Modi Speech at Parliament: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై ప్రధాని నరేంద్ర మోదీ నోట మళ్లీ అదే పాత మాట వినిపించింది. యూపీఏ హయాంలో ఏపీ విభజన సరిగా జరగలేదని ప్రధాని పునరుద్ఘాటించారు. రెండు రాష్ట్రాలూ ఉత్సవాలు జరుపుకోలేకపోయాయని గుర్తు చేశారు. వాజ్ పేయి హయాంలో 3 రాష్ట్రాల విభజన సరిగా జరిగిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఏపీ విభజనపై లోక్ సభలో ప్రధాని మోదీ ప్రస్తావన రావడంతో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది. పాత పార్లమెంటు భవనంలో ప్రత్యేక సమావేశాలు ఇవాళ జరిగాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ పార్లమెంట్ లోనే తెలంగాణ ఏర్పాటు జరిగిందని గుర్తు చేశారు. యూపీఏ హయాంలో ఏపీ విభజన సరిగా జరగలేదని స్పష్టం చేశారాయన. (Modi Speech at Parliament)
లోక్‌సభలో మోదీ ఏమన్నారంటే..
“చరణ్‌సింగ్ గ్రామీణ శాఖను ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్ ఏర్పాడటానికి నిర్ణయాలు తీసుకుందీ ఈ సభలోనే. ఎమర్జెన్సీ నిర్ణయం జరిగింది ఈ సభలోనే. పీవీ నరసింహారావు ఆర్థిక శాఖకు పునాదులు వేశారు. పీవీ నరసింహారావు దేశ ప్రగతినే మార్చారు. ఆర్టికల్ 370పై ఇక్కడే నిర్ణయం తీసుకున్నాం. వన్ నేషన్ వన్ ట్యాక్స్‌ను ఇక్కడే అమలుపరిచాం. 3 రాష్ట్రాలను సామరస్యంగా ఏర్పాటు చేశాం. విద్వేశాలను రగిలించిన తెలంగాణ, ఏపీ విభజనను చూశాం. ఒక్క ఓటుతో ఓడిపోయిన ప్రభుత్వాన్ని చూశాం. (Modi Speech at Parliament)
తొలిసారి లోక్ సభ సభ్యుడిగా అడుగుపెట్టినప్పుడు ఈ భవనం గడపకు శిరసువంచి నమస్కరించా. ఈ భవనం భారత ప్రజల ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ఈ దేశంలోని అన్ని వర్గాల ప్రజల భావనలకు ఈ భవనం ప్రతీక. రైల్వే ప్లాట్ ఫామ్ నుంచి వచ్చిన వ్యక్తి ఈ సభలో అత్యున్నత స్థానం పొందాడు. ఇది భారత ప్రజాస్వామ్య చేతనకు నిదర్శనం. ప్రతి దేశం మనదేశ సామర్థ్యాన్ని, నిర్వహణ కౌశలాన్ని ప్రశంసించాయి.
ఆఫ్రికన్ యూనియన్ ను జీ-20లోకి తీసుకోవడం చారిత్రక ఘట్టం. భారతీయ విలువలు, ప్రమాణాలతోనే ఇదంతా సాధ్యమైంది. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ఈ సభలో మహిళలు తక్కువమంది ఉండేవారు. మహిళల సంఖ్యలో కాలక్రమంలో పెరుగుతూ వచ్చింది. ఈ 75 ఏళ్లో 7,500 ప్రజాప్రతినిధులు ఈ సభకు ఎన్నికయ్యారు. ఇంద్రజిత్ గుప్తా 3 ఏళ్ల పాటు ఈ సభలో సేవలు అందించి రికార్డు సృష్టించారు. 25 ఏళ్ల చంద్రమణి ముర్ము ఈ సభకు ఎన్నికైన అతిచిన్న వయస్కురాలు.
ఈ భవనం చారిత్రక ఘట్టాలకు వేదికైంది
ఈ చారిత్రక భవనం నుంచి మనం వీడ్కోలు తీసుకుంటున్నాం. స్వాతంత్రానికి ముందు ఈ భవనం బ్రిటిష్ లెజిస్లేచర్ కౌన్సిల్ గా ఉండేది. మనం కొత్త భవనంలోకి వెళ్లినా ఈ భవనం మనకు నిరంతరం ప్రేరణగా నిలుస్తుంది. ఈ భవనం భారత సువర్ణాధ్యాయానికి సాక్షీభూతం. ఈ భవనంలో జరిగిన చర్చలు, ప్రణాళికలు భారత గతిని మార్చాయి. భారత అభివృద్ధి ప్రతి అడుగులో ఈ భవనం మనకు కనిపిస్తుంది. భారత్ అభివృద్ధి వీచికలు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి.
75 ఏళ్లలో మనం సాధించింది ప్రపంచాన్ని అబ్బురపరిచింది. చంద్రయాన్-3 భారత సాంకేతిక, విజ్ఞాన అభివృద్ధికి నిదర్శనం. భారత శాస్త్ర సాంకేతిక నిపుణులకు ఈ భవనం నుంచి శతకోటి వందనాలు సమర్పిస్తున్నా. జీ-20 విజయం 140 కోట్ల మంది భారతీయులది. జీ-20లో భాగంగా దేశవ్యాప్తంగా జరిగిన వందల సమావేశాలకు అనేక నగరాలు వేదికయ్యాయి. జీ-20 సమావేశ నిర్వహణ భారత ప్రతిష్ఠను మరింత పెంచింది.
ప్రతి దేశం మనదేశ సామర్థ్యాన్ని, నిర్వహణ కౌశలాన్ని ప్రశంసించాయి. ఆఫ్రికన్ యూనియన్ ను జీ-20లో తీసుకోవడం చారిత్రక ఘట్టం. భారత్ నేడు ప్రపంచానికి మిత్రదేశంగా రూపొందింది. ప్రపంచంలో ప్రతి దేశం భారత్ ను మిత్రదేశంగా పరిగణిస్తోంది. ఈ భవనం వీడి వెళ్తున్నప్పుడు మనలో అనేక అనుభవాలు గుర్తుకువస్తున్నాయి. ఈ భవనంతో మనకు తీపి, చేదు అనుభవాలు ఎన్నో ఉన్నాయి. చర్చలు, వాదనలు ఎన్ని ఉన్నా ఈ భవనం మన గౌరవాన్ని పెంచింది.
జీ-20 సదస్సు అద్బుతంగా జరిగింది
భారత ఉజ్వల భవిష్యత్తుకు జీ-20 సదస్సు మార్గదర్శకం చేసింది. చంద్రయాన్-3 విజయంతో దేశానికి పేరు, ప్రఖ్యాతులు వచ్చాయి. ఉజ్వల భవిష్యత్తు దిశగా భారత్ పయనిస్తోంది. కొత్త సంకల్పం దిశగా మరిన్ని అడుగులు ముందుకు వేయాలి. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరిస్తుంది. భారత్ పురోగతిని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి.” అని మోదీ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ తప్పు చేసింది.. మీరు సరిదిద్దారా?
సుమారు పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఏపీ విభజనపై కాంగ్రెస్‌ను నిందించడం సబబేనా అని విశ్లేషణలు వస్తున్నాయి. పదేళ్లలో ఏనాడైనా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గురించి ఆలోచించారా? అని ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. కాంగ్రెస్ అన్యాయంగా, అశాస్త్రీయంగా విభజన చేస్తే, తొమ్మిదిన్నరేళ్లుగా మీరు లోటుపాట్లు సరిచేసే దిశగా ఆలోచన చేశారా? రాష్ట్రాల అభివృద్ధికి నిధులు ఇవ్వడం, రాష్ట్రాలు జీఎస్టీ కట్టడం, నిధులు షేర్ చేసుకోవడం ఏ ప్రభుత్వంలో ఉన్నా జరిగేదే. అయితే, ప్రత్యేకంగా నష్టపోయిన, అప్పులపాలై పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని ఏం చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రత్యేక హోదా ఇచ్చి, ఆర్థికలోటు పూడ్చి ఉంటే…?
విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని పార్లమెంటు సాక్షిగా ఇరు పక్షాలు హామీ ఇచ్చాయి. అయితే, ఎన్డీఏ అధికారం చేపట్టాక ఆర్థికసంఘం చెప్పలేదని, అసలు ప్రత్యేక హోదా అనేది ఉనికిలోలేనిదంటూ నేతలుమాట్లాడారు. ఇంకేముందీ.. ఏపీ మరింత ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతోంది. కొత్త పరిశ్రమలు రావాలంటే ప్రత్యేక హోదా వచ్చి ఉంటే మరింత మెరుగ్గా పరిస్థితులు ఉండేవని ఆర్థిక వేత్తలు స్పష్టం చేస్తున్నారు. ప్రత్యేక సాయం, ప్రత్యేక ప్యాకేజీ, పోలవరానికి నిధులు, ఆర్థిక లోటు పూడ్చేలా చేదోడు వాదోడుగా నిలవడం, రైల్వేజోన్లు, పరిశ్రమలు, ఇలా ఒక్కటేమిటి, ఏ రంగంలో చూసుకున్నా ఏపీలో విభజన నాటి నుంచి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే.
ఇదీ చదవండి: Modi on G20: జీ-20 సమావేశాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు