Zelensky Comments: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ప్రపంచం చంపాలనుకుంటోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. యుద్ధం కారణంగా రష్యా (Russia) కిరాయి సైన్యం వాగ్నర్ (Wagner) గ్రూపు బాగా దెబ్బతినిందని జెలెన్‌స్కీ (Zelensky Comments) చెప్పారు. దీంతోపాటు ప్రపంచం పుతిన్‌ను హతమార్చాలని ప్లాన్ చేస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు జెలెన్‌స్కీ. స్పెయిన్ ప్రధాన మంత్రి కీవ్‌లో పర్యటించిన సందర్భంగా జెలెన్‌స్కీ.. స్పానిష్ మీడియాతో మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine War) మధ్య యుద్ధంలో కిరాయి సైన్యం తీవ్రంగా నష్టపోయిందని జెలెన్‌స్కీ పేర్కొన్నారు.
తమ బలగాలు దాదాపు తూర్పు ఉక్రెయిన్‌లోనే 21,000 మంది వాగ్నర్ సైనికులను హతమార్చాయని వెల్లడించారు జెలెన్‌స్కీ. మరో 80 వేల మంది ఆ గ్రూప్ సైనికులు గాయపడ్డారని చెప్పారు. వాగ్నర్ పీఎంసీ భారీగా నష్టపోయిందని, రష్యా సైన్యం ప్రేరేపిత మూకగా తాము వారిని చూస్తామని స్పష్టం చేశారు. వారంతా ఖైదీలని, వారి వద్ద కోల్పోవడానికి ఏమీ లేదంటూ జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. పుతిన్‌పై వాగ్నర్ బాస్ ప్రిగోజిన్ తిరుగుబాటు చేసిన వారం తర్వాత జెలెన్‌స్కీ ఈ తరహాలో వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే జెలెన్‌స్కీ మాట్లాడిన అనంతరం ఓ మీడియా ప్రతినిధి ఆసక్తికర ప్రశ్న వేశాడు.
మీకు ప్రాణభయం లేదా..? అని జెలెన్‌స్కీని ప్రశ్నించడంతో.. దీనికి ఆయన సమాధానం ఇచ్చారు. నిజం చెప్పాలంటే.. ప్రస్తుత పరిస్థితి తనకంటే పుతిన్‌కే ఎక్కువ ప్రమాదకరంగా పరిణమిస్తోందని కామెంట్ చేశారు. కేవలం రష్యాలో మాత్రమే కొందరు తనను హతమార్చాలని చూస్తున్నారని, ప్రపంచం మొత్తం పుతిన్‌ను చంపాలని అనుకుంటోందన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న వారిని ఆలోచింపజేస్తున్నాయి. దాదాపు ఏడాదిన్నరగా యుద్ధం కొనసాగుతున్నప్పటికీ, ప్రపంచ దేశాలు ఎన్నిసార్లు చెప్పినా పుతిన్ వినడం లేదు.
తాజాగా సుమారు 12 రోజుల వ్యవధి తర్వాత రష్యా మరోసారి ఉక్రెయిన్‌పై డ్రోన్లతో దాడి చేసింది. రాజధాని కీవ్‌పై డ్రోన్లు దాడి చేసిన విషయాన్ని ఉక్రెయిన్ సైనిక వర్గాలు ధ్రువీకరించాయి. తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ వాటిని కూల్చివేసిందని పేర్కొన్నాయి. ఇంకోసారి శత్రువులు కీవ్‌పై దాడి చేశారని సైనిక వర్గాలు తెలిపాయి. అయితే, ఈసారి ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టానికి సంబంధించిన సమాచారం లేదని కల్నల్ జనరల్ సెర్హీ పాప్కోవ్ టెలిగ్రామ్ ఛానెల్‌లో వివరాలు తెలిపారు. స్పెయిన్ ప్రధాని పర్యటన సమయంలో ఇలాంటి దాడులు జరగడంతో అలజడి రేగుతోంది.
మరోవైపు జెలెన్‌స్కీ ఖాకీ స్వెట్ షర్ట్‌లో మొన్నామధ్య అమెరికాలో పర్యటించడం తెలిసిందే. రష్యాతో యుద్ధం మొదలైనప్పటి నుంచి జెలెన్‌స్కీ మిలిటరీ రంగు దుస్తులనే ధరిస్తున్నారు. యుద్ధ క్షేత్రంలో పర్యటిస్తున్న జెలెన్‌స్కీ.. సైనికుల్లో మరింత ఆత్మవిశ్వాసం పెంపొందించే ప్రయత్నాలు చేశారు. జెలెన్‌స్కీ అమెరికన్ పర్యటన సందర్భంగా జో బైడెన్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ ఎప్పటికీ ఒంటరి కాదని, అమెరికా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పెద్దన్న అండగా నిలవడంతో ఇక రష్యాతో యుద్ధం రసవత్తరంగా మారనుందనే విశ్లేషణలు వస్తున్నాయి.
ఇక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. (PM Narendra Modi) ఉక్రెయిన్ చీఫ్ జెలెన్‌స్కీని మొన్నామధ్య కలిశారు. జపాన్ (Japan) దేశంలో జరుగుతున్న జీ7 సదస్సు క్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. జెలెన్‌స్కీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలు పెట్టిన నేపథ్యంలో భారత్, ఉక్రెయిన్ దేశాల అధ్యక్షులు నేరుగా కలవడం అదే తొలిసారి. ఈ క్రమంలోనే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వివాదాన్ని మానవత్వానికి సంబంధించిన సమస్యగా భారత ప్రధాని అభివర్ణించిన సంగతి తెలిసిందే.
Read Also: Zelensky: పుతిన్‌కు త్వరలో శిక్ష తప్పదు.. పాపం అనుభవిస్తాడు!