KTR Comments: గవర్నర్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని కేంద్రం రాజకీయాలు చేస్తోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. గవర్నర్ తిరిగి పంపిన బిల్లుల పైనా కేబినెట్ లో చర్చించామన్నారు. మున్సిపల్ శాఖ, పంచాయతీ శాఖ, ఎడ్యుకేషన్ బిల్లును గవర్నర్ తిరిగి పంపారని గుర్తు చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తిరిగి మూడు బిల్లులను ప్లాప్ చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. రెండో సారి శాసనసభ పాస్ చేశాక గవర్నర్ ఎవరున్నా బిల్లులను ఆమోదించక తప్పదని స్పష్టం చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు, కుర్రా సత్యనారాయణ ఎంపికకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేటీఆర్ తెలిపారు. (KTR Comments)
తమ ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వానికి చెప్పినా.. గోడకు చెప్పినా ఒక్కటేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయినప్పటికీ తమ ప్రయత్నం చేస్తామన్నారు. హస్తినకు వెళ్తాం.. నిధులు కోరుతామన్నారు. మెట్రో రైల్‌కైనా, వరద సాయమైనా చేస్తే మంచిదన్నారు. ఇవ్వకపోతే వాళ్ల ఖర్మ అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని ఆశిస్తున్నామని, సహకరించకపోతే 2024లో ఏర్పడేది ఎలాగూ సంకీర్ణ ప్రభుత్వమేనన్నారు. అందులో బీఆర్‌ఎస్ కీలకపాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోవైపు సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం ఆరు గంటలకుపైగా సుదీర్ఘంగా మంత్రివర్గ సమావేశం జరిగింది. సబ్బండ వర్ణాలపై కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. నిజాంకాలంలో ప్రారంభమై వందేళ్లు పూర్తి చేసుకుంటున్న ఆర్టీసీకి శతవసంతాల వేళ గుడ్ న్యూస్ చెప్పారు. సంస్థను పటిష్ఠం చేస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో 43 వేల పైచిలుకు కార్మికులు లబ్ధి పొందనున్నాయి.
43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తమను ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిన సంగత తెలిసిందే. కార్మికుల కోరికను మన్నిస్తూ.. అదో సామాజిక బాధ్యతగా ప్రజా రవాణాను గుర్తిస్తూ టీఎస్‌ఆర్టీసీని మరింత పటిష్ఠం చేయడానికి అధికారులతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
సబ్ కమిటీ అధ్యక్షుడిగా ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో ఆర్‌అండ్‌బీ, రవాణాశాఖ కార్యదర్శులు, జీఏడీ, లేబర్‌తోపాటు స్పెషల్ చీఫ్ సెక్రటరీ అందరూ సభ్యులుగా కమిటీ పనిచేస్తుంది. పూర్తి నివేదికను సత్వరమే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కమిటీ అందజేస్తుంది. ఈ నెల 3న ప్రారంభం కానున్న శాసనసభలోనే ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే బిల్లును ప్రవేశపెడతామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
Read Also : CM KCR: రాజ్‌భవన్‌లు బీజేపీ కార్యాలయాలుగా మారాయి.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు