Telangana Congress CM: తెలంగాణలో ఎన్నికల సంగ్రామం దగ్గరపడుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం వేగంగా నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ తరఫున సీఎం కేసీఆర్ ఇప్పటికే బహిరంగ సభలు నిర్వహిస్తూ హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకుంటామని కుండబద్ధలు కొడుతున్నారు. మరోవైపు బీజేపీ జాతీయ నాయకత్వం కూడా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తోంది. కేంద్ర మంత్రులు, రాష్ట్ర అగ్రనేతలు కలిసి ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీది ఇంకో రకం తీరు. అందరూ అభ్యర్థులను ప్రకటిస్తుంటే కాంగ్రెస్ పార్టీలో మాత్రం సీఎం క్యాడేంట్లను ప్రకటించుకొనే పనిలో బిజీగా ఉంది. (Telangana Congress CM)
తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సీఎం రేసులో ముందు వరుసలో ఉన్నారు. తొలి సంతకం వగైరాలు కూడా ప్రకటించేశారు. మరోవైపు ముఖ్యమంత్రి పదవి తాను కోరుకోవడం కాదు.. సీఎం పదవే తన వద్దకు వచ్చేస్తుందంటూ సీనియర్ నేత జానారెడ్డి మీడియాతో అన్నారు. ఇక తాను సీఎం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడాచెబుతున్నారు. మరోవైపు ఇంకో పదేళ్లకైనా తెలంగాణ రాష్ట్రానికి సీఎం అవుతానంటూ తాజాగా జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
సీఎం అభ్యర్థులు, వారి వ్యాఖ్యానాలు ఇవీ..
1. రేవంత్‌రెడ్డి
డిసెంబర్ 9న ఎల్‌బీ స్టేడియంకి ఉదయం 10.30 గంటలకు ప్రమాణ స్వీకారం ఉంటుంది. మీరందరూ తప్పక రావాలి. డిసెంబర్ 9, 2023 ఉదయం 10.30 గంటలకు ఇందిరమ్మ రాజ్యం, ఆరు గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది… ఇవీ రేవంత్ రెడ్డి మాటలు. ఇలా ప్రమాణ స్వీకారం తేదీ, వేదిక కూడా డిక్లేర్ చేసి తానే సీఎం అని నేరుగా అధిష్టానానికి సంకేతాలు పంపుతున్నారు.
2. జానారెడ్డి
పదవుల రేసులో నేనెప్పుడూ లేను. పదవే రేసులో ఉండి నన్ను అందుకుంటుంది తప్ప నేను రేసులో లేను. ఆరు నెలల తర్వాత కదా అవ్వాల్సింది. నా కొడుకు రాజీనామా చేస్తాడు. నేను ఎమ్మెల్యే అవుతా… ఇదీ సీనియర్ నేత జానారెడ్డి డిఫరెంట్ స్టైల్. సీఎం పదవే తనను వెతుక్కుంటూ వస్తుందని నేరుగా అధిష్టానికి తన వాంఛను వెల్లడించారు.
3. జగ్గారెడ్డి
సంగారెడ్డి ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజల ఆశీస్సులతో జగ్గారెడ్డి మనసులో మాట చెబుతున్నాడు. వచ్చే దసరాను మరింత ఉత్సాహంగా జరుపుకుందాం. సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి. జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి… విజయదశమి రోజున నా మనసులో మాట చెబుతున్నా. ఇంకో పదేళ్లకయినా సరే.. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి తీరుతా.
4. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సీఎం అవడం ఖాయం. ఎప్పుడో ఓసారి అవుతా. తెలంగాణ ప్రజలు బాగుండాలె. ఉద్యోగులు బాగుండాలె. అనేదే నా కోరిక. నాకు పదవుల మీద ఆశ లేదు… ఇదీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కామెంట్స్. ఆయన సీఎం రేసులో ఉన్నాడని డైరెక్టుగానే చెబుతున్నారు.
వీళ్లే కాదు.. ఇంకా భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇతర నాయకులు కూడా సీఎం పదవిపై ఓ కన్నేసి ఉంచారు. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారంతా సీఎం అభ్యర్థులేనని చెప్పకనే చెబుతున్నారు. ఒక వేళ కాంగ్రెస్‌ను విజయం వరిస్తే హైకమాండ్ ఎవరివైపు మొగ్గుచూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి: Hindu Dharmam: హిందూ మతానికి, హిందూ ధర్మానికి తేడా ఏంటి? హిందూ సనాతన ధర్మం ఏం చెబుతుంది?