HomeAndhra PradeshMaha Yagnam: రూ.225 కోట్లతో మారనున్న దుర్గగుడి రూపురేఖలు

Maha Yagnam: రూ.225 కోట్లతో మారనున్న దుర్గగుడి రూపురేఖలు

లోకకల్యాణార్థం, రాష్ట్రం సస్యశ్యామలంగా అభివృద్ధి చెంది ప్రజలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఐశ్యర్య ప్రాప్తి కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తలపెట్టిన శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం (Maha Yagnam) విజయవంతమైంది. ఇవాళ పూర్ణాహుతి (Poornahuti) కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) పాల్గొన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరుగుతున్న అష్టోత్తర శత కుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ మహాలక్ష్మి యజ్ఞం  (Maha Yagnam) మహా పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొన్నారు.

ముఖ్యమంత్రికి శేష వస్త్రం అందజేసి వేదాశీర్వచనాలతో వేదపండితులు స్వాగతం పలికారు. ఉపముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవదాయ శాఖ కమిషనర్‌ శ్రీరాము సత్యనారాయణతోపాటు అధికార యంత్రాంగమంతా ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. అభిషేక మండపంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సీఎం జగన్‌ పట్టుచీర సమర్పించారు. అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో పలువురు పీఠాధిపతులు పాల్గొన్నారు.

వేదాలు చెప్పిన 8 ఆగమాల ప్రకారం కనివినీ ఎరుగని రీతిలో భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఆరు రోజులు అష్టోత్తర శతకుండాత్మక (108) చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం నిర్వహించారు. సీఎం జగన్‌ తీసుకున్న యజ్ఞ (Maha Yagnam) సంకల్పం సంపూర్ణంగా ఫలప్రదమైందని దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు.

ఇందిరాగాంధీ స్టేడియంలోని యజ్ఞవాటిక ప్రాంగణం వద్ద మంత్రి మాట్లాడారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉద్దండులైన వేద పండితులు, 550 మంది రుత్విక్కులు, 300 మంది సహాయకులు సమక్షంలో వైఖానసం, పాంచరాత్రం, శైవం, వైదిక స్మార్తం అనే 4 ఆగమములతో యజ్ఞాలు, హోమాలు, వీరశైవం, తంత్రసారం, గ్రామదేవతారాధన, చాత్తాద శ్రీవైష్ణవం అనే మరో 4 ఆగమాల ప్రకారం జప పారాయణం నిర్వహించామన్నారు.

ప్రజా సంక్షేమం కోసం చేసిన మహోన్నతమైన యజ్ఞం విజయవంతం కావడంపై ఆనందం వ్యక్తం చేశారు. తొలిరోజు సంకల్పదీక్షను చేపట్టిన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యజ్ఞం చివరి రోజు స్వహస్తాలతో పండితులు నిర్ణయించిన సుముహూర్తాన 4 యాగ శాలల్లో విశేష పూజలతో మహా పూర్ణాహుతి కార్యక్రమం చేశారన్నారు. అభిషేక మండపంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా అనంత లక్ష్మీ అమ్మవారికి అభిషేకం చేయించి, పీఠాధిపతులు, వేద పండితులచే వేదాశీర్వచనం, అనుగ్రహ భాషణం చేయించామన్నారు.

ఆశీర్వాద అనంతరం సీఎంకు నూతన వస్త్ర బహుకరణ చేశామన్నారు. యజ్ఞం విజయవంతం కావడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారని తెలిపారు. ధర్మపరిరక్షణ పరిషత్ ఏర్పాటు చేసి రాష్ట్రమంతా ధర్మ ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి గొప్ప మనసుకి, సనాతన హిందూ ధర్మం మీద ఆయనకున్న గౌరవానికి, సంకల్ప సిద్ధికి ప్రత్యేకంగా మంత్రి కొట్టు సత్యనారాయణ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

రూ.225 కోట్ల వ్యయంతో ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఆలయ సమగ్రాభివృద్ధి పనుల మాస్టర్ ప్లాన్ ను ముఖ్యమంత్రి పరిశీలించారని మంత్రి చెప్పారు. వాస్తు ప్రకారం, వాస్తు పండితుల, స్థానాచార్యులు, స్తపదులు, ఢిల్లీలోని గురుగావ్ నుంచి తెప్పించిన ఆర్కిటెక్చర్ డిజైన్లు పరిశీలించిన ముఖ్యమంత్రి దుర్గమ్మ ఆలయంలో ప్రతి బిల్డింగ్ మీద ఒక గుడి ఆకారంలో రూప్ ఉండేలా చూడాలని, దాని ద్వారా అధ్యాత్మిక శోభ ఫరిఢవిల్లుతుందని సూచించారన్నారు.

తూర్పున నిర్మాణం చేసే రాజగోపురంలో నుంచి లక్షలాది మంది భక్తులు ప్రవేశించి అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్లీ తిరిగి తూర్పు ద్వారం గుండానే బయటికి వచ్చేలా 18 అడుగుల ఎత్తులో మెయిన్ రోడ్డు నుంచి నిర్మాణం చేపడుతున్నామన్నారు.

సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం, రాష్ట్ర ప్రజల కళ్యాణ సౌభాగ్యాల కోసం, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, అభ్యున్నతి కోసం, ప్రకృతి వైపరీత్యాలు తలెత్తకుండా, సకాలంలో వర్షాలు పడి పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ జరిగిన యజ్ఞానికి పదుల సంఖ్యలో విశిష్ట పీఠాధిపతులు విచ్చేసి అనుగ్రహ భాషణం చేయడం ఆనందంగా ఉందన్నారు.

Read Also : Amaravati: అమరావతిలో పేదల ఇళ్ల స్థలాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు