HomeAndhra PradeshHaj Yatra: హజ్‌ యాత్రికులకు గుడ్‌ న్యూస్.. నేరుగా ఏపీ నుంచే యాత్ర..!

Haj Yatra: హజ్‌ యాత్రికులకు గుడ్‌ న్యూస్.. నేరుగా ఏపీ నుంచే యాత్ర..!

Haj Yatra: హజ్‌ యాత్రికులకు (Haj Yatra) ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇదివరకెన్నడూ లేని విధంగా నేరుగా రాష్ట్రం నుంచే హజ్‌ యాత్రకు వెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తొలిసారి ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నామని, రాష్ట్రం నుంచి హజ్‌ (Haj Yatra) యాత్రికులు నేరుగా వెళ్లేందుకు ఎంబార్కింగ్‌ సాధించామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి అంజాద్‌ బాషా వెల్లడించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో మొదటి ప్లోర్ లోని సీసీఎల్ఏ కాన్ఫరెన్స్ హాల్ లో మైనార్టీ శాఖ సెక్రటరీ ఏఎండీ ఇంతియాజ్, హజ్ కమిటీ ఛైర్మన్ బి.ఎస్. గౌస్ లాజమ్ ఆధ్వర్యంలో హజ్ కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తొలిసారిగా గన్నవరం ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేసిన ఎంబార్కేషన్ పాయింట్ నుంచి 1,813 మంది యాత్రికులను నేరుగా పవిత్ర హజ్ యాత్రకు పంపుతామన్నారు. ఈ ఏడాది జూన్ 7 నుంచి 19 జూన్, 2023 వరకు కొనసాగనున్న హజ్ యాత్రలో భాగంగా రోజూ 155 మంది యాత్రికులు హజ్ యాత్రకు వెళ్లేలా ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. కొత్తగా ఎంబార్కేషన్ పాయింట్ వచ్చాక వివిధ ఎయిర్ లైన్స్ ఏపీ నుండి యాత్రికులను హజ్ కు తీసుకెళ్లి మళ్లీ హజ్ నుంచి ఏపీకి తీసుకువచ్చే విధంగా ఇప్పటికే టెండర్లు పిలవడం జరిగిందన్నారు.

హైదరాబాద్, బెంగుళూరు ఎంబార్కేషన్ నుండి వెళ్లే ప్రతి ఒక్క యాత్రికుడి మీద రూ.80,000 అదనంగా భారం పడుతున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సింథియా, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి స్క్మతి ఇరానీతో చర్చించామన్నారు. హజ్ యాత్ర టికెట్ ధరను తగ్గించాలని వారిని కోరామన్నారు. తగ్గించలేని పరిస్థితుల్లో తమ రాష్ట్రం నుంచి హజ్ కు వెళ్లే యాత్రికులను హైదరాబాద్, బెంగుళూరు నుండి వెళ్లే విధంగా అనుమతించాలని కోరామన్నారు.

దీనిపై పరిశీలిస్తామని కేంద్రమంత్రులు చెప్పారని అంజాద్ బాషా పేర్కొన్నారు. ఈ క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి ప్రోద్భలంతో ప్రతి ఏటా యాత్రికుడిపై విమాన ప్రయాణానికి అయ్యే ఖర్చుకు అదనంగా ఒక్కొక్కరికి రూ. 80,000 ల చొప్పున రూ.14.51 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించడం విశేషమన్నారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి మైనార్టీ సంక్షేమ శాఖ, హజ్ యాత్రికుల తరపున అంజాద్ బాషా ధన్యవాదాలు తెలిపారు.

హజ్ యాత్రికుల కొరకు గుంటూరు జిల్లా నంబూరు వద్ద గల మదరసాలో వసతి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. యాత్రికుల లగేజ్ ను మదరసాలోనే స్కానింగ్ చేసి అక్కడి నుండి నేరుగా ఎయిర్ పోర్టుకు తరలించేలా ఎయిర్ పోర్టు అథారిటీ అధికారులు ఏర్పాట్లు చేశారన్నారు. అదే విధంగా ఆర్టీసీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 4 ఏసీ బస్సుల ద్వారా యాత్రికులను మదరసా నుండి గన్నవరం ఎయిర్ పోర్టుకు పంపించే సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.

హజ్ యాత్రికుల సౌకర్యార్థం 24 గంటలు పనిచేసేలా మదరసా వద్ద మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి అవసరమైన వారికి వ్యాక్సినేషన్ అందిస్తున్నామన్నారు. హజ్ కు వెళ్లే యాత్రికులు వసతి కేంద్రం వద్దకు 24 గంటల ముందుగానే చేరుకోవాలని సూచించారు. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా వివిధ శాఖల అధికారులంతా సమన్వయంతో పని చేయాలని అంజాద్ బాషా కోరారు. జూన్ 7వ తేదీ నుంచి జూన్ 19వ తేదీ దాకా గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి హజ్ కు బయలుదేరే యాత్రికుల యాత్ర సవ్యంగా సాగాలని ఆకాంక్షిస్తున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ సెక్రటరీ ఇంతియాజ్ తెలిపారు.

Read Also : Machilipatnam: రాక్షసుల తరహాలో అడ్డుకుంటున్నారు.. బందరులో సీఎం జగన్‌

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు