Pradhan Mantri Suraksha Bima Yojana: ప్రమాదంలో కంటి చూపు పోయినా, చేయి లేదా కాలు పనిచేసే శక్తిని శాశ్వతంగా కోల్పోయినా కుటుంబ ఆదాయంపై ప్రభావం పడుతుంది. అలాంటి సమయంలో బాధితుడికి, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే అతని కుటుంబానికి ఆర్థిక సాయం అందించే కేంద్ర ప్రభుత్వ పథకమే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY). ఏడాదికి రూ.20 ప్రీమియంతో ఇందులో చేరవచ్చు. ప్రమాదం వల్ల జరిగిన నష్టాన్ని బట్టి రూ.లక్ష లేదా రూ.2 లక్షల పరిహారం లభిస్తుంది. jansuraksha.gov.in
ఏ ప్రమాదానికి ఎంత పరిహారం వస్తుంది?
| ప్రమాదం వల్ల జరిగిన నష్టం | బీమా పరిహారం |
|---|---|
| సభ్యుడు ప్రాణాలు కోల్పోతే | రూ.2 లక్షలు |
| రెండు కళ్లలోనూ చూపు పూర్తిగా, శాశ్వతంగా పోతే | రూ.2 లక్షలు |
| రెండు చేతులు లేదా రెండు కాళ్లు ఉపయోగించే శక్తిని పూర్తిగా, శాశ్వతంగా కోల్పోతే | రూ.2 లక్షలు |
| ఒక కంటిలో చూపుతోపాటు ఒక చేయి లేదా ఒక కాలును ఉపయోగించే శక్తి పూర్తిగా, శాశ్వతంగా పోతే | రూ.2 లక్షలు |
| ఒక కంటిలో చూపు లేదా ఒక చేయి లేదా ఒక కాలును ఉపయోగించే శక్తి పూర్తిగా, శాశ్వతంగా పోతే | రూ.లక్ష |
ఉదాహరణకు, రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి చికిత్స తర్వాత కోలుకుంటే ఆసుపత్రి బిల్లులను ఈ పథకం చెల్లించదు. అదే ప్రమాదంలో ఆ కాలును ఉపయోగించే శక్తి పూర్తిగా, శాశ్వతంగా పోతే రూ.లక్ష పరిహారానికి క్లెయిమ్ చేయవచ్చు. వరదలు, భూకంపాల వల్ల సంభవించే మరణం లేదా పైన పేర్కొన్న శాశ్వత వైకల్యం కూడా కవరవుతుంది. హత్యకు గురై మరణిస్తే బీమా వర్తిస్తుంది. సహజ మరణం, అనారోగ్యంతో మరణం, ఆత్మహత్య పథకం పరిధిలోకి రావు. jansuraksha.gov.in
ఎవరు అర్హులు? కుటుంబ సభ్యులంతా చేరవచ్చా?
పథకంలో పాల్గొనే బ్యాంకు లేదా పోస్టాఫీసులో వ్యక్తిగత ఖాతా ఉండి, 18 ఏళ్లు నిండినవారు చేరవచ్చు. 70 ఏళ్ల వయోపరిమితికి చేరుకున్నప్పుడు బీమా ముగుస్తుంది. భార్యాభర్తలకు జాయింట్ ఖాతా ఉంటే అర్హులైన ఇద్దరూ అదే ఖాతా ద్వారా ఒక్కొక్కరు రూ.20 చొప్పున చెల్లించి విడివిడిగా బీమా పొందవచ్చు. ఒకే వ్యక్తికి ఎన్ని బ్యాంకు ఖాతాలున్నా PMSBY కింద ఒక ఖాతా ద్వారానే బీమా లభిస్తుంది.
ఎలా చేరాలి? బీమా ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది?
