ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) ఈ సీజన్లో రికార్డులు బద్దలవుతున్నాయి. తాజాగా పంజాబ్ కింగ్స్ (Punjab Kings) తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) సంచలనాలు (PBKS vs LSG) నమోదు చేసింది. ఓవరాల్‌గా ఐపీఎల్ (Indian Premier League) చరిత్రలో రెండో అత్యధిక స్కోరు సాధించింది లక్నో సూపర్ జెయింట్స్. మరోవైపు ఒకే మ్యాచ్‌లో భారీగా పరుగులు నమోదైన రికార్డు కూడా చేరింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో (PBKS vs LSG) పలు రికార్డులు చెరిగిపోయాయి.
మొదట లక్నో బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఫలితంగా జట్టు స్కోరు ఐదు వికెట్ల నష్టానికి 257 పరుగులు. ఈ టార్గెట్‌ను చూడగానే ఫ్యాన్స్ అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. అయితే, ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు అయిన 263 పరుగులు మాత్రం సేఫ్‌గా ఉంది. ఆ స్కోరును కూడా దాటేస్తారని చాలా మంది ఐపీఎల్ అభిమానులు భావించారు. తృటిలో తప్పినట్లయింది. అయితే, అంతటి టార్గెట్ ముందు ఉన్నప్పటికీ పంజాబ్ కింగ్స్ వీరపోరాటం చేసింది. పంజాబ్ కింగ్స్ ఆఖరిదాకా పోరాడి 201 పరుగులు చేయడం విశేషం. టార్గెట్ మరీ ఎక్కువగా ఉండటంతో పంజాబ్‌కు ఓటమి పాలు కాక తప్పలేదు. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల కెప్టెన్లు కీలక వ్యాఖ్యలు చేశారు.
మ్యాచ్‌లు ముగుస్తున్న కొద్దీ.. తమకు ఇకపై ప్రతి మ్యాచ్ కీలకమని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు. అందుకే ఎలా ఆడాలో ముందే నిర్ణయించుకున్నామని తెలిపాడు. పంజాబ్‌పై గెలవడం సంతోషాన్నిచ్చిందన్న రాహుల్.. గత మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్‌తో ఓడటం తీవ్ర నిరుత్సాహానికి గురి చేసిందని వ్యాఖ్యానించాడు. ఆ ఓటమి నుంచి బయట పడి పంజాబ్‌తో ఆడి కీలక విజయాన్ని అందుకున్నామన్నాడు.
ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌పై ప్రణాళికలు వేసుకున్నామని, మంచి షాట్స్ ఆడాలని ప్లాన్ చేశామన్నాడు. ఇలాంటి పిచ్ బ్యాటర్లలో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుందన్నాడు. 250కిపైగా పరుగులు చేయడం అంత సులువైన పని కాదని, పిచ్ నుంచి సహకారం లభించడం వల్లే ఇది సాధ్యమైందని కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు. మేయర్స్, బదోని, పూరన్, స్టొయినిస్‌తో కూడిన భారీ హిట్టింగ్ లైనప్ తమకు ఉందని, రాబోయే మ్యాచ్‌లలోనూ ఇది కంటిన్యూ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఇక మ్యాచ్ అనంతరం పంజాబ్ సారధి శిఖర్ ధావన్ మాట్లాడుతూ.. తొలుత బౌలింగ్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్నామన్నాడు. అదనపు బౌలర్‌తో బరిలోకి దిగిన వ్యూహం మిస్ అయ్యామని, మరో స్పిన్నర్ లేకుండా ఆడి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్నాడు. తమకు ఈ మ్యాచ్ ఒక గుణపాఠమని ధావన్ పేర్కొన్నాడు. అయితే, ఛేదనలో కూడా మంచి ఆరంభం దక్కలేదన్న ధావన్.. తాము బ్యాటింగ్ చేసేటప్పుడు పిచ్ అనుకూలంగా అనిపించలేదన్నాడు. భారీ షాట్‌కు ప్రయత్నించి నేరుగా ఫీల్డర్ చేతిలోకి క్యాచ్ ఇచ్చానని గుర్తు చేసుకున్నాడు. అయితే, లివింగ్ స్టోన్, సామ్ కరణ్ బ్యాటింగ్ ఆర్డర్‌లో ఉండటంతో షారుఖ్ ఖాన్‌ను ముందు పంపలేకపోయామన్నాడు. అయినప్పటికీ తమ బ్యాటర్లు ఆశించిన స్కోరు చేశారని మెచ్చుకున్నాడు ధావన్.
