Telangana Formation Day: ఎవరిది పైచేయి? దశాబ్ది ఉత్సవాల వేళ.. హీటెక్కిన తెలంగాణ రాజకీయం!

Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన రాజకీయ వేడి పెరిగింది. రాష్ట్రానికి గర్వకారణమైన రోజున కూడా రాజకీయాలే మాట్లాడుతున్నాయి. నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఉద్యమం నాటి రోజులను గుర్తు చేసుకుంటూ తెలంగాణ ప్రజానీకానికి ఏం చేశామనేది ముఖ్యమంత్రి కేసీఆర్ వివరిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం దోపిడీకి గురైందన్న కేసీఆర్.. ఇప్పుడు దేశంలోనే బలీయమైన శక్తిగా తెలంగాణ అవతరించిందని పేర్కొన్నారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై.. రాజ్‌ భవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ (Telangana Formation Day) వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై మరోసారి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఇక బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా గోల్కొండ కోట వేదికగా తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించింది. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. కిషన్‌ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ సైతం వేడుకలను నిర్వహిచింది. తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణం సోనియా గాంధీనే అని, తామే తెలంగాణ తెచ్చామని పేర్కొంటున్నారు. ఇలా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు దశాబ్ది వేడుకల వేళ తెలంగాణలో రాజకీయ కాక రగులుతోంది.

సచివాలయంలో నిర్వహించిన వేడుకల్లో (Telangana Formation Day) ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్.. అనంతరం పోలీసులు, భద్రతా బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు గన్‌పార్క్‌ వద్ద అమర వీరులకు ముఖ్యమంత్రి ఘన నివాళులర్పించారు. సచివాలయంలో నిర్వహించిన వేడుకల సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. రాష్ట్ర ప్రగతిని వివరించారు. రాష్ట్రం ఆవిర్భావించడానికి ముందు జరిగిన పరిణామాలు గుర్తు చేసుకున్నారు. 2014లో తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సీఎం కేసీఆర్ వివరించారు.

Image

1969లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిందన్న కేసీఆర్.. ఆ సమయంలో రక్తసిక్తమైందని గుర్తు చేశారు. నాటి ఆంధ్రా పాలకులు కుట్రలతో అణచివేశారని చెప్పారు. అయితే, 2001 తర్వాత నిర్వేదం, నిశ్శబ్దాలను బద్దలు కొట్టి మళ్లీ ఉద్యమం వైపు నడిపించామన్నారు. ఉద్యమానికి తాను నాయకత్వం వహించే అవకాశం దక్కడంతో తన జీవితం ధన్యమైందని కేసీఆర్ చెప్పారు. శాంతియుతంగా వివేకమే పునాదిగా సాగిన మలిదశ ఉద్యమంలో అన్ని రంగాలూ ఏకమయ్యాయని చెప్పారు. ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన మేధావులు, విద్యావంతులు, ఉద్యోగ ఉపాధ్యాయులు, కవులు, కళాకారులు, కార్మికులు, మహిళలు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు విభేదాలకు తావివ్వకుండా ఏకోన్ముఖులై ముందుకు కదిలారని గుర్తు చేశారు. వారందరికీ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తలవంచి నమస్కరిస్తున్నానని చెప్పారు.

కలలో కూడా ఊహించని విధంగా పథకాలు..

2014లో రాష్ట్రం సాధించుకున్న తర్వాత అధికారంలోకి వచ్చామని, అమర వీరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మనసా వాచా కర్మణా అంకితమయ్యామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రతి రంగంలోనూ దేశం మొత్తం నివ్వెరపోయేలా ఫలితాలను సాధిస్తున్నామని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతిపథంలో పరుగులు పెడుతోందన్నారు. నేడు పదో వసంతంలోకి అడుగుపెట్టడం ఓ మైలురాయని, కలలో కూడా ఎవరూ ఊహించని విధంగా పథకాలను తీసుకొచ్చామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర పథకాల పట్ల దేశమంతటా ఆదరణ కనిపిస్తోందన్నారు. సంక్షేమంలో రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ యుగాన్ని ఆవిష్కరించిందని చెప్పారు.