మీ ఖాతా ఉన్న బ్యాంకు లేదా పోస్టాఫీసు శాఖలో PMSBY దరఖాస్తు ఫారం తీసుకోవాలి. అందులో ఖాతా వివరాలు, నామినీ వివరాలు నమోదు చేసి, ఏటా ప్రీమియాన్ని ఖాతా నుంచి నేరుగా తీసుకునేందుకు సమ్మతి ఇవ్వాలి. సాధారణ బీమా కాలం జూన్ 1 నుంచి మరుసటి ఏడాది మే 31 వరకు. మధ్యలోనూ చేరవచ్చు. ఉదాహరణకు, 2026 నవంబర్ 26న కొత్తగా చేరి అదే రోజు ప్రీమియం కట్ అయితే, ఆ రోజు నుంచి 2027 మే 31 వరకు కవరేజీ ఉంటుంది. తర్వాతి సంవత్సరానికి పునరుద్ధరణ సమయంలో ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉండాలి. ఖాతా మూసివేసినా, బ్యాలెన్స్ లేక ప్రీమియం చెల్లించలేకపోయినా కవరేజీ ఆగుతుంది.
ప్రమాదం జరిగితే క్లెయిమ్ ఎలా చేయాలి?
ప్రమాదం జరిగిన వెంటనే బీమాలో చేరిన బ్యాంకు లేదా పోస్టాఫీసు శాఖకు సమాచారం ఇవ్వాలి. ప్రమాద తేదీ నుంచి వీలైనంతవరకు 30 రోజుల్లో క్లెయిమ్ ఫారం సమర్పించాలని అధికారిక ఫారంలో సూచించారు. శాశ్వత వైకల్యం కలిగితే సభ్యుడే దరఖాస్తు చేయాలి. సభ్యుడు మరణిస్తే నామినీ, నామినీ మైనర్ అయితే ముందుగా పేర్కొన్న ప్రతినిధి దరఖాస్తు చేయవచ్చు. నామినీ లేకపోతే చట్టబద్ధ వారసులు వారసత్వ ధ్రువపత్రంతో క్లెయిమ్ చేయవచ్చు.
| క్లెయిమ్ రకం | సమర్పించాల్సిన పత్రాలు |
|---|---|
| ప్రమాద మరణం | సాధారణంగా మరణ ధ్రువీకరణ పత్రం లేదా ఆమోదిత సమాన ఆధారం, ఎఫ్ఐఆర్ లేదా పంచనామా, పోస్టుమార్టం నివేదిక. పాముకాటు, చెట్టుపై నుంచి పడటం వంటి సందర్భాల్లో మరణానికి కారణం సహా నిర్దేశిత వివరాలున్న ఆసుపత్రి రికార్డును ప్రత్యామ్నాయంగా సమర్పించవచ్చు. |
| శాశ్వత వైకల్యం | ఎఫ్ఐఆర్ లేదా పంచనామా, సివిల్ సర్జన్ జారీ చేసిన వైకల్య ధ్రువపత్రం, దానికి సంబంధించిన ఆసుపత్రి రికార్డు. |
| రెండు రకాల క్లెయిమ్‌లకు | పూర్తి చేసిన క్లెయిమ్ ఫారం, దరఖాస్తుదారు గుర్తింపు పత్రం, నగదు జమ కావాల్సిన ఖాతా పాస్‌బుక్ తొలి రెండు పేజీలు లేదా ఖాతా స్టేట్మెంట్ లేదా క్యాన్సెల్డ్ చెక్కు. |
తెలుగులో దరఖాస్తు, క్లెయిమ్ ఫారాలు కేంద్ర ప్రభుత్వ జన్ సురక్ష వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. పథకంపై సందేహాలకు జాతీయ టోల్‌ఫ్రీ నంబర్లు 1800-180-1111, 1800-110-001. తెలుగు ఫారాలు డౌన్లోడ్ చేసుకోండి. jansuraksha.gov.in
ఇవీ చదవండి: PMFBY: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనతో పంటకు రక్షణ.. ప్రీమియం ఎంత? నష్టం జరిగితే ఏం చేయాలి?
PMGKAY: మీ రేషన్ కార్డుపై నెలకు ఎన్ని కిలోలు ఉచితం? పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పూర్తి వివరాలు






