455 కోట్లు మార్చి-2023 నాటికి ఉన్నాయని, దీని ప్రకారం విద్యుత్ రంగానికి చెందిన అప్పులను తీర్చిన విషయాలను గణాంకాలతోసహా మంత్రి బుగ్గన ప్రకటించారు.
గ్యారంటీ ఇచ్చినవి, గ్యారంటీ ఇవ్వని అప్పులను కలిపి చూస్తే, విభజన నాటికి రూ.35,296 వేల కోట్లని పేర్కొన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రూ.1,40,490 కోట్లు, ప్రస్తుత ప్రభుత్వ పాలనలో రూ.2,09,247 కోట్లుగా గణాంకాలే చెబుతున్నాయన్నారు. ఈ లెక్కల ప్రకారం టీడీపీ ప్రభుత్వంలో పెరిగిన అప్పుల వృద్ధి రేటు 21.9 శాతం కాగా, ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కాలంలో పెరిగిన అప్పు వృద్ధి రేటు 12.7 శాతమే అని ఆయన పునరుద్ఘాటించారు.
ఈ మధ్యనే క్రియాశీలక రాజకీయాలకు వచ్చి, వచ్చీ రాగానే రాష్ట్ర అప్పులు, ఆర్థిక పరిస్థితులపై మాట్లాడుతున్న ఔత్సాహిక రాజకీయనాయకులకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చురకలంటిస్తూ పలు సూచనలిచ్చారు. ఆర్బీఐ లెక్కల ప్రకారం, నాబార్డు ద్వారా తీసుకున్న రుణం రూ.7,992 కోట్లు కాదని అదంతా ముమ్మాటికి అబద్ధపు ప్రచారమేనన్నారు. వాస్తవానికి తీసుకున్న రుణం కేవలం రూ.3281 కోట్లు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేలా గవర్నర్ దగ్గర ఉంచే కంటెంజన్సీ నిధులపైనా రాద్ధాంతం చేయడం ‘ఫ్రెషర్స్’కు తగదన్నారు. ఎప్పటికీ చెక్కుచెదరకుండా అలాగే వినియోగించుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసే కంటెంజన్సీ నిధులను కూడా లెక్కలలోకి తీసుకోవడం వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. పబ్లిక్ అకౌంట్ అనేది ఒక పద్దు మాత్రమేనన్నారు. పబ్లిక్ అకౌంట్ లో ఉద్యోగులకు సంబంధించిన మొత్తాలు, ఏదైనా లావాదేవీల సమయంలో టెంపరరీ పార్కింగ్ వంటివి ఉంటాయన్నారు.
ఏపీ ప్రభుత్వం మొత్తం అప్పు రూ.4,42,442 కోట్లు
రాజకీయ నేతల విశ్లేషణలు, వాటిని ఆధారంగా పుంఖాను పుంఖానులుగా రాసుకున్న కథనాలతో ఒక ఎంపీ పార్లమెంట్‌లో ప్రశ్నకు సాహసించారు. దీనిపై కేంద్ర ఆర్థికశాఖామాత్యులు ఈ ప్రశ్నకు క్లియర్‌గా సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. ఏమని అంటే, 2023 నాటికి రూ.4,42,442 కోట్లు అప్పు అని చెప్పి సమాధానం వచ్చింది. ఈ సంఖ్య వింటూనే వారంతా ఎంత బాధపడిపోతున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. వారి కళ్లల్లో ఆవేదన, బాధ వర్ణానాతీతంగా ఉందన్నారు.చివరికి మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ‘అప్పులేని రోజుందా..?’ అని ప్రశ్నిస్తున్నారు. వీరి విశ్లేషణలు, ఆవేదన ధాటికి గతంలో ఆర్థికమంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడు కూడా ఏమీ మాట్లాడకుండా వెనక్కి వెళ్లిపోయారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై పొలోమంటూ ఇంతమంది మాట్లాడుతుంటే, మాజీ ఆర్థిక మంత్రి యనమల మాత్రం ఇక తాను స్పందించాల్సిన అవసరమేముందిలే అంటూ ఆయన వెనకబడిపోయారన్నారు.
పబ్లిక్ అకౌంట్ నిధులను అధికమొత్తంలో తీసుకుంది గత ప్రభుత్వమే
2015-16 నుంచి 18-19 కాలంలో ఉద్యోగుల పీఎఫ్ సహా వివిధ మొత్తాలను రూ.36,241 కోట్లు గత ప్రభుత్వం తీసుకుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం పబ్లిక్ అకౌంట్ ద్వారా రూ.3,475 కోట్లు మాత్రమే వినియోగించుకుందన్నారు. కానీ , ఎక్కువ అప్పులు, వడ్డీలు చేస్తుందని వైఎస్ ఆర్సీపీ ప్రభుత్వంపై బురదచల్లుతున్నారన్నారు. ఇక అదనపు రుణాల విషయానికొస్తే, గత టీడీపీ ప్రభుత్వం పరిమితి దాటి అప్పులు చేసిందని గణాంకాలతో సహా ఆర్థిక మంత్రి వివరించారు.
2016-17 ఏడాదికి గానూ రూ.4,800 కోట్లు, 2017-18లో రూ.1,040 కోట్లు, 2018-19 సమయంలో ఏకంగా రూ.10,574 కోట్లు, 2019-20 ఏడాదికి గానూ ప్రస్తుత ప్రభుత్వం రూ.9, 711 కోట్లు, అందులో 2020-21లో రూ.3,666 కోట్లు తిరిగి చెల్లించాం. 2020-21లో 11,521 కోట్లు తిరిగి కట్టినట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. మొత్తంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.17,531 కోట్లు పరిమితి దాటి చేసినట్లు చెబుతున్న అప్పులో రూ.16,418 కోట్లు గత ప్రభుత్వానిదేనని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ అడ్డగోలుగా చేసిన అప్పుల ప్రభావం ఈ ప్రభుత్వంపై పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రతిపక్షాలు పదే పదే అదే పనిగా వినతి పత్రాలు ఇవ్వడం వల్ల ఈ నిజాలన్నీ బయటకి వచ్చాయన్నారు.