రికార్డులు బద్దలయ్యాయి.. ఓ లుక్కేయండి..
1. లక్నో సాధించిన 257/5 స్కోర్ అనేది ఓ సంచలన రికార్డు. ఐపీఎల్ చరిత్రలోనే ఇది రెండో అత్యధిక స్కోరు. తొలి స్థానం మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పేరిట ఉంది. 2013లో పుణెపై 5 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ.. 263 పరుగులు చేసి సంచలనం సృష్టించింది.
2. పంజాబ్ కింగ్స్ జట్టు కూడా 200కు పైగా రన్స్ చేయడంతో మరో రికార్డు నమోదైంది. ఈ మ్యాచ్‌లో మొత్తం పరుగులు 458. ఇదీ కూడా ఐపీఎల్‌లో ఓ రికార్డును లిఖించింది. అయితే, ఇలా రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి భారీగా పరుగులు నమోదైన మూడో మ్యాచ్‌గా ఇది ఘనత సాధించింది. ఇంతకుముందు సీఎస్‌కే వర్సెస్ ఆర్‌ఆర్ 2010లో 469 పరుగులు చేశారు. పంజాబ్ కింగ్స్ వర్సెస్ కేకేఆర్ మధ్య 2018లో 459 పరుగులు నమోదయ్యాయి.
3. పంజాబ్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన తాజా మ్యాచ్‌లో మొత్తం 16 మంది బౌలింగ్ చేయడం విశేషం. పంజాబ్ నుంచి ఏడుగురు, లక్నో నుంచి ఏకంగా 9 మంది బౌలర్లను ఆయా కెప్టెన్లు వినియోగించుకున్నారు. ఇలా ఒకే ఇన్నింగ్స్‌లో ఎక్కువ మంది బౌలర్లను వాడిన రెండో జట్టుగా లక్నో రికార్డు క్రియేట్ చేసింది. అంతకుముందు ఆర్సీబీ కూడా గుజరాత్ లయన్స్‌పై 9 మంది బౌలర్లను ప్రయోగించింది.
4. ఎక్కువగా బౌండరీలు నమోదైన రెండో మ్యాచ్‌గా కూడా ఈ మ్యాచ్ నిలిచింది. ఈ పోరులో మొత్తం 67 బౌండరీలు వచ్చాయి. ఇందులో 45 ఫోర్లు, 22 సిక్సర్లు ఉండటం గమనార్హం. తొలి రికార్డు 2010లో సీఎస్కే వర్సెస్ ఆర్‌ఆర్ పేరిట ఉంది. మొత్తం 69 బౌండరీలు నమోదు కాగా, అందులో 39 ఫోర్లు, 30 సిక్సర్లు బాదారు.
5. ఈ సీజన్‌లో సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. దీంతో ప్రస్తుత ఐపీఎల్ సీజన్ కాస్త భిన్నమైన రికార్డులను నమోదు చేస్తోంది. పంజాబ్-లక్నో మ్యాచ్ ఈ సీజన్‌లో 38వది. ఇప్పటికే 200+ స్కోరు 20 సార్లు నమోదైంది. ఇదొక రికార్డు. గతేడాది టోర్నీ మొత్తం 18 సార్లు మాత్రమే 200+ పరుగులు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో ఇంకా సగం మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఇలా 20 సార్లు 200కుపైగా రన్స్ బాదేశారు. ప్రస్తుత జోరును చూస్తే ఇది మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Read Also: IPL 2023: తిలక్ వర్మ మరో ఛాన్స్ కొట్టేశాడు.. చేతులు కలిపిన రిలయన్స్!
