Virat Kohli Assets: టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీకి (Virat Kohli) ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ ప్రత్యేకమైనది. అగ్రెసివ్‌నెస్‌కు మారుపేరుగా నిలిచిన కింగ్ కోహ్లీకి అటు మైదానంలోనే కాక సోషల్ మీడియాలోనూ అభిమానులు భారీ సంఖ్యలోనే ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉండే విరాట్‌ను ఇక్క ఇన్‌స్టా గ్రామ్‌లోనే (Instagram) 252 మిలియన్లకుపైగా ఫాలో అవుతున్నారు. ఐపీఎల్‌తోపాటు ఐసీసీ, బీసీసీఐ నిర్వహించే టోర్నీల్లో కోహ్లీ అత్యంత యాక్టివ్‌గా తోటి సభ్యులతో సరదాగా గడుపుతుంటాడు. తాజాగా కోహ్లీ ఆస్తులపై (Virat Kohli Assets) కీలక సమాచారం వెల్లడైంది.
కింగ్ కోహ్లీకి క్రికెట్‌లో ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విరాట్ ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. అతడి నికర ఆస్తులు వెయ్యి కోట్ల రూపాయల పైనే ఉంటాయని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్టాక్ గ్రో (Stock Gro) అనేక సంస్థ వెల్లడించింది. ఆ సంస్థ తెలిపిన గణాంకాల ప్రకారం.. కోహ్లీ నికర ఆస్తుల విలువ రూ.1050 కోట్లు అని తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా చాలామంది క్రికెటర్లు ఆర్జిస్తున్న ఆదాయం కంటే ఇది చాలా రెట్లు ఎక్కువ అని తేలింది. ఇండియన్ క్రికెటర్లలోనూ ఈ స్థాయికి చేరుకున్నది అతి కొద్ది మందే.
పరుగుల వీరుడు, రికార్డుల రారాజు, ఛేజ్ మాస్టర్‌గానూ కింగ్ కోహ్లీకి పేరుంది. అండర్19 వరల్డ్ కప్ గెలవడం మొదలు.. టీమిండియాలోనూ కోహ్లీ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. భారత జట్టు ఏ+ కేటగిరీ కాంట్రాక్ట్‌లో ఉన్న కోహ్లీ.. బీసీసీఐ నుంచి ఏటా రూ.7 కోట్లు ఆర్జిస్తున్నాడు. కోహ్లీ ఆడే ప్రతి టెస్టు మ్యాచ్‌కు రూ.15 లక్షల చొప్పున ఆర్జిస్తున్నాడు. అలాగే వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌కు రూ.6 లక్షలు, టీ20 మ్యాచ్‌కు రూ.3 లక్షల చొప్పున కోహ్లీ ఆదాయం పొందుతున్నాడు. ఇలా అధికారికంగానే కోహ్లీకి అత్యధికంగా ఆదాయం సమకూరుతోంది.
మరోవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్న కోహ్లీ.. ఏడాదికి రూ.15 కోట్లు ఆర్జిస్తున్నాడు. ఇదే కాకుండా విరాట్‌కు సొంతంగా కూడా పలు బ్రాండ్లు ఉన్నాయి. వాటిలో బ్లూట్రైబ్, యూనివర్సల్ స్పోర్ట్స్ బిజ్, ఎంపీఎల్, స్పోర్ట్స్ కాన్వో వంటి ఏడు రకాల స్టార్టప్‌లలో కోహ్లీ ఇన్వెస్ట్‌మెంట్లు పెట్టాడు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 18 బ్రాండ్లకు విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఒక్కో వాణిజ్య ప్రకటనలో నటించేందుకు కోహ్లీ దాదాపు రూ.7.50 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు తీసుకుంటున్నాడు.
వాణిజ్య ప్రకటనల్లో ప్రచారకర్తగా చేసినందుకే సుమారు రూ.175 కోట్ల వరకు సంపాదిస్తున్నాడు కింగ్ కోహ్లీ. ఇక సామాజిక మాధ్యమాల్లోనూ కోహ్లీదే పైచేయిగా ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీ పెట్టే ఒక్కో పోస్టుకు రూ.8.9 కోట్లు చార్జ్ చేస్తున్నాడు. మరోవైపు ట్విట్టర్‌లోనూ ఒక్కో పోస్టుకుగానూ రూ.2.5 కోట్లను తీసుకుంటున్నాడు.
విరాట్‌కు రూ.34 కోట్ల విలువైన లగ్జరీ హౌస్ ఉంది. ఇది ముంబైలో ఉంది. 80 కోట్ల రూపాయల విలువైన మరో ఇల్లు గురుగ్రామ్‌లో తీసుకున్నాడు. వీటితోపాటు విరాట్ కోహ్లీకి కార్లంటే మహా ఇష్టం. సుమారు రూ.31 కోట్ల విలువ చేసే విలాసవంతమైన కార్లు కోహ్లీకి ఉన్నాయి. వీటితోపాటు విరాట్‌కు ఎఫ్‌సీ గోవా ఫుట్‌బాల్ క్లబ్, టెన్నిస్ జట్టు, ప్రో రెజ్లింగ్ జట్టు కూడా ఉంది. ఇలా మొత్తంగా విరాట్ కోహ్లీ నికర ఆస్తుల విలువ వెయ్యి కోట్ల రూపాయలకుపైగానే ఉందని స్టాక్ గ్రో పేర్కొంది.
Read Also : Virat Kohli : డోంట్ మెస్ విత్ కింగ్ కోహ్లీ.. ఎవరిది వాళ్లకిచ్చేయడం విరాట్ స్పెషల్!