Image

ఇంకా కేసీఆర్ ప్రసంగంలో విద్యుత్‌ సరఫరా, దళిత బంధు, ప్రాజెక్టులు, కాళేశ్వరం, పల్లె, పట్టణ ప్రగతి, రాష్ట్రానికి జాతీయ అవార్డులు రావడం, సంక్షేమానికి కేటాయింపులు.. ఇలా అనేక అంశాలను వెల్లడించారు. స్వరాష్ట్ర అవతరణ, దశాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 21 రోజులపాటు గ్రామం నుంచి రాజధాని హైదరాబాద్‌ నగరం వరకు ప్రజలంతా ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌లో ప్రగతి కాదు.. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కావాలి: గవర్నర్

మరోవైపు తెలంగాణ దశాబ్ది వేడుకలను రాజ్‌ భవన్‌లో గవర్నర్‌ తమిళిసై ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పరోక్షంగా కేసీఆర్ సర్కార్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. రాష్ట్రం ఏర్పడి పదో ఏడాదిలో అడుగు పెడుతున్నప్పటికీ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. అభివృద్ధి అంటే హైదరాబాద్‌ మాత్రమే కాదని.. అన్ని ప్రాంతాల్లోనూ కనిపించాలని వ్యాఖ్యానించారు. మారుమూల పల్లెల్లో కూడా ప్రగతి ఫలాలు కనిపించాలన్నారు. అప్పుడే అసలైన అభివృద్ధి కనిపిస్తుందని తమిళిసై స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాజ్‌ భవన్‌లో ఉద్యమకారులకు సన్మానం చేశారు. అమర వీరులకు నివాళులర్పించారు. కొంత మంది అభివృద్ది కాకుండా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అయితేనే సంపూర్ణ అభివృద్ధి సాధ్యమన్నారు. జై తెలంగాణ అంటే స్లోగన్‌ నినాదం కాదని, అదో ఆత్మగౌరవ నినాదమని చెప్పారు.

తెలంగాణ ఏ ఒక్కరి వల్లో రాలేదు..: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్క వ్యక్తి వల్లనో, కుటుంబం వల్లనో సాకారం కాలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర సాధన కోసం అన్ని ప్రాంతాల్లో పోరాటాలు జరిగాయని స్పష్టం చేశారు. పేరుకే బంగారు తెలంగాణ.. కానీ కొన్ని కుటుంబాలే బంగారమయ్యాయని కేసీఆర్‌ టార్గెట్‌గా కిషన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణ అవతరణ వేడుకలను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గోల్కొండ కోటలో ఘనంగా నిర్వహించారు. కిషన్‌రెడ్డి పాల్గొని జాతీయ పతాకం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

ఉద్యమ సమయంలో 1200 మంది అమరులయ్యారని, రాష్ట్ర ఏర్పాటు కోసం సుష్మా స్వరాజ్ కూడా పోరాటం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ బిల్లు పెట్టించడంలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని, ఉద్యమంలో సకల జనుల సమ్మె చారిత్రాత్మక ఘట్టమన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమం సాగిందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అందరికీ వందనాలు తెలియజేశారు.

పరిస్థితులు మారనందుకు దుఃఖంగా ఉంది..: మాజీ స్పీకర్‌ మీరా కుమార్..

కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చినందుకు సోనియాగాంధీకి ఈ సందర్భంగా ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల బాధను అర్థం చేసుకున్న సోనియా గాంధీ.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణ ప్రజలను అందరూ మోసం చేశారని వాపోయారు. ప్రజల సమస్యలను ఎవరూ వినలేదు, పట్టించుకోలేదని, కేవలం సోనియా గాంధీనే తెలంగాణ ప్రజలను అర్థం చేసుకున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజల బాధలు చూసి రాష్ట్రం ఏర్పాటు చేశామని చెప్పారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా తెలంగాణ ఏర్పాటు జరిగింది అనడం పూర్తిగా హాస్యాస్పదమన్నారు. తొమ్మిదేళ్లు గడిచినా తెలంగాణలో పరిస్థితులు మారనందుకు దుఃఖంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

2న తెలంగాణకు మీరాకుమార్ రాక

తెలంగాణలో రైతాంగం, కార్మికుల సమస్యలు అలాగే ఉన్నాయని మీరా కుమార్ తెలిపారు. హైదరాబాద్ నుంచి కాస్త పక్కకి వెళ్లి చూస్తే తెలంగాణలో ఉన్న పరిస్థితులు తెలుస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొస్తామని వ్యాఖ్యానించారు.

మరోవైపు రాష్ట్ర బీజేపీ శాఖ కూడా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరిపింది. ఇలా ఎవరికి వారే యమునాతీరే అన్నట్లు తెలంగాణ ఆవిర్భావ వేడుకలను రాజకీయాలకే వాడుకుంటున్నారు. చిత్తశుద్ధితో రాష్ట్రం ఏర్పడిన పరిస్థితులు, జరుగుతున్న అభివృద్ధి, ఇంకా ఏమేం జరగాలనే ఆలోచన చేయకుండా పరస్పరం విమర్శలు చేసుకోవడంపై ప్రజలు చర్చించుకుంటున్నారు.

Read Also : CM KCR: రాజ్‌భవన్‌లు బీజేపీ కార్యాలయాలుగా మారాయి.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles