Parliament session: దేశంలో పేద వృద్ధ కళాకారులకు ఆర్థిక సాయంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వారి కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. 60 ఏళ్లు దాటి రూ.48 వేల లోపు ఆదాయం ఉంటే అర్హత ఉంటుందని పేర్కొంది. నెలకు రూ.6 వేల చొప్పున కేంద్రం అందజేస్తోందని తెలిపింది. (Parliament session)
ఈ మేరకు సోమవారం లోక్‌సభలో ఎంపీలు వైఎస్ అవినాశ్ రెడ్డి (వైఎస్సార్‌సీపీ), హేమ మాలిని (బీజేపీ), మన్నె శ్రీనివాస్ రెడ్డి (బీఆర్ఎస్), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (కాంగ్రెస్) అడిగిన ప్రశ్నలకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. వృద్ధ కళాకారులకు ఆర్థిక సహాయం అందించే పథకాన్ని కేంద్రం అమలు చేస్తోందని, 60 ఏళ్లు దాటి వార్షిక ఆదాయం రూ. 48 వేల లోపు ఉన్నవారికి ఈ పథకం వర్తిస్తుందని ఆయన క్లారిటీ ఇచ్చారు.
దేశ వ్యాప్తంగా వివిధ కళల్లో విశిష్ట సేవలందించిన కళాకారులు ఈ పథకం కింద సాయం పొందుతున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. పథకం కింద నెలకు రూ. 6,000 చొప్పున కళాకారులకు కేంద్ర సాంస్కృతిక శాఖ అందిస్తోందని చెప్పారు. ఈ పథకం కింద సాయం పొందేవారు ఏటా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
అలాగే ప్రతి ఐదేళ్లకు ఓసారి ఆదాయ ధృవీకరణ పత్రాన్ని ప్రభుత్వానికి సమర్పించాలన్నారు. ఈ పథకం కింద 2020-21లో రూ. 8.71 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అలాగే 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆ మొత్తం రూ.18.59 కోట్లకు చేరుకుందని కిషన్‌రెడ్డి పార్లమెంటులో వెల్లడించారు.