Joinings in YSRCP: గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు అత్యంత సన్నిహితుడిగా, ప్రముఖ కాపు నాయకుడిగా గుర్తింపు పొందిన గూడపాటి శ్రీనివాసరావు (జీఎస్) తన అనుచరులతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో గూడపాటి శ్రీనివాసరావు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
హృదయపూర్వక స్వాగతం
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ, “జీఎస్ అన్నతో పాటు ఈరోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికీ పార్టీ కుటుంబంలోకి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. జీఎస్ అన్నను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. ఆయన పార్టీ బలోపేతానికి అన్ని విధాలా కృషి చేస్తారని నమ్ముతున్నాను” అని అన్నారు. రేపల్లె నియోజకవర్గంలో పార్టీ ఇన్‌చార్జ్ పీటా నాగమోహనకృష్ణను తమ్ముడిగా భావించి, రాబోయే ఎన్నికల్లో ఆయన విజయానికి అందరూ కలిసి పనిచేయాలని జగన్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గూడపాటి శ్రీనివాసరావు రాకతో ముఖ్యంగా రేపల్లె పట్టణంలో వైఎస్సార్‌సీపీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని వెంకట్రామయ్య (నాని), మేరుగు నాగార్జున, ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, రేపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జ్ పీటా నాగమోహనకృష్ణతో పాటు పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: YS Jagan tweet: నారాసుర పాలనలో అరాచకం పరాకాష్టకు చేరింది: వైఎస్ జగన్
YS Jagan in Srikakulam: యాక్సిడెంట్‌ను హత్య కేసుగా మారుస్తారా? సీదిరి అప్పలరాజు కుటుంబంపై ప్రభుత్వం కుట్ర: జగన్ ఫైర్
YS Jagan Delhi Tour: వచ్చేవారం ఢిల్లీకి వైఎస్ జగన్? మోడీ-అమిత్ షాతో భేటీ? రాజకీయ సమీకరణాలు మారనున్నాయా?






