Srivari Kalyanotsavalu UK : యూకే, యూరప్ దేశాలలో అత్యంత వైభవోపేతంగా టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామివారి కల్యాణోత్సవాలు నిర్వహించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో యూకేలో అక్టోబర్ 10వ తేదీన బెల్ ఫాస్ట్, 12న బేసింగ్ స్టోక్, 14న మిల్టన్ కీన్స్, 15వ తేదీన గ్లూస్టర్ నగరాల్లో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. (Srivari Kalyanotsavalu UK)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగసంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ మొదటి నుంచి టీటీడీతో ఒకవైపు, ఆయా నగరాల కార్యనిర్వాహక వర్గాలతో మరోవైపు సమన్వయం చేస్తూ వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం కల్యాణోత్సవం జరిగేలా చూసుకుంది. అక్కడి నిర్వాహకులు… భక్తులు, అర్చకులు, వేదపండితులకు, తితిదే అధికారులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేశారు.
ఆయా నగరాల్లో జరిగిన కల్యాణోత్సవాల్లో భక్తులు వేల సంఖ్యలో పాల్గొని ప్రత్యక్షంగా స్వామివారి కల్యాణాన్ని వీక్షించారు. బెల్ ఫాస్ట్ – నార్త్ ఐర్లాండ్ లో జి.రమేష్, సతీష్, బేసింగ్ స్టోక్ – లండన్ లో ఎం.అరుణ్, శ్రీని, మిల్టన్ కీన్స్ లో ఎం.లోకనాధ, సి.జనార్ధన్, గ్లూస్టర్ లో శివరామ ఇ.నరసింహ, ఎ.శివ వారితో కలిసి ఉన్న తెలుగు సంఘాలు, ధార్మిక, సేవా సంస్థల సభ్యులు స్వామివారి కల్యాణానికి కావలసిన ఏర్పాట్లు చేశారు.
యూకే, యూరప్ దేశాలలో స్థిరపడిన తెలుగు, భారతీయుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 30వ తేదీ నుండి నుండి అక్టోబర్ 15వ తేదీ వరకు తొమ్మిది (09) నగరాలలో శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవాలు ఘనంగా జరిగాయి. వైఖానస ఆగమం ప్రకారం టీటీడీ నుంచి వెళ్లిన అర్చకులు, వేదపండితులు ఈ కల్యాణోత్సవాలను నిర్వహించారు. అన్ని నగరాలలో శ్రీ మలయప్ప స్వామివారి కల్యాణోత్సవానికి అశేష సంఖ్యలో ఎన్నారై భక్తులు ప్రత్యక్షంగా హాజరయ్యి స్వామివారి కల్యాణాన్ని వీక్షించి, భక్తి పరవశంలో పులకించారు. ఈ కల్యాణోత్సవాలకు ఏపీ ప్రభుత్వ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ సమన్వయ సహకారం అందించింది.
ప్రతి ఏటా ప్రపంచంలోని వివిధ దేశాలలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి కల్యాణం నిర్వహించాలని భక్తులు, తెలుగు, భారతీయ సంస్థలు ముందుకువస్తే, ఆయా దేశాలలో శ్రీవారి కల్యాణం నిర్వహించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని ఏపీఎన్‌ఆర్‌టీఎస్ అధ్యక్షుడు వెంకట్ తెలిపారు.
గత 16 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 45 నగరాల్లో తిరుమల శ్రీవారి కల్యాణం నిర్వహించామన్నారు. ఈ కల్యాణోత్సవాల్లో దాదాపు రెండు లక్షలకు పైగా ఎన్నారై భక్తులు పాల్గొన్నారు. తెలుగు, భారతీయ భక్తులతో పాటు అక్కడ స్థానికంగా ఉన్న వారుకూడా అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణ ఘట్టాన్ని వీక్షించి ఆశీర్వాదాలు అందుకున్నారన్నారు.